ఎల్‌బి న‌గ‌ర్ చౌరస్తా మూసివేత

First Published Oct 8, 2017, 12:20 PM IST
Highlights
  • ఎల్‌బి నగర్ చౌరస్తా వద్ద ట్రాపిక్ నియంత్రనకు కొత్త ప్రయోగం
  • యూ టర్న్ విధానాన్ని ప్రవేశపెట్టిన ట్రాఫిక్ పోలీసులు
  • నేటి నుంచి అమలు

హైదరాబాద్ లో రోజు రోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ కష్టాలను తగ్గించడానికి ట్రాఫిక్ యంత్రాంగం కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందుకు ప్రయోగంగా ఎల్బీ నగర్ చౌరస్తా ను ఎంచుకున్నారు.  నేటి నుంచి ఎల్బీ నగర్ చౌరస్తాను మూసివేసి కొత్త తరహా ట్రాఫిక్ వ్యవస్థను రూపొందిస్తున్నారు. కూడలి వద్ద   యూ టర్న్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించాలని రాచకొండ ట్రాఫిక్ పోలీసులు ఆలోచన ఫలితమే ఎల్ బి నగర్ చౌరస్తా మూసివేత.
 

నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ జాం సమస్యను పరిష్కరించే క్రమంలో కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులు యు టర్న్ పద్ధతిని అవలంబిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఎల్బీనగర్ చౌరస్తాలోనూ ఈరోజు నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే పలు కూడళ్లలో యు టర్న్ పద్ధతి సఫలమైన నేపథ్యంలో ఎల్బీనగర్ కూడలిలోనూ ఈ పద్ధతిని ఆదివారం నుంచి అవలంబించబోతున్నట్లు తెలిపారు. 

మెట్రోరైలుతోపాటు, స్కైవే పనులు సైతం జరుగుతున్నందున ఈ చౌరస్తాలో వాహనదారుల ఇబ్బందులకు తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రాఫిక్ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం రాచకొండ ట్రాఫిక్ డీసీపీ రమేష్, అదనపు డీసీపీ దివ్యచరణ్రావు, ఏసీపీ శ్రీధర్లు ఎల్బీనగర్ చౌరస్తాను పరిశీలించారు. ఇక్కడ యు టర్న్ ఎంత మేరకు సఫలమవుతుందోనని అంచనా వేశారు. ఈ మేరకు రాబోయే ఆదివారం నుంచి ఎల్బీనగర్ కూడలిని మూసివేసి ఇటు ఎల్పీటీ మార్కెట్, అటు డీమార్ట్ ముందు యు టర్న్ తెరుస్తారు.

 అలాగే ఆర్టీసీ బస్సులను కూడలి, యు టర్న్ల్ కు సమీపంలో ఆపరాదని.. విజయవాడ వెళ్లే బస్సులను ఆరెంజ్ ఆస్పత్రి ముందు నిలపాలని ఎల్బీనగర్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీధర్ సూచించారు. ఈ ప్రయోగంతోనైనా ఎల్బీనగర్ లో ట్రాఫిక్ కష్టాలు తీరతాయేమో చూడాలి.

click me!