ఎక్స్ ప్రెస్ న్యూస్ :తొలి టీ ట్వంటీ లో టీం ఇండియా ఘన విజయం

First Published Nov 1, 2017, 11:01 AM IST
Highlights

విశేష వార్తలు

  • కివీస్ పై టీం ఇండియా ఘన విజయం
  • చిన్నారులపై లైంగిక దాడులు అరికట్టాలి - డిజిపి
  • మార్ఫింగ్ పోటోలతో వర్మ సంచలనం
  • కోదండరాం దీక్షకు తెలంగాణ టిడిపి మద్దతు
  • రబ్బరు బొమ్మ మింగి ఏలూరులో బాలుడి మృతి

తొలి టీ ట్వంటీ లో టీం ఇండియా ఘన విజయం

ఢిల్లీ వేదికగా ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో భారత్-న్యూజిలాండ్‌ల మధ్య జరిగిన తొలి టీ ట్వంటీ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది.  కివీస్ జట్టుపై భారత్ 53 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన టీం ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది.  టీం ఇండియా ఒపెనర్లు శిఖర్ దావన్ రోహిత్ శర్మలు చెలరేగడంతో ఈ భారీ స్కోరు నమోదయ్యంది.తర్వాత 203 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు ఏ దశలోను లక్ష్యాన్ని చేరేలా కనిపించలేదు. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు మాత్రమే చేయగల్గింది. 

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కివీస్

భారత న్యూజిలాండ్ మద్య డిల్లీలో జరుగనున్న మొదటి టీ ట్వంటీ మ్యాచ్ లో కివీస్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఫిరోజ్ షా కోట్లా పిచ్ బౌలింగ్ అనుకూలించే అవకాశం ఉండటంతో కివీస్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే న్యూజిలాండ్ తో ఒక్క టీ ట్వంటీ కూడా గెలవని టీం ఇండియా ఈ మ్యాచ్ గెలిచి ఆ అపవాదును చెరిపేసుకోవాలని చూస్తోంది. అయితే టీ ట్వంటీల్లో తమ విజమ పరంపర కొనసాగించాలని కివీస్ కూడా పట్టుదలతో ఉంది. చూడాలి విజయం ఎవరిని వరిస్తుందో. 

ఎపి సచివాలయంలో ఆత్మహత్యాయత్నం

అమరావతి సచివాలయం వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం కలకలం సృష్టించింది. కర్నూల్ జిల్లా అదోనికి చెందిన ఓ వ్యక్తి సీఎంను కలిసేందుకు సచివాలయానికి వెళ్లాడు. సీఎం కేబినెట్ మీటింగ్ లో ఉన్నాడని కలవడం కుదరదని సెక్యూరిటీ సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. దీంతో తనతో పాటెు తెచ్చకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దీంతో అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది అంబులెన్స్ కు సమాచారం అందించడంతో వారు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం అతడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 
 

యూపీలో బాయిలర్ పేలి తొమ్మిది మంది మృతి

ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీలో ఘోరం జరిగింది. ఎన్టీపిసి థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రంలో బాయిలర్ పేలి 9 మంది చనిపోయారు. మరో 100 మంది వరకు గాయపడ్డారు. ఆరవ యూనిట్ లోని బాయిలర్ ను తెరిచిన వెంటనే ఒక్కసారి బారీ శబ్దంతో పేలిపోయినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ప్లాంట్ లో సుమారు 150 మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. 
 

ఆడ పిల్లలపైనే కాదు మగ పిల్లలపై కూడా లైంగిక వేధింపులు-డిజిపి

దేశంలో ఆడ పిల్లలే కాదు మగ పిల్లలు కూడా సెక్సువల్ అబ్యూస్ కి గురవుతున్నారని తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ తెలిపారు. దేశంలో ప్రతి 155 నిమిషాలకు 16 సంవత్సరాల లోపు ఒక్కరు, ప్రతి 13 గంటలకు 10 సంవత్సరాల లోపున్న ఒక్క చిన్నారి అత్యాచారానికి గురవుతున్నారని వివరించారు. ఏదో ఒక సమయంలో ప్రతి 10 మంది చిన్నారులో ఒక్కరు అత్యాచారానికి గురవుతున్నారని డిజిపి తెలిపారు. ఈ లెక్కలు చూస్తుంటే అసలు చిన్నారులకు రక్షణ ఉందా అన్న అనుమానం కలుగుతుందని అన్నారు.
ఇవాళ ఆయన చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ పై రూపొందించిన లోగో, ఆడియో సాంగ్స్ ను ఆవిష్కరించారు.  ఈ నెల 3 వ తేదీ నుంచి చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని. ఈ కాంపెయిన్ లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఎన్జీవో సంస్థలు పాల్గొంటాయని అనురాగ్ శర్మ అన్నారు.
 

''చంద్రబాబు బలహీనతలే రాష్ట్రానికి శాపం''

చంద్రబాబు బలహీనతలు రాష్ట్రానికి శాపంగా పరిగణించాయని ఏపీ పిసీసీ ముఖ్య అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ విమర్శించారు. ఈ బలహీనతలను అడ్డంపెట్టుకుని ఆంధ్రప్రదేశ్ కు నిధులు ఇవ్వకుండా  మోడీ సర్కారు నాటకాలాడుతోందని అన్నారు. సీఎం ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా బీజేపీతో అంట కాగుతూ రాష్ట్ర ప్రయోజనాలను కాలరాస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా చంద్రబాబు ఎన్డీఏ సర్కారు నుంచి  వైదొలగి, ప్రత్యేక హోదాతో సహా విభజన చట్టం ప్రకారం ఏపీకి అందాల్సిన ప్రయోజనాల కోసం జాతీయ స్థాయిలో  ఉద్యమించాలని పిలుపునిచ్చారు. 

అసెంబ్లీ రేపటికి వాయిదా

వాడి వేడి చర్చల అనంతరం తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. ఇవాళ సభ మొదలవగానే ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. అనంతరం జీరో అవర్ ఆ తర్వాత పంటలకు మద్దతు ధర, రుణ మాపి,రైతు సంక్షేమం తదితర అంశాలపై చర్చ జరిగింది. రైతు సమస్యలపై ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానాలు చెప్పారు. చర్చల అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు, తిరిగి రేపు 10 గంటలకు సభ ప్రారంభమవుతుందని డిప్యూటి స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి వెల్లడించారు. 
 

''నూతన సచివాలయం నిర్మిస్తే ప్రాణత్యాగమే''

ఎట్టి పరిస్థితుల్లో సీఎం నూతన సచివాలయాన్ని నిర్మిస్తున్నానని అంటున్నారని, కానీ సచివాలయానికి పునాదిరాయి కూడా వేయనియ్యబోమని కాంగ్రెస్ నేత హన్మంతరావు హెచ్చరించారు. అదే గనుక జరిగితే తాను ప్రాణ త్యాగానికైనా సిద్దమని తెలిపారు. నూతన సచివాలయం పేరిట ప్రజా ధనాన్ని దుర్వినియూగం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ విషయంలో కేసీఆర్ ను ఎదుర్కోడానికి అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాలని వీహెచ్ పిలుపునిచ్చారు.
 

కాంగ్రెస్ రియల్ మెగాస్టార్ ఆయనే అంటున్న రాంగోపాల్ వర్మ

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో సారి రేవంత్ రెడ్డి పై సోషల్ మీడియా లో పెట్టిన కొన్ని మార్ఫింగ్ పోటోలు వైరల్ గా మారాయి.  బాహుబలి మరియు ఖైదీ నెం 150 లోని చిరు పోటోలను మార్ఫింగ్ లో రేవంత్ ను చేర్చి సోషల్ మీడియాలో ఫోస్ట్ చేశారు. దాని కింద రియల్ మెగాస్టార్ కాంగ్రెస్ అంటూ పోస్ట్ పెట్టి చిరంజీవికి చురకలు అంటించారు. అయితే వర్మ ఈ పోస్టింగ్ పై చిరు అభిమానులు మండిపడుతున్నారు.
 

''బెంగళూరు బస్సుల్లో సగం మంది మహిళా డ్రైవర్లు''

బెంగళూరుతో ఇకనుంచి ఆర్టీసి బస్సుల్లో మహిళా డ్రైవర్లు ఎక్కువగా కనబడనున్నారు. ఎందుకంటే కేఎస్ ఆర్టీసి బెంగళూరు మెట్రోపాలిటిన్ కార్పోరేషన్ పరిధిలో నడిచే బస్సుల్లో 50 శాతం మహిళా డ్రైవర్లను నియమించాలని నిర్ణయం తీసుకుంది. మహిళా సాధికారత కోసమే ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు ఆర్టీసి అధికారులు తెలిపారు. దీంట్లో బాగంగా మహిళలకు ప్రత్యేక డ్రైవింగ్ శిక్షణతో పాటు, ఉచితంగా డ్రైవింగ్ లైసెన్సు అందించనున్నారు.
 

''డిజిపి గా తన నియామకం ఇంకా జరగలేదు''

తెలంగాణ కొత్త డిజిపి గా నియమితులయ్యాడని వస్తున్న రూమర్స్ పై ఐపీఎస్ అధికారి తెన్నేటి కృష్ణ ప్రసాద్ స్పందించారు. ఇదంతా సోషల్ మీడియా ప్రచారమని, అలాంటి నిర్ణయమేమీ జరగలేదని అన్నారు. సోషల్ మీడియా ప్రచారమవుతున్న ఇలాంటి రూమర్స్ నమ్మొదని కృష్ణ ప్రసాద్ ఫేస్ బుక్ ద్వారా తెలిపారు. అలాగే లైక్, కామెంట్, షేర్ చేయవద్దని నెటిజన్లకు ఆయన విజ్ఞప్తి చేశాడు. 

కోదండరాం దీక్షకు తెలంగాణ టిడిపి మద్దతు (వీడియో) 

నిరుద్యోగ సమస్యలపై పోరాడుతున్న జేఎసి పై తెలంగాణ సర్కారు అవలంభిస్తున్న వైఖరిని నిరసిస్తూ కోదండరాం చేపడుతున్న 24 గంటల నిరసన దీక్షకు తెలంగాణ టిడిపి మద్దతు తెలిపింది. తెలంగాణ టిడిపి పార్టీ అద్యక్షుడు ఎల్. రమణ, పెద్ది రెడ్డి లు దీక్షాస్థలికి చేరుకుని కోదండరాంకు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. సర్కారు ఇకనైనా కళ్లు తెరిచి ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని వారు హితవు పలికారు.

రబ్బరు బొమ్మ మింగి బాలుడి మృతి

ఏలూరు పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. చిప్స్ ప్యాకెట్ లో వచ్చిన రబ్బరు బొమ్మను  మింగి నిరీక్షణ్ అనే నాలుగేళ్ల బాలుడు  యృతిచెందాడు. ఈ బాలుడు రింగ్స్ చిప్స్ ప్యాకెట్ లో వున్న చిన్న రబ్బరు బొమ్మను కూడా చిప్స్ తో పాటు మింగాడు. దీంతో అది గొంతులో ఇరుక్కుపోయి ఊపిరాడకుండా చేసింది. దీన్ని గమనించిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మద్యలోనే బాలుడు మరణించాడు.   

కోదండరాం దీక్షకు మద్దతుగా ఓయూలో మానవహారం (వీడియో)

 

ప్రజా ఉద్యమాలను అణచివేస్తున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రొఫెసర్ కోదండరాం చేపడుతున్న 24 గంటల దీక్షకు మద్దుతుగా ఇవాళ ఓయూ లో విద్యార్థులు క్యాంపస్ బంద్ కు పిలుపునిచ్చారు. విద్యార్థులంతా స్వచ్చందంగా ఆర్ట్స్ కళాశాల వద్దకు చేరుకుని దీక్షకు మద్దతుగా మానవ హారంగా ఏర్పడి తమ నిరసన తెలిపారు.

ఎపిలో ఉపరాష్ట్రపతి వెంకయ్య పర్యటన షెడ్యూల్

భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఈ నెల 5 వ తేదీ నుంచి 7 వ తేదీ వరకు ఎపిలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్ ఇలా ఉంది. 5 వ తేదీ ఉదయం 10 గంటలకు విజయవాడకు చేరుకోనున్న వెంకయ్య, నేరుగా స్వర్ణభారతి ట్రస్ట్ కు చేరుకుంటారు.అక్కడ పేదల కోసం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తారు.
6వ తేదీన రాజమండ్రిలో ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్ ప్రారంభించనున్న వెంకయ్య, సాయంత్రం విజయవాడలో జరిగే కోటిదీపోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి ఇక్కడే బస చేసి 7వ తేదీన ఉదయం ఢిల్లీకి తిరిగి బయలుదేరతారు. 

ఎపి మంత్రిమండలి సమావేశం

రాజధాని అమరావతి లో ఇవాళ ఎపి క్యాబినెట్ సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు నాయుడు అద్యక్షతన జరుగనున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ లో కొన్ని పనులు కొత్త వారికి ఇచ్చే అంశం పైన మంత్రివర్గం చర్చించనుంది.  అలాగే రాష్ట్రంలో నిరుద్యోగ భృతి విధి విధానాలు,సీఎం విదేశీ పర్యటన పలితాలు, అసెంబ్లీ సమావేశాల్లో పెట్టాల్సిన బిల్ల గురించి చర్చించనున్నారు.
అలాగే పట్టణాభివృద్ధి సంస్థలో 597 పోస్టుల భర్తీ అనుమతిపై నిర్ణయం తీసుకోనున్నారు. 
రాజధాని గ్రామాల పరిధిలోని  ప్రభుత్వం కు చెందిన 3500 ఎకరాలు భూమిని సీఆర్డీఏ కు బధలయింపుకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది.
 

click me!