లెక్కల టీచర్ గా మారిన ఆర్థిక మంత్రి హరీష్

By Arun Kumar PFirst Published Dec 28, 2019, 3:32 PM IST
Highlights

తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు సంగారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా  కంది ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల విద్యా ప్రమాణాలను పరీక్షించారు.  

సంగారెడ్డి: ప్రభుత్వ, రాజకీయ కార్యకలాపాలతో నిత్యం తీరిక లేకుండా‌ గడిపే ఆర్థిక మంత్రి హరీష్ రావు మాస్టర్ అవతారమెత్తారు. సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన మంత్రి హరీష్ కంది లోని జిల్లా పరిషత్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మద్యాహ్న భోజనం నాణ్యత ను పరిశీలించారు. 

మద్యాహ్న భోజనం ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం ‌అందిస్తున్నారా లేదా అని ప్రశ్నించారు. అనంతరం ఆయన పదో తరగతి గదికి వెళ్లి మాస్టారు అవతారమెత్తారు.

 త్వరలో పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ నేపథ్యంలో మంత్రి  మ్యాథ్స్‌ సబ్జెక్టు లో‌ విద్యార్థుల విషయ పరిజ్ఞానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఒక్కోక్కరుగా పిలిచి ఎక్కాలు చెప్పమని మంత్రి అడిగారు. 17వ ఎక్కం‌ చెప్పాలని కొందరు విద్యార్థులను అడగడంతో ఏ ఒక్కరూ చెప్పలేకపోయారు. కనీసం 12,13 ఎక్కాలు‌ చెప్పమన్నా కొందరు‌ చెప్పలేక పోయారు. దీంతో హరీష్ ‌రావు స్కూల్ ప్రధానోపాధ్యాయుడు, లెక్కలు‌చెప్పే టీచర్ పై అసంతృప్తి ‌వ్యక్తం‌ చేశారు. 

READ MORE నా భార్యకు కూడా టికెట్ ఇవ్వను, కానీ చైర్ పర్సన్...: జగ్గారెడ్డి

చివరకు  విద్యార్థులను ఎంత వరకు ఎక్కాలు వచ్చని  మంత్రి అడిగారు. వారు కేవలం పది వరకు మాత్రమే ఎక్కాలు ‌వచ్చని చెప్పడంతో పదో తరగతి ‌విద్యార్థులకు పదో ఎక్కం‌‌ వరకే‌ చెబుతారా ? అని మంత్రి అసహనం ‌వ్యక్తం‌ చేశారు.

ఆ తర్వాత ప్రధానోపాధ్యాయుడుతో పాటు కొందరి పేర్లు తెలుగు, ఇంగ్లీషు, ‌హిందీలో  రాయాలని మరి కొద్ది మంది విద్యార్థులను పిలిచి బోర్డుపై రాయాలని కోరారు. తరగతి గదిలో ఒక్క విద్యార్థిని మాత్రమే మూడు భాషలలో పేర్లు రాయడంతో మంత్రి ఆ విద్యార్థిని అభినందించారు. ఎక్కువ మంది విద్యార్థులు తెలుగులోను ‌తప్పులు రాయడంతో మంత్రి హరీష్ అవాక్కయ్యారు. 

ఆ తర్వాత‌‌ సోషల్‌సబ్జెక్టు నుండి కొన్ని ప్రశ్నలు వేశారు. రాష్ట్ర రాజధానిలు, దేశ రాజధాని గురించి అడిగినా విద్యార్థులు సరిగా చెప్పలేకపోయారు. దీంతో మంత్రి ఉపాధ్యాలుపై ఆగ్రహం ‌వ్యక్తం‌ చేశారు. ఇలా చదివితే పిల్లలు పదో తరగతి ఎలా పాసవుతారని ప్రశ్నించారు. 

READ MORE  తెలంగాణ కాంగ్రెస్ కు షాక్...కాళేశ్వరంపై తమిళిసై కీలక వ్యాఖ్యలు

కనీసం తెలుగులో పేర్లను పదో తరగతి విద్యార్థులు రాయలేకపోవడమేంటని ప్రశ్నించారు. విద్యలో నాణ్యత లేకపోతే ఈ పిల్లలు పోటీ ప్రపంచంలో ఎలా నెగ్గుకు వస్తా రన్నారు. ఈ పరిస్థితులు మారాలని మంత్రి హరీష్ ఉపాధ్యాయులను ఆదేశించారు.

click me!