యుద్ధ కళల్లో ఈ బామ్మకు సాటిలేరు..!

First Published Aug 7, 2017, 5:59 PM IST
Highlights
  • కేరళలో ప్రసిద్ధమైన యుద్ధ కళ
  • పేరుకి 76ఏళ్ల బామ్మ అన్నమాటే గానీ.. 25 ఏళ్ల వయసు వాళ్లకి ఏమీ తీసీపోదు


కళరియపట్టు గురించి వినే ఉంటారు. ఇది కేరళలో ప్రసిద్ధమైన యుద్ధ కళ(మార్షల్ ఆర్ట్స్). కత్తి బల్లెం పట్టుకొని.. పురుషులు చేస్తుంటేనే ఒకింత బయంగానే అనిపిస్తుంది. అదే మహిళలు చేస్తే.. అందులోనూ 76 ఏళ్ల బామ్మ  చేస్తుంటే ఎలా ఉంటుంది. ఈ విద్య మహిళలు చేయడమే కష్టమనుకుంటే.. బామ్మ చేయడం అసాధ్యం అనుకుంటున్నారా.. కానీ ఈ బామ్మను చూస్తే మాత్రం విస్మయానికి గురవ్వడం ఖాయం.
కేరళకు చెందిన ఈబామ్మ పేరు  మీనాక్షమ్మ. పేరుకి 76ఏళ్ల బామ్మ అన్నమాటే గానీ.. 25 ఏళ్ల వయసు వాళ్లకి ఏమీ తీసీపోదు. అంత ఫిట్ నెస్ ని మొయిన్ టైయిన్ చేస్తుంది ఈ బామ్మ. దాని కారణం కళరియపట్టలో ఆమెకు ఉన్న పట్టే కారణమట.
ఏడేళ్ల వయసులో మీనాక్షమ్మను ఆమె తల్లిదండ్రులు నృత్యకారిణిగా తీర్చిదిద్దాలను కున్నారట. అందులో భాగంగానే కళరియపట్టులో శిక్షణ ఇప్పించారు. ఇందులో శిక్షణ పొందితే.. శరీరం నృత్యం చేయడానికి సరైన ఆకృతిని ఇస్తుందట. అందుకని కళరియపట్టులో  శిక్షణ ఇప్పించగా.. మీనాక్షమ్మకు నృత్య నేర్చుకోవాలన్న ఆసక్తి తగ్గి ఈ విద్యపై శ్రద్ధ పెరిగిందట. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏనాడు ఆమె ఈ విద్యను ప్రాక్టీస్ చేయడం ఆపలేదట.


కడతానందన్ కలారి సంఘం పేరుతో రాఘవన్ అనే ఓ గురువు కోజికోడ్‌లో కలరియపట్టు శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తుండేవారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉచితంగానే ఆయన ఈ శిక్షణ ఇస్తుండేవారు.
మీనాక్షి గురించి తెలిసి ఆయన చాలా సంతోషించారు. మీనాక్షి అంకిత భావం, కలరియపట్టులో ఆమె ప్రదర్శించే మెలుకువలు నచ్చి ఆమెనే వివాహం చేసుకున్నారు. అయితే 2009లో ఆయన మరణించడంతో.. ఆ శిక్షణ శిబిరాన్ని నిర్వహించాల్సిన బాధ్యత మీనాక్షి అమ్మపై పడింది. దాంతో ఆ గురుకులం బాధ్యతలను స్వీకరించి.. స్వయంగా కొన్ని వందల మంది శిష్యులను తీర్చిదిద్దారు. 
వయసు పైబడుతున్నా.. విశ్రాంతి తీసుకోవాలన్న ఆలోచన మీనాక్షి అమ్మలో ఏ కోశాన ఉండదు. ఇప్పటికీ 150 నుంచి 200మంది వరకు ఆమె శిక్షణ ఇస్తూనే ఉన్నారు. విదేశీయులు సైతం ఆమె వద్ద తర్ఫీదు పొందుతున్నారంటే కలరియపట్టుకు ఆమె ఎంతటి పేరు తీసుకొచ్చారో అర్థం చేసుకోవచ్చు.

కలరియపట్టులో కర్ర, కత్తి, బల్లెం, ఇతరత్రా ఆయుధాలను ఉపయోగిస్తుంటారు. ఈ యుద్దకళకు అనుబంధంగా ప్రత్యేక వైద్య విధానం కూడా ఉండటం విశేషం. ఏ స్వార్థం లేకుండా మీనాక్షి అమ్మ కొన్ని వందల మందికి ఈ శిక్షణ ఇస్తున్నారు. వారి వద్ద నుంచి ఆమె ఏమి ఆశించరు. ఎవరికి తోచినంత వారు ఆమెకు ఇవ్వవచ్చు.
ఒక ప్రాచీన కళను బ్రతికించేందుకు జీవితాన్నే అంకితం చేసిన మీనాక్షి అమ్మను ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. 2016లో కేంద్రం ఆమెను పద్మశ్రీతో సత్కరించింది. తాను చేసేదాని గురించి ఏమాత్రం గొప్పలు పోని మీనాక్షి అమ్మ.. తనకు వచ్చిందే నలుగురికే నేర్పిస్తున్నానంటూ వినయంగా చెబుతారు. కలరియపట్టు శిక్షణలో తన ప్రాధాన్యం ఎప్పుడూ తొలుత మహిళలు, యువతులే అని చెబుతుంటారు.

click me!