అమెరికా సుంకాలు పెంచుతుండటంతో, వాణిజ్య ఒత్తిడిని ఎదుర్కొనేందుకు EU, ASEANలతో చైనా పొత్తులు పెట్టుకుంటోంది. బహుళ వాణిజ్యాన్ని సమర్థించడం, అమెరికా రక్షణ చర్యల ప్రభావాన్ని పరిష్కరించడంపై చర్చలు జరుగుతున్నాయి.
China–United States trade war : చైనా దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 125 శాతం సుంకం విధించి వాణిజ్య యుద్ధానికి దిగిన విషయం తెలిసిందే. దీంతో బీజింగ్ యూరోపియన్ యూనియన్ (EU), ఆసియాన్ దేశాలతో కలిసి ఒక కూటమిగా ఏర్పడి అమెరికాను వెనక్కి తగ్గించే ప్రయత్నం చేస్తోంది.
గురువారం నుంచి అమల్లోకి వచ్చేలా అమెరికా వస్తువులపై 84 శాతం సుంకం విధిస్తూ చైనా ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అలాగే 27 దేశాలతో కూడిన యూరోపియన్ యూనియన్ పై కూడా ట్రంప్ సుంకాలను 25 శాతం వరకు పెంచింది. దీంతో చైనా ఈయూ, ఆసియాన్ దేశాలతో జతకట్టి యూఎస్ ను ఎదుర్కొనేందుకు సిద్దమవుతుంది. ఆ దిశగా పావులు కదుపుతోంది.
చైనా వాణిజ్య మంత్రి వాంగ్ వెంటావో, యూరోపియన్ కమిషనర్ ఫర్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ సెక్యూరిటీ మరోస్ సెఫ్కోవిక్ మంగళవారం వీడియో ద్వారా చర్చలు జరిపారు. చైనా-ఈయూ ఆర్థిక, వాణిజ్య సహకారాన్ని పెంచడం, అమెరికా విధించిన 'పరస్పర సుంకాలను' ఎదుర్కోవడం గురించి చర్చించారని వాణిజ్య మంత్రిత్వ శాఖ (MOFCOM) గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ సందర్భంగా చైనా మంత్రి వాంగ్ మాట్లాడుతూ... అమెరికా 'పరస్పర సుంకాలు' ఇతర దేశాల చట్టబద్ధమైన ప్రయోజనాలను తీవ్రంగా ఉల్లంఘిస్తున్నాయని, WTO నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని దెబ్బతీస్తున్నాయని అన్నారు. అమెరికా చర్య సాధారణంగా 'ఏకపక్ష విధానం, రక్షణవాదం, ఆర్థిక బెదిరింపు' అని వాంగ్ అన్నారు. సంప్రదింపులు, చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించడానికి చైనా సిద్ధంగా ఉందని, అయితే అమెరికా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చివరి వరకు పోరాడుతుందని ఆయన అన్నారు.
మార్కెట్ యాక్సెస్ సమస్యలపై త్వరలో సంప్రదింపులు ప్రారంభించడానికి, ఎలక్ట్రిక్ వాహనాల ధరల ఒప్పందాలపై చర్చలు ప్రారంభించడానికి, ద్వైపాక్షిక పెట్టుబడి సహకారానికి సంబంధించిన సమస్యలపై చర్చలు జరపడానికి చైనా, ఈయూ అంగీకరించాయని అధికారిక జిన్హువా ఏజెన్సీ తెలిపింది.