ఎక్స్ ప్రెస్ న్యూస్ : ''అసెంబ్లీ లో అధికార పార్టీ భజన మరీ ఎక్కువైంది''

First Published Nov 10, 2017, 10:10 AM IST
Highlights

విశేష వార్తలు

  • ఎపి అసెంబ్లీ జరుగుతున్న తీరుపై విష్ణు కుమార్ రాజు అసహనం 
  • కడప జిల్లా మైదుకూరులో దొంగల హల్ చల్ 
  • చుక్కా సత్తయ్య మృతిపై ఎంపి కవిత సంతాపం
  • సింగపూర్ లో హైదరాబాద్ వాసి దారుణ హత్య
  • స్వాగత్ బార్& రెస్టారెంట్ చికెన్ బిర్యానిలో పురుగులు
  • ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం, ఇద్దరు మృతి 

''అసెంబ్లీ లో అధికార పార్టీ భజన మరీ ఎక్కువైంది''

అధికార టిడిపి పార్టీ సభలో వ్యవహరిస్తున్న తీరుపై బిజేపి శాసస సభా పక్షనేత తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో అధికారపార్టీ భజన మరీ ఎక్కువైందని, అది శృతిమించకుండా ఉంటేనే బావుంటుందని అన్నారు. ప్రధాన ప్రతిపక్షం సభలో లేదు కనుక తమకు ఎక్కువ అవకాశం ఇస్తారనుకుంటే స్పీకర్ తమవైపు చూడటమే లేదని అన్నారు. అమీత పథకం గురించి మాట్లాడటానికి స్పీకర్ తమకు సమయమే ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రదాన ప్రతిపక్షం లేకపోవడంతో సభలో నిద్ర వస్తోందని అన్నారు.

పోలీసుల ఎదుటే యువతి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్ : ప్రేమికులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తుండగా మాటా మాటా పెరిగి పోలీసుల ఎదుటే యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గాంధీనగర్ కు చెందిన యువతి వెన్నెల (20) నాగోల్ కు చెందిన కిషోర్ లు ప్రేమించుకుంటున్నారు. అయితే పెళ్లికి మాత్రం కిషోర్ ఒప్పుకోవడం లేదు. దీంతో యువతి పోలీసులను ఆశ్రయింయింది.  దీంతో ఇరువురికి పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తుండగా వెన్నెల తనతో పాటు తెచ్చుకున్న పురుగులమందు తాగి ఆత్మహత్య కు ప్రయత్నించింది. పోలీసులు వెంటనే ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు.
 

తెలంగాణ తాత్కాలిక డీజీపీగా మహేందర్ రెడ్డి నియామకం

హైదరాబాద్: ప్రస్తుత హైదరాబాద్ కమీషనర్ మహేందర్ రెడ్డిని తాత్కాలిక డీజీపీగా ప్రభుత్వం నియమించింది. తాత్కాలిక డీజీపీ నియామకానికి అనుమతిస్తు ఫైల్‌పై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. మరికాసేపట్లో దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. కాగా అనురాగ్ శర్మను అంతర్గత భద్రత, సీఎం సలహాదారుగా నియమించారు.ప్రస్తుత డిజిపి అనురాగ్ శర్మ పదవీకాలం శనివారంతో ముగియనుండటంతో ఆ తర్వాతే మహేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు.

హిందువులను మైనారిటీలుగా గుర్తించలేం - సుప్రీం కోర్టు 

హిందువులను మైనారిటీలుగా గుర్తించాలని భాజపా నేత అశ్వనీ కుమార్ ఉపాద్యాయ  దాఖలుచేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. దేశంలోని ఏడు రాష్ట్రాలు,  ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అతి తక్కువ హిందూ జనాభా కలిగివుందని, అక్కడ హిందువులను మైనారిటీలుగా గుర్తించాలని ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే దీనిపై తామేమీ నిర్ణయం తీసుకోలేమన్న అత్యున్నత ధర్మాసనం, పిటిషనర్ ను జాతీయ మైనారిటీ కమీషన్ సంప్రదించాలని సూచించింది.

తూర్పు గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం,  జర్నలిస్ట్ మృతి

తూర్పు గోదావరి జిల్లాలోని కత్తిపూడి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.  జాతీయ రహదారిపై బైక్ పై వెళుతున్న కుర్రె గురురాజు అనే జర్నలిస్టును గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికల సమాచీరంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

కడప జిల్లాలో పట్టపగలే దొంగల హల్ చల్

కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. చాపాడు మండలం పెద్దగులగళూరు లో ఓ ఇంట్లో చొరబడి 70 తులాల బంగారం, 90 వేల నగదును దోచుకెళ్లారు. స్కూల్లో ఉపాద్యాయులుగా పనిచేస్తున్న వీరనారాయణ రెడ్డి దంపతులు రోజూ మాదిరిగానే ఇంటికి తాళం వేసి డ్యూటీకి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి దొంగతనానికి పాల్పడ్డారు. దీనిపై నారాయణ రెడ్డి పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు.   

''కాలేజి యాజమాన్యమే తమ కూతురిని హత్య చేసింది'' 

వనపర్తి లోని జాగృతి జూనియర్ కాలేజీ యాజమాన్య మే తమ కూతురు శివశాంతి ని హత్య చేశారని పేర్కొంటూ ఆమె తల్లిదండ్రులు బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. ఈ విషయంపై పోలీసులు సహితం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అందువల్లే బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించినట్లు బాలిక తల్లి దండ్రులు ఆరోపిస్తున్నారు.  అదే కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్న తమ కూతురిని అకారణంగా హత్యచేశారని, అందువల్ల తమరే మాకు న్యామం చేయాలంటూ బాలల హక్కుల సంఘాన్ని కోరారు.  

విదేశాలకు ఒంటె మాంసం సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్ 

హైదరాబాద్ : బాలాపూర్ పోలీసు స్టేషన్ పరిదిలోని  షాయిన్ నగర్ లో ఒంటెలను వధించి, వాటి మాంసాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో ఎల్బీనగర్ ఎస్ఓటి పోలీసులు ఒంటెలను దాచివున్న ఫామ్ హౌస్ పై దాడి చేసి 97 ఒంటెలను గుర్తించారు. 
దీనికి పాల్పడిన మహమూద్ .నౌషాద్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు డిసిపి వెంకటేశ్యర్ రావు తెలిపారు. ఏనిమల్ ప్రెవెన్షన్ యాక్ట్ 145u/s, 6r/w ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఆయన తెలిపారు. పట్టుకున్న ఒంటెలను జూపార్కుకు తరలించినట్లు, నిందితులు మళ్లీ  దొరికితే పిడియాక్ట్ పెడతామని డిసిపి హెచ్చరించారు.
 

చుక్క సత్తయ్యకు నివాళులు అర్పించిన ఎంపి కవిత

ప్రముఖ ఒగ్గు కథ కళాకారుడు చుక్క సత్తయ్య భౌతికకాయానికి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత నివాళులు అర్పించారు. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం మాణిక్యపూర్ కు సీఎం కార్యాలయం ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ లతో హైదరాబాద్ నుండి  వెళ్లారు. సత్తయ్య కుటుంబ సభ్యులను కవిత ఓదార్చారు. ఈ సందర్భంగా చుక్క సత్తయ్య తెలంగాణ సమాజానికి, ఒగ్గు కథకు గుర్తింపు తేవడానికి చేసిన కృషిని ఆమె కొనియాడారు.
తన జీవితాన్ని ఓగ్గు కథ కళారూపానికి అంకితం చేసిన సత్తయ్య మృతి తెలంగాణకు తీరని లోటన్నారు. చుక్కా సత్తయ్య వారసులు కూడ ఆయన బాటలో నడుస్తుండటం ఆయనకు ఒగ్గు కథ పట్ల ఉన్న ప్రేమను తెలియజేస్తున్నదని కవిత అన్నారు.
 చుక్క సత్తయ్య పేరు చిరస్ఠాయిగా నిలిచే విధంగా తెలంగాణ ప్రభుత్వం కళాకారులకు తోడ్పాటునిస్తుందని కవిత తెలిపారు. అలాగే మరుగున పడిన కళలను, కళాకారులను,  తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే టి.రాజయ్య, స్థానిక నాయకులు, తెలంగాణ జాగృతి కార్యకర్తలు పాల్గొని చుక్కా సత్తయ్య కు నివాళులు అర్పించారు.

కుటుంబంతో సహా యువరైతు ఆత్మహత్య

కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కొడుకుతో సహ బావిలో దూకి ఓ యువ జంట ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రామలింగయ్య పల్లె గ్రామానికి చెందిన తిమ్మక్క(22), గంగరాజు(28) దంపతులు. వీరికి రాధాకృష్ణ(9నెలలు) అనే కొడుకు ఉన్నాడు. గంగరాజుకు నాలుగు ఎకరాల సొంత పొలం ఉండగా మరో 3ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయ పెట్టుబడికోసం తెలిసిన వారి దగ్గర అప్పులు చేశాడు. అయితే  పంట దిగుబడి వచ్చే అవకాశం లేకపోవడం, అప్పులు తీర్చే దారి కనబడకపోవడంతో కుటుంబంతో సహ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
 

సింగపూర్ లో హైదరబాదీ దారుణ హత్య

హైదరాబాద్ కు చెందిన ఓ నగల వ్యాపారిని సింగపూర్ లో దారుణ హత్యకు గురయ్యాడు. కుషాయిగూడకు చెందిన నగల వ్యాపారి  వాసుదేవ్ రాజ్ ను కొందరు దుండగులు వ్యాపారం పేరుతో సింగపూర్ కు తీసుకువెళ్లారు. అక్కడికి వెళ్లాక అతడిని కిడ్నాప్ చేసి ఓ గదిలో బంధించారు. ఇక్కడున్న అతడి కుటుంబసభ్యులకు పోన్ చేసి  వాసును విడిచిపెట్టాలంటే 3 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.  కుటుంబసభ్యులు సకాలంలో స్పందించలేదనే కారణంతో వాసుదేవ్ ను నిందితులు హతమార్చారు.
 వాసుదేవ్ హత్య కు గురైనట్లు గుర్తించిన ఇండియన్ ఎంబసీ అధికారులు ఈ విషయాన్నిఅతడి కుటుంబ సభ్యులకు చేరవేశారు. వాసు మృత్యువార్త విన్న కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
 

స్వాగత్ హోటల్ లో పురుగుల చికెన్ 

కుళ్లిపోయిన చికెన్ ను కస్టమర్లకు పెట్టి వారి ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ఓ బార్&రెస్టారెంట్ బాగోతం మెడిపల్లి పీస్ పరిధిలోని బయటపడింది. వివరాల్లోకి వెళితే బొడుప్పల్ లోని స్వాగత్ బార్ లో కొందరు మిత్రులు మద్యం సేవించడానికి వెళ్లారు. మందుతో పాటు చికెన్ బిర్యాని ఆర్డర్ చేశారు. ఐతే ఆ చికెన్ ముక్కల్లో పురుగులు గుర్తించిన కస్టమర్లు ఆందోళనకు దిగారు. యాజమాన్యానికి ఫిర్యాదు చేసినప్పటికి వారు పట్టించుకోలేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేశారు.
 

ఔటర్ పై రోడ్డు ప్రమాదం, ఇద్దరు హైదరబాదీల మృతి

అవుటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమదం జరిగింది. కుత్బుల్లాపూర్ మండలం షంబీపూర్ సమీపంలో ఓ ఇన్నోవా వాహనం అదుపుతప్పి ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మొఘల్ పురాకు చెందిన  నలుగురు వ్యక్తులు కర్ణాటకలోని బీదర్ వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.  ఇందులో సలీం, రవూస్ అనే వ్యక్తులు సంఘటన స్థలంలోనే మృతిచెందగా, అక్రమ్, వికార్ లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 
 

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సదుపాయాలు, భద్రత బేష్ 

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికుల భద్రత, సదుపాయాల కల్పనలో దేశంలోని అన్ని రైల్వేస్టేషన్ల కంటే మెరుగ్గా ఉందని రైల్వేశాఖ కేంద్ర కమిటీ కితాబిచ్చింది. సదుపాయాల కల్పనపై రైల్వే శాఖ ఏర్పాటుచేసిన కేంద్ర కమిటీ ఇవాళ నాంపల్లి, కాచిగూడ, సికింద్రబాద్ స్టేషన్లను సందర్శించింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ తాము ఇప్పటివరకు పరిశీలించిన 600 రైల్వేస్టేషన్లలో సికింద్రాబాద్ స్టేషన్ అత్యుత్తమంగా ఉందని అన్నారు. విమానాశ్రయం తరహాలో సదుపాయాలు కల్పించారని కితాబిచ్చారు.  అలాగే ప్రయాణికుల భద్రత కోసం ఏర్పాటుచేసిన రైల్వే రక్షణ దళం సేవలు కూడా బాగున్నాయని అన్నారు.  

తెలంగాణ పోలీస్ శాఖకు ఇంటర్నేషనల్ అవార్డు

తెలంగాణ పోలీస్ శాఖ ఖాతాలో మరో ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైంది. హైదరాబాద్ పోలీసులు రూపొందించిన "హైదరాబాద్ కాప్ యాప్''  ప్రతిష్ఠాత్మకమైన ''వరల్డ్ సమ్మిట్ అవార్డు''ను గెల్చుకుంది. గత వారం జర్మనీ లోని బెర్లీన్‌లో నిర్వహించిన వరల్డ్ సమ్మిట్ అవార్డుల పోటీల్లో హైదరాబాద్ పోలీసులు ప్రదర్శించిన హైదరాబాద్ కాప్ యాప్ కు అవార్డుకు ఎంపికైంది.  ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం ఉన్న 180 దేశాలు నుంచి వచ్చిన 400 నామినేషన్స్‌లో టాప్ 40 నామినేషన్స్ ఎంపిక చేసి అవార్డులు అందిస్తారు. ఇందులో మన దేశం తరపున ప్రదర్శించిన కాప్ యాప్‌కు చోటు దక్కింది. 
ఈ వరల్డ్ సమ్మిట్ అవార్డ్-2017 ను వచ్చే ఏడాది మార్చి 20న ఆస్ట్రియా వియాన్నాలో జరిగే వరల్డ్ సమ్మిట్ అవార్డ్స్ గ్లోబల్ కాంగ్రెస్ కార్యక్రమంలో అందిస్తారు.

click me!