ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెదేపా నేత నామాపై కేసు నమోదు

First Published Oct 28, 2017, 10:48 AM IST
Highlights

విశేష వార్తలు

  • నామాపై మహిళా వేదింపుల కేసు 
  • విజయవాడ నుంచి నేరుగా కొడంగల్ కు వెళుతున్న రేవంత్
  • కంచ ఐలయ్యపై మళ్లీ ద్వజమెత్తిన టిజి వెంకటేష్ 
  • టిడిపి పార్టీ సభ్యత్వానికి  రేవంత్ రెడ్డి రాజీనామా
  • రేవంత్ రెడ్డి ప్లెక్సీని దహనం చేసిన టీఆర్‌ఎస్‌వీ కార్యకర్తలు
  • కొలువుల కొట్లాట సభపై జరిపితీరతామంటున్న కోదండరాం  

తెదేపా నేత నామాపై కేసు నమోదు

హైదరాబాద్‌ : తెదేపా నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుపై జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. నామా తనను బెదిరిస్తున్నాడని, దుర్భాషలాడుతున్నాడని జూబ్లీహిల్స్‌కు చెందిన సుజాత రామకృష్ణన్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 23న నామా నాగేశ్వరరావు ఆయన సోదరునితో కలిసి తన ఇంటికి వచ్చి దుర్భాషలాడుతూ బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో ఖమ్మంలో తన కుమారుడు చదువుతోన్న కళాశాలకు ఓ అజ్ఞాత వ్యక్తిని పంపించి నామా సోదరుడు బెదిరించారని, ఈ విషయమై జులై 30వ తేదీనే పోలీసులకు ఫిర్యాదు చెసినట్లు తెలిపారు. నామా, ఆయన సోదరుని నుంచి తనకు ప్రాణ హానీ ఉందని..బెదిరింపులకు సంబంధించి వీడియో, ఆడియో టేపులను వాట్సాప్‌ ద్వారా పంపినట్లు ఫిర్యాదులో తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
 
 

నేరుగా కొడంగల్ కి వెళుతున్న రేవంత్ 

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి నేరుగా తన నియోజకవర్గమైన కొడంగల్ వెలుతున్నాడు. చంద్రబాబుతో సమావేశం అనంతరం పార్టీకి రాజీనామా చేసిన ఆయన విజయవాడ నుంచి రోడ్డుమార్గంలో బయలుదేరాడు. అయతే హైదరాబాద్ కు వస్తాడని అందరూ బావిస్తున్న నేపధ్యంలో ఔటర్ రింగ్ రోడ్ పై నుంచి నేరుగా కొడంగల్ కు వెళుతున్నారు. అక్కడ తన అనుచరులు, కార్యకర్తలతో కీలక సమావేశం నిర్వహించనున్నాడు. వారి సలహాలు, సూచనల మేరకు తదుపరి కార్యచరణ ప్రకటించే అవకాశం ఉంది. దీని తర్వాత మీడియాతో తన రాజీనామాపై, ఇవాళ విజయవాడలో జరిగిన పరిణామాలపై వివరించే అవకాశం ఉంది. 

కల్వకుంట్ల శోభ పదవీవిరమణ కార్యక్రమంలో కేటీఆర్

దేశ అభివృద్దిలో పంచాయితీ రాజ్ వ్యవస్థలు ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్నాయని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్ ఎంపీడీవో కల్వకుంట్ల శోభ పదవీవిరమణ,పౌర సన్మానం సభలో మరో మంత్రి పట్నం మహేందర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ని నిధులు మంజూరు చేసినా, స్థానికంగా వాటిని సక్రమంగా వినియోగించుకోకుంటే అభివృద్ధి శూన్యం గా ఉంటుందన్నారు. అందుకోసం స్థానికి ఉద్యోగుల పాత్ర అదికంగా ఉంటుందని, అందువల్ల ఆ అధికారులకు శక్తి, యుక్తితో పనిచేయాలని కేటీఆర్ సూచించారు.

తెలంగాణలో మరో విద్యార్థి ఆత్మహత్య

జగిత్యాల జిల్లాలోని నాచునల్లి జేఎన్ టీయు లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.  శ్రీలక్ష్మి అనే బిటెక్ మూడవ సంవత్సరం విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.   ఈ విద్యార్థిని స్వస్థలం ఖమ్మం జిల్లా వైరా. అయితే ఈ ఆత్మహత్యపై కళాశాల స్రన్సిపల్ స్పందిస్తూ కుటుంబకలహాలతోనే ఈ యువతి ఆత్మహత్యకు పాల్పడినట్లు బావిస్తున్నామన్నారు. అయితే ఈ యువతి ఆత్మహత్యపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

ఐలయ్యను గృహనిర్భందం చేసినందుకు సీఎంలకు ధన్యవాదాలు

ఐలయ్య ను విజయవాడకు వచ్చుంటే విజయవాడ ప్రజలు ఆయన్ని కృష్ణా నది వరకు తరిమికొట్టేవారని రాజ్యసభ ఎంపి టిజి వెంకటేష్ అన్నారు. ఆయన్ని గృహ నిర్భందం విధించినందుకు రెండు తెలుగు రాష్ట్రాల సీఎం లకు తాను ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.ఐలయ్య కుల మతాలను రెచ్చగొట్టేలా చేస్తున్న వ్యాఖ్యలు కేవలం ఆర్యవైశ్యులనే కాదు, 95 శాతం రాష్ట్ర ప్రజలందరి మనోబావాలను దెబ్బతీసాయని విమర్శించారు. ఆయన తన వ్యాఖ్యలన్నీ విత్ డ్రా చేసుకుంటే తాము కూడా ఆయనపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటామని టీ జి వెంకటేష్ తెలిపారు. 

డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ గజ్జల కాంతం

కరీంనగర్ పట్టణంలో  పోలీసులు  నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో ప్రజాసంఘాల జేఎసి చైర్మన్ గజ్జెల కాంతం పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే ఇవాళ కరీంనగర్ పట్టణంలోని ఆర్ ఆండ్ బి గెస్ట్ హౌస్ వద్ద పోలీసులు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో అటువైపు కారులో వచ్చిన గజ్జెల కాంతంను ఆపి బ్రీత్ అనలైజర్ తో పరీక్షించాలనుకున్నారు. అయితే దానికి అతడు సహకరించకపోవడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.  

రేవంత్ రెడ్డి రాజీనామా

తెలుగుదేశం పార్టీ తో తనుకున్న బంధాన్ని తెంపుకున్నారు రేవంత్ రెడ్డి. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి  ఆయన అమరావతిలోనే రాజీనామా సమర్పించారు. పార్టీ అధినేత చంద్రబాబుకే రాజీనామా లేఖను అందజేశారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అనుసరిస్తున్న తీరుకు నిరసనగా రేవంత్ పార్టీని వీడుతున్నట్లు పేర్కొన్నారు. టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాలనుకున్న టిడిపి వ్యవహారిక శైలి నచ్చకనే రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. చంద్రబాబు రాకముందే పార్టీలో రేవంత్ ను బయటకు పంపేందుకు కసరత్తు జరిగినట్లు తెలిసిందే. అయితే టిడిపి, టిఆర్ఎస్ పొత్తు విషయంలోనే రేవంత్ గట్టిగా పట్టుకుని కూర్చున్నారు. కానీ టిడిపి, టిఆర్ఎస్ పొత్తును ఆపలేనని నిర్దారించుకున్న రేవంత్ ఇవాళ అమరావతి వేదికగా రాజీనామా లేఖను బాబుకు అందజేశారు.  ఈరోజే రేవంత్ హైదరాబాద్ కు తిరుగు పయనమయ్యే అవకాశం ఉంది.

వికారాబాద్ జిల్లాలో మిషన్ భగీరథ పనుల్లో అపశృతి 

వికారాబాద్ జిల్లా లో చేపడుతున్న మిషన్ భగీరథ అపశృతి చోటుచేసుకుంది. పూడుర్ మండలం రాకంచర్ల గ్రామంలో చేపడుతున్న మిషన్ భగీరథి వాటర్ ట్యాంక్ నిర్మాణ పనుల్లో ప్రమాదవశాత్తు ఓ కూలీ చనిపోయాడు. ట్యాంక్ పై నుంచి జారీ పడి బీహార్ కు చెందిన ఫంత్ లాల్ అనే వ్యక్తి మృతి చెందాడు. సేఫ్టీ పరికరాలు లేక పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని, అందువల్లే తమ తోటి కార్మికుడు  మృతి చెందాడని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 

సిరిసిల్ల లో రేవంత్ రెడ్డి ఫ్లెక్సీ దహనం

రాజన్న సిరిసిల్ల : ఐటీ మంత్రి కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీని టీఆర్‌ఎస్వీ కార్యకర్తలు దహనం చేశారు. మంత్రిని విమర్శించే స్థాయి రేవంత్ కు లేదంటూ టీఆర్‌ఎస్వీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రేవంత్‌రెడ్డి మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని, అది గమనిస్తున్న ప్రజలే తగిన బుద్ధి చెబుతారని టీఆర్‌ఎస్‌వీ నేతలు ధ్వజమెత్తారు.  

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం,ఆరుగురి మృతి

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలంలో ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోడేకుర్రు గ్రామ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను లారీ డీ కొట్టడంతో ఆరుగురు ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. మరో 7 మంది ప్రయాణికులు కు తీవ్ర గాయాలయ్యాయి. వారందరిని చికిత్స నిమిత్తం అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. 
ఈ ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప హుటాహుటిన  సంఘటన స్థలానికి చేరుకున్నారు. అలాగే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. క్షతగ్రాతులకు తక్షణం మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. అలాగే మృతుల కుటుంబాలకు కూడా ప్రగాఢ సానుభుతి తెలిపిన చినరాజప్ప, వారికి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
 

''కొలువుల కొట్లాట సభ ఎట్టి పరిస్థితుల్లో జరుగుతుంది''

ఈ నెల 31వ తేదీన జరిగే కొలువుల కొట్లాట సభ యధాతథంగా జరుగుతుందని టి జెఎసి చైర్మన్ కోదండరాం స్పష్టం చేశారు. సభకు కోర్ట్ అనుమతి ఇస్తుందని ఆశాబావం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.  ఎన్టీఆర్ స్టేడియం, ఎల్బి స్టేడియం,సరూర్ నగర్ స్పోర్ట్స్ గ్రౌండ్ లలో ఎక్కడో ఒకచోట అనుమతి ఇవ్వాలని కోర్ట్ ని కోరామని, అవి కాకుండా గ్రేటర్ పరిధిలో ఎక్కడ అనుమతిచ్చినా తమకు సమ్మతమేనన్నారు.  
 అయితే సభ జరగకుండా పోలీసులు సర్వశక్తులు ఒడ్డుతున్నారని, మీటింగ్ కి గ్రౌండ్-హాల్స్ ఇవ్వకుండా యజమానులని పోలీసులు బెదిరిస్తున్నారని తెలిపారు. అసలు రాష్ట్రం హోంమంత్రి ఉన్నడా అన్న అనుమానం కలుగుతోందని,సభలు పెడతమంటే మావోయిస్టుల పేరుతో అనుమతి నిరాకరించండం దురదృష్టకరమన్నారు కోదండరాం. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించిన కొలువుల కొట్లాట సభ జరిపి తీరతామని కోదండరాం స్పష్టం చేశారు.

ఎసిబి వలలో ఎపి పోలీస్

కర్నూల్ : అక్రమంగా ఆస్తులు కలిగివున్నాడన్న సమాచారంతో సిఐడి డిఎస్పీ హరనాథ్ రెడ్డి ఇంటిపై ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. ఏకకాలంలో అతడికి సంభందించిన 9 చోట్ల ఎసిబి అధికారులు సోదాలు చేశారు. కర్నూల్, కడప, తుగ్గలి, డబూరు వారిపల్లి, బెంగళూరులలో ఈ సోదాలు కొనసాగాయి. కర్నూల్ లో రెండు భవనాలు, కడపలో ఒక భవనం, తుగ్గలిలో 10 ఎకరాల భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటి విలువ దాదాపు 15కోట్ల వరకు ఉంటుందని ఎసిబి అధికారులు తెలిపారు.
 

కంచ ఐలయ్య విజయవాడ వస్తే అరెస్టె : డీజీపీ
 

విజయవాడలో కంచ ఐలయ్య అభినందన సభకు అనుమతి లేదని, అతడు విజయవాడ వస్తే అరెస్టు చేస్తామని ఎపి డీజీపీ సాంబశివరావు తెలిపారు. కులాలు, మతాల పేరిట సభలు, ఆందోళనలకు అనుమతి ఇవ్వలేమని ఆయన తేల్చి చెప్పారు. ఈ సభ సందర్భంగా ఎలాంటి అలజడి జరగకుండా విజయవాడలో 144 సెక్షన్ విధించామని, శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా అరెస్ట్‌ చేస్తామని హెచ్చరించారు. తుని సంఘటనను దృష్టిలో పెట్టుకుని ఈ సభకు అనుమతి నిరాకరిస్తున్నట్లు డీజీపీ తెలిపారు.

అమరావతికి చేరిన రేవంత్ పంచాయితీ (వీడియో)

కృష్ణా : టిటిడిపి పంచాయితీ ఇపుడు ఏపికి చేరింది.  తెలంగాణ టిడిపి ముఖ్య నేతలంతా అమరావతి బాట పట్టారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి అమరావతికి బయల్దేరిన రేవంత్ రెడ్డి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే అక్కడే వున్న ఏపి మంత్రి పత్తిపాటి పుల్లారావు రేవంత్ కు  ఆత్మీయంగా స్వాగతం పలికారు. 
తెలంగాణ సీనియర్ నాయకులు గరికిపాటి మోహనరావు, అరవింద్ గౌడ్ లు కూడా ఇప్పటికే అమరావతికి చేరుకున్నారు. రేవంత్ రెడ్డి పార్టీ మార్పు అంశంపై జరుగుతున్న ఈ సమావేశంపై ఒక్క టిడిపి వర్గాలే కాదు అటు ఏపి, ఇటు తెలంగాణ ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

click me!