ఎక్స్ ప్రెస్ న్యూస్ : ''పాదయాత్రకు భద్రత కల్పించండి''

First Published Nov 2, 2017, 10:50 AM IST
Highlights

విశేష వార్తలు

  • పాదయాత్రకు భద్రత కల్పించాలంటూ డిజిపికి జగన్ లేఖ
  • జర్నటిస్టుల సమస్యలపై కౌన్సిల్ లో చర్చ
  • తెలంగాణ టీ ఆర్ టీ పై దాఖలైన పిటిషన్లను కొట్టేసిన హై కోర్టు
  • దోషులుగా తేలితే రాజకీయ నాయకులపై జీవితకాల నిషేదం విధించాలన్న ఈసీ
  • ఏపిలో ఈ నెల 10 నుంచి అసెంబ్లీ సమావేశాలు

శివసేన-టీఎంసిలు దగ్గరయ్యేనా?

 

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీజేపి మిత్ర పక్షం శివసేన అధినేత ఉద్దవ్ థాక్రేలు ఇవాళ బేటీ అయ్యారు. బీజేపితో శివసేన విభేదిస్తున్న నేపథ్యంలో టీఎంసి అధినేతతో బేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. తాజా రాజకీయ పరిణాబాలపై ఇద్దరు నేతల మద్య చర్చలు జరిగినట్లు సమాచారం. ఈ బేటీలో ఉద్దవ్ కొడుకు ఆదిత్య థాకరే కూడా పాల్గొన్నారు. బిజేపి నుంచి శివసేన దూరమవుతున్న నేపథ్యంలో టీఎంసి దగ్గరవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఇది ఒకటని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

భావోద్వేగానికి లోనై ఏడ్చిన మంత్రి అచ్చెన్నాయుడు

శ్రీకాకుళం జిల్లాలో జరిగిన దవంగత నేత ఎర్రనాయుడు వర్థంతి కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు భావోద్వేగానికి లోనయ్యాడు.  ఈ సంధర్భంగా అన్నతో తనకున్న అనుబందాన్ని గుర్తు చేసుకుని కంటతడి పెట్టాడు. మంత్రితో పాటు అతడి కుమారుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు, కుటుంబ సభ్యులంతా ఎర్రన్నను గుర్తుచేసుకుని ఉద్వేగానికి లోనయ్యారు. జిల్లా అభివృద్దికి కృషి చేసిన అన్నఎర్రన్నాయుడి అడుగుజాడల్లో నడిచి అతడి ఆశయాలను నేరవేరుస్తానని అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. 
 

''పాదయాత్రకు భద్రత కల్పించండి''  

ఈ నెల ఆరవ తేదీ నుండి చేపట్టనున్న పాదయాత్రకు భద్రత కల్పించాలని కోరుతూ వైసీపి అద్యక్షుడు జగన్ ఎపి డిజిపి కి లేఖ రాసారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 3 వేల కిలోమీటర్లు పాదయాత్ర ఉంటుందని, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనే అవకాశం ఉన్నందున భద్రతాపరమైన సమస్యలు రాకుండా పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలని కోరారు. యాత్రకు సంభందించిన రూట్ మ్యాప్ ను జిల్లాల వారిగా అందజేస్తామని, అందుకు తగిన భద్రత కల్పించాలని డీజిపి కి విజ్ఞప్తి చేశారు.
 

ఇంటింటికి ఉక్కు ఉద్యమం

ఇంటింటికి ఉక్కు ఉద్యమంలో భాగంగా పార్టీలకు అతీతంగా ఉక్కు ఫ్యాక్టరీ కి మద్దతు తెలపాలని మున్సిపల్ వైస్ ఛైర్మన్ జబీఉల్లా ను కోరిన స్టీల్ ప్లాంట్ సాధనా సమితి అధ్యక్షుడు జి.వి.ప్రవీణ్ కుమార్ రెడ్డి. ఈ క్యాంపెయిన్ మొదలై నేటికి అయిదు రోజులయింది. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటుచేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద వత్తిడి తెచ్చేందుకు విద్యార్థులు, యువకులతో  స్టీల్ ప్లాంట్ సాధాన సమితి ఏర్పాటయింది. దానికి ప్రవీణ్ కుమార్ రెడ్డి అధ్యక్షుడు. గత రెండేళ్లుగా ఆయన ఈ ఉద్యమం సాగిస్తున్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక మనిషిని ఉద్యమంలోకి రప్పించేందుకు ప్రవీణ్ ఇంటింటికి ఉక్కు ఉద్యమం ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆయన నేడు మున్సిపల్ వైస్ ఛెయిర్మన్ ను కలిశారు.

జర్నలిస్ట్ ల సమస్యలపై కౌన్సిల్ లో చర్చ ( వీడియో) 
 

జర్నలిస్టు ల సమస్యలపై ఇవాళ శాసన మండలి లో చర్చ జరిగింది. జర్నలిస్ట్ ల సమస్యలపై ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సెన్ ప్రశ్నించగా, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలేమిటో మంత్రి  తుమ్మల వివరించారు. ఎమ్మెల్సీ అడిగిన ప్రశ్నలేమిటో, మంత్రి సమాధానమేమిటో పై వీడియోలో మీరే చూడండి.
 

హై కోర్టులో మాజీ మంత్రి ముందస్తు బెయిల్ పిటిషన్

కాంగ్రెస్ మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ ధాఖలు చేశారు. గతంలో గంజాయి కేసు ఓ టీఆర్ఎస్ కార్యకర్తను అక్రమంగా ఇరికించాలని ప్రయత్నించినందుకు ఈయనపై  చిక్కడపల్లి పొలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కు మాజీ మంత్రి పిటిషన్ దాఖలుచేసుకోగా, కోర్టు దీన్ని సోమవారానికి వాయిదా వేసింది.
 

తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీ కి లైన్ క్లియర్ 

తెలంగాణ లో ఉపాద్యాయ నియామకాలకు లైన్ క్లియర్ అయ్యింది. కొత్త జిల్లాల ప్రాతిపాదికన టీ ఆర్ టీ (టీచర్ రిక్రూట్ మెంట్ టెస్ట్) నోటిఫికేషన్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లు హైకోర్టు కొట్టివేసింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని, నియామకాల సమయంలో చట్టపరమైన అడ్డంకులు రాకూడదనే కొత్త జిల్లాల ప్రాతిపదికన నోటిపికేషన్ జారీ చేసినట్లు సర్కారు కోర్టుకు తెలిపింది. ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది.
 

దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై జీవితకాల నిషేదం- ఈసి
 

దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై ఎన్నికల్లో పోటీచేయకుండా జీవిత కాల నిషేదాన్ని విధించాలని ఎన్నికల సంఘం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఏదైనా కేసులో దోషులుగా తేలితే ఆరేళ్లపాటు   ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేదం అమల్లో వున్న విషయం తెలిసిందే. దాన్ని పొడిగించి జీవిత కాల నిషేదాన్ని విధించాలని తాజాగా ఈసీ దర్మాసనానికి నివేదించింది.
అయితే ఈ విషయంపై ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించారు. ఈసీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాను సమర్థిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో రాజకీయ వ్యవస్థ అత్యుత్తమంగా తయారవుతుందని అన్నారు. 
అయితే లాలూ పైనే పలు కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అంతే కాదు అవినీతి కుంభకోణాల కేసులో ఎన్నికల్లో పోటీచేయకుండా ఆరేళ్ల నిషేదం వుంది. అలాంటి వ్యక్తి దీనిపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని ప్రజలు మండిపడుతున్నారు. 
 
 

నవంబర్ 10 నుంచి ఎపి అసెంబ్లి సమావేశాలు

ఈ నెల పదవ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి ఎపి సర్కారు సన్నద్దమవుతోంది. అయితే ఎన్ని రోజులు సభను నిర్వహించాలనే దానిపై 10 వ తేదీనే జరిగే బిఏసి సమావేశంలో నిర్ణయించనున్నారు. మొత్తంగా 7 నుంచి 10 పనిదినాల్లో అసెంబ్లీ ని నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు కనబడుతోంది. ఈ సమావేశాల్లో మూడు బిల్లులను ప్రవేశపెట్టి, ఆమోదింపచేసుకోవాలని సర్కారు భావిస్తోంది. అలాగే విద్యార్థుల ఆత్మహత్యలు, రైతు రుణమాఫి,అమరావతి నిర్మాణం తదితర అంశాలపై చర్చ చేపట్టడానికి ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు సమాచారం.
 

కాంగ్రెస్ లో పదవుల ఆట మొదలైంది - తలసాని
 

రాహుల్ గాంధి తెలంగాణ లోనే తిష్ట వేసి ప్రచారం చేసినా కాంగ్రెస్ గెలిచే పరిస్థితులు కనబడటం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు. రేవంత్ అన్నట్లు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడే ఆట మొదలైందని, అది పదవుల కోసం జరిగే ఆట అని మంత్రి ఎద్దేవా చేశారు. అయినా రాజీనామా చేశానని, తానే నేరుగా స్పీకర్ కు రాజీనామా సమర్పించానని అసత్య ప్రచారం చేసుకుంటున్నాడని ఆరోపించారు. ఇప్పటి వరకు స్పీకర్ కు రాజీనామా లేఖ అందనేలేదని తెలిపారు. ఒకవేళ కొడంగల్ లో ఉపఎన్నికలు జరిగితే రేవంత్ ను సునాయాసంగా ఓడిస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. 
 

4వ తరగతి విద్యార్థినిపై వాచ్ మెన్ లైంగిక వేధింపులు

నాల్గవ తరగతి చదువుతున్న విద్యార్థిపై స్కూల్ వాచ్ మెన్ లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే అబిడ్స్ లోని సుజాత స్కూల్లో ఓ విద్యార్థినికి  రోజూ స్కూల్ వాచ్ మెన్ అసభ్య సైగలు చేయడం, అసభ్యంగా మాట్లాడటం చేస్తున్నడు. దీంతో ఆ చిన్నారి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. యాజమాన్యం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో  వారు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. 
 

హల్దీ వాగులో మునిగి ఇద్దరు విద్యార్థుల మృతి (వీడియో)
 

మెదక్ జిల్లా తూప్రాన్  మండలం కిష్టపూర్ లో దారుణం జరిగింది. హల్దీ చెక్ డ్యాంలో ఈతకని దిగిన  ఇద్దరు పాలిటెక్నక్ విద్యార్థులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే హల్దీ చెక్ డ్యాంలో సరదాగా ఈత కొట్టడానికి  ఐదుగురు నోబుల్ పాలిటెక్నీక్ కాలేజీ విద్యార్థులు వెళ్లారు.  ఇటీవల కురిసిన వర్షాలకు డ్యాం పూర్తిగా నిండి ప్రమాదకరంగా మారింది. దీంట్లో ఈత కొట్టడానికి విద్యార్థులు దిగగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మృతులు మంచిర్యాల ఫారుఖ్. రోహిత్ లు పోలీసులు గుర్తించారు.  
 

అసెంబ్లీ రేపటికి వాయిదా

రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయితి పడ్డాయి.  ఉదయం ఉభయ సభలు ప్రారంభమవగానే ప్రశ్నోత్తరాలను చేపట్టారు. మిడ్ మానేరు,పాడి పరిశ్రమ,బ్రాడ్ బ్యాడింగ్ సేవలు,నూతన ఆధార్ కేంద్రాల ఏర్పాటు, సరోగసి తదితర అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్పారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ఉభయ సభల స్పీకర్లు ప్రకటించారు.

ఆర్టీసి బస్సు ఢీకొని మహిళ మృతి

వద్ద రోడ్డు దాటుతున్న ఓ మహిళను ఆర్టీసి బస్సు డీ కొట్టిన సంఢటన బాలాపూర్ x రోడ్ లో జరిగింది. శారద అనే మహిళ రోడ్డు దాటుతుండగా అతివేగంగా వచ్చిన ఆర్టీసి బస్సు ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  

మేడిపల్లి లో మహిళల్ని వేధిస్తున్న ఆకతాయిల అరెస్ట్

మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హేమనగర్ కాలనీలో ఆకతాయిల హల్ చల్ చేశారు. రోడ్డుపై వెళ్తున్న మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తింస్తూ వేదింపులకు గురిచేశారు. అంతే కాకుండా ఓ క్యాబ్ డ్రైవర్ పై దాడి చేయడం తో పాటు మరో యువకుడి నుంచి బంగారు చైన్, రింగ్ లాక్కెళ్లారు. ఈ ఆకతాయిల వేధింపులు భరించలేమంటున్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
 

క్యాబ్ డ్రైవర్ల అసెంబ్లీ ముట్టడి

తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ క్యాబ్  డ్రైవర్లు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు.  ఓలా, ఉబర్ లాంటి కార్పోరేట్ ఎజెన్సీల మోసాలకు ఆస్తులు అమ్ముకొని రోడ్డున పడుతున్న క్యాబ్ డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే ఒక యాప్ తయారు చేసి తమకు జీవనోపాధి కల్పించాలని కోరుతున్నామని, ఇందుకు ప్రభుత్వం ముందడుగు వేయాలని కోరుకుంటున్నామన్నారు. అలాగే క్యాబ్ ల కోసం తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని, ప్రైవేట్ ఫైనాన్స్ సీజ్ చేసిన వాహనాలు ఇప్పించాలని, పాత మీటర్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు డ్రైవర్లు తెలిపారు.
అయితే సికింద్రాబాద్ నుండి ర్యాలీ గా బయలుదేరిన క్యాబ్ డ్రైవర్స్ ని పోలీసులు అరెస్ట్ చేసి గాంధీనగర్, రాంగోపాల్ పెట్ పోలీస్ స్టేషన్ లకు  తరలించారు.

ఉప్పల్ లో దొంగ''పోలీసుల'' ఘరానా మోసం

పోలీసులమని చెప్పి ఓ వృద్ధుడి నుండి రూ.5 లక్షలు దోపిడీ చేసిన సంఘటన ఉప్పల్ లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన మోహన్‌ స్వర్ణపాల్(63) రిటైర్డ్ ఉద్యోగి. ఉప్పల్‌లోని కల్యాణపురిలో ఇంటి నిర్మాణం చేస్తున్నాడు. అయితే బుధవారం సాయంత్రం ఆనంద్‌బాగ్‌లోని బ్యాంకు నుండి రూ.7 లక్షల 60 వేలు డ్రా చేశాడు. అనంతరం ఇంటి నిర్మాణం కోసం డబ్బులు చెల్లించడానికి రూ.5 లక్షల 34 వేలతో ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. ఉప్పల్‌లోని మెట్రోస్టేషన్ కల్యాణపురి ప్రాంతం వైపు వెళ్లే మార్గంలో ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వచ్చి మోహన్‌ స్వర్ణపాల్ వాహనం ఆపారు. మేము పోలీసులమని చెప్పి వాహనం తనిఖీ చేశారు. ఇతర వస్తువులతో పాటు డబ్బుల బ్యాగును తీశారు. బ్యాగుతోపాటు ద్విచక్ర వాహనం కీ తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు రమ్మని చెప్పి వెళ్లారు. దీనితో స్వర్ణపాల్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా అక్కడ వారు లేకపోవడంతో మోసపోయానని గ్రహించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

click me!