ఎక్స్ ప్రెస్ న్యూస్ :"ఎట్టి పరిస్థితుల్లోను ఈ నెల 31 తేదీనే కొలువులకై కొట్లాట'' (వీడియో)

First Published Oct 27, 2017, 11:23 AM IST
Highlights

విశేష వార్తలు

  • అస్వస్థతకు గురైన సోనియా
  • తెలంగాణ నిరుద్యోగులకు  తీపి కబురు
  • జగ్గయ్యపేటలో ఉద్రిక్తత
  • కేసీఆర్ కు పొన్నం ప్రభాకర్ హెచ్చరిక
  • చంద్రబాబు తో టిటిడిపి నేతల భేటీ

విజయవాడలో 144 సెక్షన్

విజయవాడలో కంచ ఐలయ్య కు మద్దతుగా రేపు జరుగనున్న సభ వల్ల ఉద్రిక్త వాతావరణం  నెలకొంది. దీంతో పోలీసులు విజయవాడలో 144 సెక్షన్ విధించారు. సభలకు, సమావేశాలకు, ర్యాలీలకు అనుమతి లేనందున వేరే ప్రాంతాలను నుంచి విజయవాడకు ఎవరు రావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.ఇప్పటికే ఐలయ్యతో పాటు 298 మందికి నోటీసులు ఇచ్చామని, నిభందనలు ఉల్లంగించిన వారిపై కఠిన చర్యలుంటాయని పోలీసులు హెచ్చరించారు.

"ఎట్టి పరిస్థితుల్లోను ఈ నెల 31 తేదీనే కొలువులకై కొట్లాట'' (వీడియో) 

తెలంగాణ జేఎపి ఈ నెల 31 న తలపెట్టిన కొలువులకై కొట్లాట సభను ఎట్టి పరిస్థితుల్లోను నిర్వహించి తీరతామని కోదండరాం స్పష్టం చేశారు. కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తందని, దీనిపై ఎవరికి అనుమానాలు అవసరం లేదన్నారు. సభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోదండరాం పిలుపునిచ్చారు. 

ఐలయ్య పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు 
 

ప్రొఫెసర్ కంచె ఐలయ్య పై జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు నమోదయింది.  దళితులపై ఐలయ్య చేసిన వ్యాఖ్యలతో మనోవేదనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర నాయకులు దొంతమల్ల రాంబాబు తెలిపారు. సామాజిక స్మగ్లర్లు అనే పుస్తకంలో దళితుల గురించి కొన్ని అభ్యంతరకర పదాలున్నాయని ఆయన అన్నారు. ఓ ఇంటర్య్యూలో లక్ష కోట్లు ఇస్తే దళితులను మతం మార్చేస్తా అన్న ఐలయ్య వ్యాఖ్యాలు దళితులను కించ పర్చేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.  వీటిపై ఆధాలతో సహా అతడు జవహార్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో 153(A) సెక్షన్స్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
 

కాంగ్రెస్ అద్యక్షురాలు సోనియా గాంధికి అస్వస్థత

కాంగ్రెస్ పార్టీ అద్యక్షురాలు సోనియా గాంధి మరోసారి అస్వస్థకు గురయ్యారు. తీవ్ర కడుపునొప్పితో ఆమె న్యూడిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో చేరారు. ఆమెను ప్రత్యేక వైద్యుల బృందం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. హాస్పిటల్లో వారి కుటుంబ సభ్యులు,సన్నిహితులు మాత్రమే ఉన్నట్లు సమాచారం.  ఆమె ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుండటంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నారు.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సుప్రీం ను ఆశ్రయించిన మమతా బెనర్జీ

ఆర్థిక లావాదేవీలకు ఆధార్ ను జతచేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను వ్యతిరేకిస్తూ బెంగాల్ సీఎం మమతా బెసర్జీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సంక్షేమ పథకాలకు కూడా ఆధార్ ను జత చేయాలన్న కేంద్రం ఆదేశాలను ఆమె మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. మొబైల్ ఫోన్ కు కూడా ఆధార్ లింకు చేయాలన్న నిర్ణయాన్ని ఇదివరకే వ్యతిరేకించిన మమత, కాల్ ట్యాపింగ్ కోసమే ఈ అనుసందానాన్ని అడుగుతున్నారని విమర్శించారు. ఎట్టి పరిస్థితుల్లోను ఈ నిభందనను తాను అనుమతించే ప్రసక్తే లేదని మమత తెలిపారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది.
 

తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్

తెలంగాణ రాష్ట్రంలో బాషా పండితుల ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ లేదా పిజి,మెథడాలజీ, తెలుగు సబ్జెక్టులను చదివిన అభ్యర్థులు ఇందుకు అర్హులుగా కమీషన్ ప్రకటించింది. ఇందుకు అర్హత కల్గిన అభ్యర్థులు నవంబర్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్ పిఎస్సి తెలిపింది. మిగతా వివరాల కోసం అపిషియల్  వెబ్ సైట్  లో చూడవచ్చు. 
 
 

తెలంగాణ లో మెట్రో కోచ్ ప్యాక్టరీ

తెలంగాణ లో మెట్రో కోచ్ ప్యాక్టరీ ఏర్పాటుకు రంగం సిద్దమైంది. సంగారెడ్డి జిల్లాలోని కొండకల్ ప్రాంతంలో ఈ కోచ్ ప్యాక్టరీని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంభందించిన మేద సర్వ్ డ్రైవ్ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఒప్పందం కుదుర్చుకుంది. బేగంపేట ఐటీసి కాకతీయలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పంద పత్రాలపై సంబదిత అధికారులు సంతకాలు చేశారు. రూ 800 కోట్లతో 100 ఎకరాల స్థలంలో ఈ కోచ్ ప్యాక్టరీ నిర్మించనున్నారు. దీని రాకతో 2 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుందని కేటీఆర్ తెలిపారు.     
 
 

సదావర్తి భూముల వేలం రద్దయినట్టే : సుప్రీం కోర్టు

సదావర్తి భూముల పై దాఖలైన పిటిషన్  సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ భూముల అసలు యజమాని ఏపీనా , తమిళనాడా అనేది హైకోర్టు  తేలాల్సి వున్నందున ఇప్పటికే జరిగిన వేలం రద్దు అయినట్టేనని ధర్మసనం పేర్కొంది. అయితే ఈ భూములు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానివని తేలితే  రెండవ  బిడ్డర్ గా వున్న తనకె భూములు కేటాయించాలని చదలవాడ లక్ష్మణ్ వేసిన పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. వేలం రద్దయినట్లే కావున డిపాజిట్ గా చెల్లించిన డబ్బులు వెనక్కు తీసుకోవాలన్న పిటిషనర్ కు ధర్మాసనం సూచించింది.
 

మహబూబ్ నగర్ జిల్లాలో కాంట్రాక్ట్ టీచర్ల నిరసన

మహాబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిట్టబోయిన్ పల్లి  సాంఘీక సంక్షేమ పాఠశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు టీచర్లు తమను రెగ్యులరైజ్ చేయాలంటూ నిరసన చేపట్టారు. గత ఆరు రోజులుగా విరామ సమయాల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి పాఠశాల ముందు నిరసన చేస్తున్నారు.  పది సంవత్సరాలుగా కాంట్రాక్టు బేసిక్ పై పనిచేస్తున్నామని, ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చన హామీ మేరకు తమను రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం నిరసన విరామ సమయాల్లో మాత్రమే చేస్తున్నామని, ప్రభుత్వం తమను రెగ్యులరైజ్ చేయకుంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు.  

జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో ఉద్రిక్తత (వీడియో)

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది.  టీడీపీ నేతలు మున్సిపల్ ఆఫీస్ వద్ద  విధ్వంసం సృష్టించారు. శుక్రవారం జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉంది.  ఈ నేపద్యంలో వైసీపి పార్టీ తమ ఇద్దరు కౌన్సిలర్లను కిడ్నాప్ చేసిందని పేర్కొంటు మున్సిపల్ కార్యాలయంలో విద్వంసానికి దిగారు.ఈ విద్వంసం కారణంగా పోలీసులు ప్రస్తుతం అక్కడ 144 సెక్షన్ విధించారు.
 

కేసీఆర్ ప్రభుత్వానికి పొన్నం హెచ్చరిక (వీడియో)

తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న రైతు వ్యతిరేక పరిపాలకు నిరసనగానే ఇవాళ చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కరీంనగర్ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కేసీఆర్ కు ఎప్పుడూ రాజకీయాలు, సీట్ల గెలుపుపై వున్న శ్రద్ద రైతాంగంపై లేదని విమర్శించారు. రూతులు కష్టాల్లో ఉంటే మీరు సభలు సమావేశాలు జరుపుకోవడం ఏంటని మండిపడ్డారు. ఇంకా ప్రభుత్వం పై పొన్నం ఏ విధంగా రెచ్చిపోయారో పై వీడియోలో చూడొచ్చు.

చంద్రబాబుతో టిటిడిపి నేతల భేటి, రేవంత్ తో సహా

తెలంగాణ తెలుగుదేశం నేతలతో ఆ పార్టీ జాతీయాద్యక్షుడు చంద్రబాబు లేక్ వ్యూ అతిథి గృహంలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ తెలుగుదేశం అద్యక్షుడు ఎల్ రమణ, నామా నాగేశ్వరరావు, మోత్కుపల్లి నర్సిములు, పెద్దిరెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్,ఉమా మాధవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా రేవంత్ పార్టీ మారనున్నాడన్న అంశం పై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై చంద్రబాబుకు మాత్రమే వివరణ ఇస్తానన్న రేవంత్, ఈ సమావేశంలోనే పార్టీ అధినేతకు వివరణ ఇవ్వనున్నట్లు సమాచారం. 

తెలంగాణ ఉభయ సభల వాయిదా

హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ, మండలి సమావూశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాత రెండు సభలను వాయిదా వేస్తున్నట్లు  డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఛైర్మన్ స్వామిగౌడ్ ప్రకటించారు. ఉభయసభలు సోమవారం తిరిగి ప్రారంభం కానున్నాయని తెలిపారు.

చీరాల ఎమ్మెల్యే సోదరుడు ఇంట్లో భారీ చోరీ 

ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు సీతారామయ్య ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఆయన ఇంట్లోనుంచి 200 గ్రాముల బంగారం, 15 లక్షల రూపాయల నగదు చోరీకి గురయ్యినట్లు సమాచారం.దీనిపై సమాచారం అందుకున్న చీరాల పోలీసులు డాగ్ స్క్వాడ్లతో చోరీ జరిగిన ఎమ్మెల్యే సోదరుని ఇంటికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు.

కొనసాగుతున్న కాంగ్రెస్ నేతల అరెస్టులు
 

కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చలో అసెంబ్లీ ఉద్రిక్తంగా మారింంది. కార్యకర్తలతో కలిసి అసెంబ్లీ వద్దకు బయల్దేరిన పిసిసిసి అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు రవి లను పోలీసులు నాంపల్లి చౌరస్తా వద్ద అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు కాంగ్రెస్ నేతలు మల్లు రవి,  ఎమ్మెల్యే డీకే అరుణ,మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి,సునీతా లక్ష్మారెడ్డి,మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి,మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద తో పాటు మహిళా కాంగ్రెస్ నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సమయంలో పోలీసులకు,కాంగ్రెస్ శ్రేణులు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ శ్రేణులను అదుపుచేసిన పోలీసలు వీరందరిని గోషా మహల్ పీఎస్ కు తరలించారు.

click me!