
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)మరోసారి భారత్ విషయంలో జోక్యం చేసుకుంటున్నారు. తన నీచ బుద్దిని మరోసారి ప్రదర్శించారు. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో (Putin) భేటీకి సిద్ధమైన డొనాల్డ్ ట్రంప్ మరోసారి మళ్లీ భారత్–పాకిస్తాన్ మధ్య జరిగిన ఘర్షణపై షాకింగ్ కామెంట్స్ చేశారు. గత ఆరు నెలల్లో తాను ఆరు యుద్ధాలను ఆపానని, అందులో భారత్–పాక్‌ల యుద్దమనీ, ఇరుదేశాల అణుయుద్ధం దాకా వెళ్లే పరిస్థితిని తానే పరిష్కరించానని ప్రకటించారు.
తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ మీడియాతో మాట్లాడుతూ.. "భారత్–పాక్‌ల మధ్య యుద్ధం జరిగింది. ఇరుదేశాలు ఒకరిపై మరొకరు యుద్దవిమానాలతో కాల్పులు జరుపుకున్నారు. ఈ క్రమంలో ఆరు లేదా ఏడు విమానాలు కూలిపోయాయి. పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారి, వారు అణ్వాయుధాలను ఉపయోగించే స్థితికి వచ్చింది. కానీ, మేమే ఆ ఘర్షణను ఆపేశాం" అని ట్రంప్ తెలిపారు. మే 10న ఆయన తన సోషల్ మీడియా ద్వారా భారత్–పాక్ కాల్పుల విరమణ తన కృషి ఫలితమని పేర్కొన్నారు.
అయితే.. ఈ వ్యాఖ్యలతో పాటు ట్రంప్ భారత్‌పై సుంకాల పెంపు బెదిరింపులు చేశారు. భారత్‌పై 50% పరస్పర సుంకం విధించనున్నట్లు, రష్యా నుండి చమురు దిగుమతులు కొనసాగిస్తే అదనపు జరిమానాలు కూడా అమలు చేస్తామని హెచ్చరించారు. రష్యా చమురు కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్లో అమ్మడం ద్వారా భారత్ ఉక్రెయిన్ యుద్ధానికి ఆజ్యం పోస్తోందని ఆయన ఆరోపించారు. గతంలో 25% అమ్మకపు పన్ను విధిస్తుండగా.. అదనంగా 25% సుంకం విధించారు. దీంతో భారతీయ వస్తువులపై దిగుమతిపై 50% సుంకం అమల్లో రానున్నది. ఈ సుంకం ఆగస్టు 27 నుండి అమలులోకి రానున్నది.
పుతిన్‌తో ట్రంప్ భేటీ.. ప్రపంచ దేశాల్లో ఉత్కంఠ
ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ముగింపు కోసం కృషి చేస్తున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నేడు ( ఆగస్టు 15) రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Putin)తో భేటీ కానున్నారు. అలాస్కాలోని యాంకరేజ్ ఎల్మెండోర్ఫ్–రిచర్డ్‌సన్ బేస్‌లో ఈ సమావేశం జరుగనున్నది.
ట్రంప్ అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో పుతిన్‌తో ఇప్పటికే ఆరు సార్లు సమావేశమయ్యారు. అయితే, రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రష్యా అధ్యక్షుడితో ట్రంప్ తొలి భేటీగా కానున్నారు. ఈ సమావేశం ఉక్రెయిన్–రష్యా మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
భారత్–పాక్ వివాదం: ఆపరేషన్ సిందూర్
మే 7న తెల్లవారుజామున 1.30 గంటలకు, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం "ఆపరేషన్ సిందూర్" నిర్వహించింది. ఈ దాడిలో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని సైన్యం వెల్లడించింది. లక్ష్యాలలో లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయం, జైష్–ఏ–మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ రహస్య స్థావరం ఉన్నాయి. వైమానిక దళ చీఫ్ ఏపీ సింగ్ ప్రకారం, ఈ ఆపరేషన్‌లో 5 పాకిస్తాన్ యుద్ధ విమానాలు కూల్చివేయబడ్డాయి. అదనంగా, 300 కి.మీ దూరం నుండి ఒక నిఘా విమానాన్ని కూడా ధ్వంసం చేసినట్టు తెలిపారు. ఇది భారత్ చరిత్రలోనే సరికొత్త రికార్డు అని తెలిపారు.
పాక్ ప్రతిస్పందన
పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్, భారత దాడులకు ప్రతిస్పందనగా 5 భారత యుద్ధ విమానాలను కూల్చివేశామని పేర్కొన్నారు. తరువాత పాక్ 6 విమానాలు కూల్చివేశామని ప్రకటించింది. జూలై 11న పాక్ విదేశాంగ ప్రతినిధి షఫ్కత్ అలీ ఖాన్, భారత్ తన నష్టాలను అంగీకరించాలని డిమాండ్ చేశారు.
అయితే, భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) అనిల్ చౌహాన్, పాక్ వాదనలను ఖండించారు. "ఎన్ని విమానాలు కూలిపోయాయన్నది కాదు, అవి ఎందుకు కూలిపోయాయి, దాంతో మనం ఏమి నేర్చుకున్నామన్నది ముఖ్యం. అణ్వాయుధాల ఉపయోగం అవసరం ఎప్పుడూ రాలేదు" అని ఆయన స్పష్టం చేశారు.