ఎక్స్ ప్రెస్ న్యూస్ : కాళేశ్వరం ప్రాజెక్టుకు తొలగుతున్న అడ్డంకులు

First Published Nov 3, 2017, 11:00 AM IST
Highlights

విశేష వార్తలు

  • కాళేశ్వరం ప్రాజెక్టుకు అంతర్రాష్ట్ర అనుమతులు
  • వాట్సాప్ సేవలకు అంతరాయం
  • విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి సర్కార్ ఆమోదం
  • చంద్రబాబుకు గుడి కట్టిస్తామంటున్న హిజ్రాలు
  • రోడ్డు ప్రమాదంలో ఎఎస్సై మృతి
  • సికింద్రాబాద్ లో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

కాళేశ్వరం ప్రాజెక్టుకు తొలగుతున్న అడ్డంకులు 

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు అంతర్రాష్ట్ర క్లియరెన్సు లభించింది. ఈ ప్రాజెక్టుకు అంతర్రాష్ట్ర అనుమతి ఇస్తున్నట్టు కేంద్ర జలసంఘం ప్రకటన జారీ చేసింది.  దీంతో నిర్మాణంలో వున్న కాళేశ్వరం ప్రాజెక్టు అడ్డంకులు తొలగిపోయినట్లేనని ఇరిగేషన్ మంత్రి హరిష్ రావు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంతో ముందు చూపుతో మహారాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన దౌత్యం వల్లే ఇది సాధ్యమయిందని ముఖ్యమంత్రికి కొనియాడారు. ఆ రాష్ట్రం తో కాళేశ్వరం ప్రాజెక్టు పై చేసుకున్న ఒప్పందం పలితమే ఈ అనుమతి అని హరిష్ రావు అన్నారు.
 

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

దుందిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడి మృతి చెందాడు. దుందిగల్  లోని బౌరంపేట్ డీఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.  ఓ ఇంటర్నేషనల్ స్కూల్ బస్సు బైక్ ను డీ  ఢీకొట్టడంతో సికింద్రాబాద్  నివాసముండే గడ్డం చెంద్రశేఖర్ రెడ్డి  అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.

''పార్టీని వీడే ప్రసక్తే లేదు''
 

కొండా దంపతులు పార్టీ మారనున్నారని, అందుకోసం కాంగ్రెస్ తో చర్చలు జరుపుతున్నారని జరుగుతున్న ప్రచారాన్ని కొండా సురేఖ ఖండించారు.  తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ ఏనాడో చచ్చిపోయిందని, అందులో తాను చేరుతున్నట్లు వస్తున్న వార్తలన్ని అసత్య ప్రచారమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తమకు పునర్జన్మ ఇచ్చారని, అలాంటి వ్యక్తని,పార్టీని వదిలిపెట్టబోనని మీడియాకు వివరించారు. కొందరు కాంగ్రెస్ నాయకులు కావాలనే మైండ్ గేమ్ ఆడుతున్నారని కొండా సురేఖ అన్నారు. 

ఇస్రో  జాబ్ నోటిఫికేషన్

నిరుద్యోగులకు శుభవార్త. సతీష్ ధావన్ స్పెస్ సెంటర్లో ఖాళీగా వున్న టెక్నికల్ అసిస్టెంట్లు, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఇస్రో నోటిఫికేషన్ జారీ జేసింది.  ఇందుకు సంభందించిన పూర్తి వివరాలు  అధికారిక వెబ్ సైట్ లో పొందుపర్చినట్లు ఇస్రో తెలిపింది. అర్హత కల్గిన అభ్యర్ధులు ఈ నెల 17 వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. 
 

ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ సేవలకు అంతరాయం

అరగంటపాటు వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి. దీంతో జనాలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఊపిరి ఆగిపోతున్నట్లుగా ఫీల్ అయ్యారు. చాలామంది వాట్సాప్ ఆగిపోవడంతో షట్ అంటూ అసహనం వ్యక్తం చేశారు. సాంకేతిక కారణాలతో వాట్సాప్ సేవలు శుక్రవారం మధ్యాహ్నం 1.45నిమిషాల నుంచి మధ్యాహ్నం 2.30 వరకు వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి. దీంతో  ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులంతా ఆగమాగమైపోయారు. ఎట్టకేలకు 2.30 తర్వాత వాట్సాప్ సేవలు పునరుద్ధరించడంతో వినియోగదారులు ఊపిరి పీల్చుకున్నారు.

తెలంగాణ విద్యుత్ శాఖలో కొలువుల జాతర

విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి తెలంగాణ సర్కార్ పచ్చ జెండా ఊపింది.  విద్యుత్ సంస్థలో ఖాళీగా ఉన్న 600 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులను భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తెలంగాణ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్  , దక్షిణ విద్యుత్ పంపిణి సంస్థ , ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ ల‌లో ఉన్న ఖాళీలను ఈ నియామకం ద్వారా భర్తీ చేయనుంది.  ఉమ్మడిగా నోటిఫికేషన్ ద్వారా ఈ ఖాళీలన్నిటికి ఒకేసారి భర్తీ చేయనుంది. 
 

యూత్ కాంగ్రెస్ టీఎస్ పిఎస్సీ ముట్టడి

ఉద్యోగ నియామకాల్లో టీఎస్ పిఎస్సీ చేస్తున్న అక్రమాలను నిరసిస్తూ నాంపల్లి లోని గాంధీ భవన్ వద్ద యూత్ కాంగ్రెస్ సభ్యులు రోడ్డుపై నిరసనకు దిగారు. ఉద్యోగాల పేరుతో నియామక సంస్థ వసూళ్లకు పాల్పడుతోందని, దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.  భారీగా చేరుకున్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రభుత్వానికి, టీఎస్ పిఎస్సికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీఎస్ పిఎస్సి కార్యాలయ ముట్టడికి వెళుతున్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకుని, పోలీస్ స్టేషన్ కు తరలించారు.  
 

హైకోర్టు లో గాలి జనార్దన్ రెడ్డికి చుక్కెదురు

గాలి జనార్ధన్ రెడ్డి కి హైకోర్టు లో చుక్కెదురయ్యింది. విదేశీ పర్యటన కోసం అతడు పెట్టుకున్న పిటిషన్ రు కోర్టు కొట్టేసింది. లండన్ లోని తన కూతురు వద్దకు వెళ్లడం కోసం గాలి జనార్ధన్ రెడ్డి ఈ నెల 5 తేదీ నుండి 20 తేదీ వరకు అనుమతి ఇవ్వాలంటూ హైకోర్టు లో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే ఓబుళాపురం మైనింగ్ కేసు సీబీఐ కోర్ట్ లో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఎలాంటి అనుమతి ఇవ్వలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది. 
 

చంద్రబాబుకు గుడికట్టిస్తాం - హిజ్రాలు

హిజ్రాల సంక్షేమం, హక్కుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి దేవాలయం నిర్మించనున్నట్లు హిజ్రాల ఉద్యమ నాయకుడు విజయకుమార్‌ తెలిపారు. ఆలయంలో చంద్రబాబు ఐదు కిలోల వెండి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజిస్తామని తెలిపారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా   ఏపీలో థర్డ్‌జెండర్స్‌ లింగ వివక్షతను విముక్తి కల్పించి, వారి సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటుకు శ్రీకారం చుట్టినందుకు సీఎంకు దన్యవాదాలు తెలిపారు.  డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్ఫూర్తితో సర్కారు థర్డ్‌ జండర్‌ ప్రాథమిక హక్కులకు పాటుపడుతోందని అన్నారు. ఈ నేపథ్యంలో సీఎం వెండి విగ్రహంతో ఆలయం నిర్మించాలనుకున్నామని తెలిపారు.  

రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

రద్దీగా ఉండే రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న హర్యాన రాష్ట్రానికి చెందిన గ్యాంగును సికింద్రాబాద్  ఆర్పీఎఫ్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. వారి వద్ద నుండి 30 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను విచారణ నిమిత్తం రైల్వే పోలీసులకి అప్పగించారు. విచారణలో నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు మరికొంత మంది ముఠా సభ్యుల కోసం ప్రత్యేక బృందాలు ఢిల్లీ హర్యానా వెళ్లినట్టు సమాచారం.

హైదరాబాద్ రోడ్డు ప్రమాదంతో ఎఎస్సై మృతి (వీడియో)

హైదరాబాద్ ఓల్డ్ కాప్రా లో దారుణం జరిగింది. మియాపూర్ లో ట్రాఫిక్ ఏఎస్సై గా పనిచేస్తున్న లక్ష్మణ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే లక్ష్మణ్ ద్విచక్ర వాహనంపై వెళుతుండగా వెనుకనుంచి వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నా పట్టించుకోకుండా కారులోని వ్యక్తులు అక్కడినుంచి వెళ్లిపోయారు. ఈ యాక్సిడెంట్ దృశ్యాలన్ని సీసీటీవీ పుటేజీలో స్పష్టంగా రికార్డయింది. 
అయితే స్థానికులు ఈ ప్రమాదంలో గాయపడిన లక్ష్మణ్ ను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే తీవ్ర రక్తస్రావం అవడంతో చికిత్స పొందుతూ లక్ష్మణ్ కన్ను మూశాడు. ఈ ప్రమాదం పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవి రికార్డు ఆదారంగా నిందితులకోసం గాలిస్తున్నారు. 

ఆగని నయీం గ్యాంగ్ ఆగడాలు

నల్గొండ జిల్లాలో గ్యాంగ్ స్టర్ నయీమ్ అనుచరుల భూ దందాలు,సెటిల్మెంట్ లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నయీమ్ ప్రధాన అనుచరుడు పాశం శ్రీనివాస్ జైలు నుండి కోర్టు కు వెళ్లే దారిలో పోలీసుల సహకారంతో సెటిల్మెంట్ లు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నట్టు పోలీసు ఉన్నతాధికారులకు బాధితులు పిర్యాదు చేసారు. దీంతో విచారణ జరిపిన పోలీసులు మరో ఐదుగురి పై పీడీ యాక్ట్ కేసులు నమోదు రిమాండ్ కు తరలించారు. నిందితులకు సహకరించిన ఇద్దరు ఎఆర్ ఏఎస్ఐలు ఇద్దరు ఎఆర్ కానిస్టెబుల్లపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.  

click me!