ఎక్స్ ప్రెస్ న్యూస్ : టీపిసిసి వివర్స్ సెల్ చైర్మన్ గా గూడూరి శ్రీనివాస్ ప్రమాణస్వీకారం

First Published Nov 9, 2017, 11:13 AM IST
Highlights

విశేష వార్తలు

  • ఇందిరా భవన్ లో టిపిసిసి వివర్స్ సెల్ ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం
  • ఎమ్మెల్సీ ఆకుల లలితను మోసగించిన ఆంధ్రా దుండగుడు
  • కేసీఆర్ కు సవాల్ విసిరిన కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  • వైద్యారోగ్య శాఖలో ఖాళీల భర్తీకి టీఎస్ పిఎస్సి నోటిపికేషన్
  • ప్రశాంతంగా కొనసాగుతున్న హిమాచల్ ఎన్నికలు
  • తెలంగాణ ఒగ్గుకథ కళాకారుడు చుక్కా సత్తయ్య మృతి

టీపిసిసి వివర్స్ సెల్ చైర్మన్ గా గూడూరి శ్రీనివాస్ ప్రమాణస్వీకారం

టీపీసీసీ వివర్స్ సెల్ ఛైర్మెన్ గా గుడూరు శ్రీనివాస్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇందిరా భవన్ లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ  కాంగ్రెస్ పార్టీ కి చేనేత వర్గాలకు విడదీయరాని బంధం ఉందని అన్నారు. అనంతరం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ప్రసంగాస్తూ...పార్టీ జెండాపై రాట్నం చిహ్నాన్ని పెట్టుకొన్న గొప్ప చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని అన్నారు. చేనేత కార్మికులకు దేశవ్యాప్తంగా రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని గర్వంగా చెబుతున్నానన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల మ్యానిఫెస్టోలో చేనేత కార్మికులకు సరైన ప్రోత్సహకాలపై హామీలు పొందుపరుస్తామని, అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేస్తామని అన్నారు. 
 

దక్షిణ మద్య రైల్వే జీఎంతో కవిత భేటీ


దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్ కుమార్ యాదవ్ తో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత భేటీ అయ్యారు. ఈ భేటీలో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని రైల్వే సమస్యలపై చర్చించారు. నిజామాబాద్ జిల్లాలో చేపడుతున్న రైల్వే ప్రాజెక్టులకు నిధులను మంజూరు చేసి తొందరగా పూర్తయ్యేలా చూడాలని కోరారు. ఈ భేటీలో ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్ రెడ్డి, షకీల్ అమీర్, విద్యాసాగర్ రావు, విఠల్ రెడ్డి, పుట్టా మధు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ఎమ్మెల్సీని బురిడీ కొట్టించిన ఆంధ్రా కేటుగాడు

తెలంగాణ కు చెందిన ఓ మహిళా ఎమ్మెల్సీనే బురిడీ కొట్టించిన ఓ ఆంధ్రా వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే ఎమ్మెల్సీ ఆకుల లలిత కు బాలాజీ నాయుడు అనే కేటుగాడు పోన్ చేసి తాను చెప్పినట్లు చేస్తే రూ 2 కోట్లు సంపాదించవచ్చని ఆశ చూపించాడు. అయితే అందుకోసం మొదట తన ఖాతాలో 10 లక్షలు డిపాజిట్ చేయాలని చెప్పాడు. అతడి మాటలు నమ్మి లలిత అలాగే చేసింది.  డబ్బులు అతడి ఖాతాలో పడ్డ నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో మోసపోయానని గ్రహించిన ఆమె పోలీసులను ఆశ్రయించింది.  కాల్ డేటా ఆధారంగా కూపీ లాగిన పోలీసులు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన బాలాజీ నాయుడు ఈ నేరానికి పాల్పడ్డాడని గుర్తించారు. అక్కడి పోలీసుల సహకారంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. 

50,000 మెజారిటీ రాకుంటే రాజకీయాలనుంచి తప్పుకుంటా- కోమటిరెడ్డి

సీఎం కేసీఆర్  నల్గొండలో 500 కోట్లు ఖర్చు పెట్టినా గెలవలేరని, తనను నల్గొండ ప్రజలు అంతలా అభిమానిస్తారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తనకు మాత్రం సీఎంకు వ్యతిరేకంగా గజ్వేల్ లో నిలబడి గెలిచే సత్తా ఉందని కోమటిరెడ్డి అన్నారు. రానున్న ఎన్నికల్లో తన నియోజకవర్గం నుంచే పోటీచేసి 50 వేల మెజారిటీ గెలుస్తానని, ఆ మెజారిటీ రాకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. తన నియోజకవర్గానికి సీఎం నిధులివ్వడం లేదని, నిధులిస్తే తన డబ్బులతో సీఎంకు ధన్యవాదాలు చెబుతూ యాడ్స్ వేయిస్తానని అన్నారు.

నిరుద్యోగులకు తీపి కబురు, టీఎస్ పిఎస్సి మరో నోటిఫికేషన్

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో తీపి కబురు అందించింది.  వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా వున్న 1261 ఉద్యోగాల భర్తీకి టీఎస్ పిఎస్సి ద్వారా నోటిపికేషన్ జారీ చేసింది. అందులో 1196 స్టాఫ్ నర్సులు, 35 రేడియోగ్రఫి, 6 ఫిజియోధెరపి, 2 పారా మెడికల్ ఆప్తమాలజి ఆఫీసర్, 21 హెల్త్ సూపర్ వైజర్స్,ఒక రిఫ్రక్షనిస్ట్ ఉద్యోగాల భర్తీకోసం ఈ నోటిపికేషన్ విడుదలైంది. ఈ నెల 16 నుంచి డిసెంబర్ 12 వరకు ఆన్ లైన్ లో అర్హతకల్గిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని  టీఎస్ పిఎస్సి తెలిపింది. 
 

హిమాచల్ ప్రదేశ్ పోలింగ్ వివరాలు

హిమాచల్ ప్రదేశ్ లో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది.  తాజా సమాచారం ప్రకారం 12 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా  28.06 శాతం పోలింగ్ నమోదైంది. సిమ్లాలో ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ కుటుంబంతో కలిసి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 68 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ కొనసాగుతోంది.
 

ఒగ్గుకథ కళాకారుడు చుక్క సత్తయ్య మృతి

ప్రముఖ తెలంగాణ ఒగ్గుకథ కళాకారుడు చుక్క సత్తయ్య ఇవాళ కన్నుమూశారు. జానపద కళారూపమైన ఒగ్గు కథను పద్నాలుగేళ్ల వయసునుంచే చెప్పడం ప్రారంభించాడు సత్తయ్య. తెలంగాణ లోనే కాదు ఆయన ఒగ్గుకథ ప్రధర్శనలను దేశవ్యాప్తంగా ప్రదర్శించి ప్రముఖుల మన్ననలు పొందాడు. దేశవ్యాప్తంగా సుమారు 12 వేలకు పైగా ప్రదర్శనలిచ్చాడు. వరకట్న వ్యవస్థ, మూఢనమ్మకాలు వంటి సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి ఆయన తన ఒగ్గు కథలతో ప్రజలకు సందేశాన్నిచ్చేవాడు.
చుక్క సత్తయ్య మృతిపట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు తమ సంతాపాన్ని తెలిపారు. 

చెరువులో మునిగి ఇద్దరు చిన్నారుల మృతి

మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం జరిగింది. దామరగిద్ద మండలం అన్నాసాగర్ గ్రామంలో ఈతకు వెళ్లి నీటిలో మునిగి ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారు.  రాజు, బాలరాజు అనే ఇద్దరు 8 వ తరగతి విద్యార్థులు సరదాగా ఈత కొట్టడానికి గ్రామ సమీపంలోని చెరువు వెళ్లారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నిండుగా నిండి ప్రమాదకరంగా మారిన చెరువులో ఈతకోసం దిగి పీటిలో మునిగిపోయారు. ఈ సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో మృతదేహాలను బైటకు తీసి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.  
 

కెనడా రోడ్డు ప్రమాదంలో తెలంగాణవాసి మృతి

కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసి కళ్యాణ్ చక్రవర్తి మృతిచెందాడు.  ఈ ప్రమాదంలో మరణించిన యువకుడిది మేడ్చల్ జిల్లా  కీసర మండలం నాగారం గ్రామం. ఉన్నత చదువులకోసం కెనడాకు వెళ్లిన అతడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడని తెలిసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
 

click me!