
ఇక నుంచి రైలులో .. రైల్వే శాఖ అందించే భోజనం తినడం కుదరదు. ప్రయాణికులకు భోజనం అందించలేమని రైల్వే శాఖ అధికారులు తేల్చిచెప్పారు. భోజనం కావాలనుకునే వాళ్లు తమ భోజనం వాళ్లే ఇంటి నుంచి తెచ్చుకోవాలని రైల్వే బోర్డ్ ఉచిత సలహా ఇచ్చింది.
వివరాల్లోకి వెళితే.. రైల్వే భోజనం మనుషులు తినడానికి పనికిరాదంటూ ఇటీవల కాగ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. రైల్వే కిచెన్ శుభ్రంగా ఉండటం లేదని.. బొద్దింకలు తిరుగుతూ ఉంటున్నాయని.. ఈ ఆహారం మంచిది కాదని కాగ్ రైల్వేలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగ్ రైల్వే శాఖ చేసిన వ్యాఖ్యలు నిజమనిపించేలా.. మరో సంఘటన కూడా ఇటీవల జరిగింది. రైలులో ప్రయాణిస్తున్న వారికి చనిపోయిన బల్లి ఉన్న ఆహారాన్ని అందించారు. అది తిని ఓ వ్యక్తి అస్వస్తతకు కూడా గురయ్యారు. గతంలో ఒకరికి భోజనంలో బొద్దింకలు వచ్చాయి. ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతుండటంతో రైల్వే పనితీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమౌతోంది.
ఈ నేపథ్యంలో రైల్వే బోర్డ్ ఓ నిర్ణయం తీసుకుంది. రైల్వే కిచెన్ ని శుభ్రపరిచి.. తిరిగి ప్రయాణికులకు మంచి ఆహారం అందించే వరకు ప్రయాణికులు తమ భోజనం ఇంటి నుంచి తెచ్చుకోవాల్సిందిగా సూచించారు. కాకపోతే ఇదంతా జరగడానికి కనీసం సంవత్సర కాలం పడుతుందని వారు తెలిపారు. అంటే సంవత్సరంపాటు రైల్వేలో భోజనం లభించదు. ఇదిలా ఉండగా.. దీని వల్ల ఫుడ్ డెలివరీ స్టార్టప్స్ కి ఈ అవకాశం కలిసి వస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.