సిద్దిపేట ములుగులో కేసీఆర్ ఏం చేసిండో తెలుసా?

First Published Oct 11, 2017, 10:54 AM IST
Highlights

విశేష వార్తలు

  • మరోసారి మిత్రులపై ప్రేమను చాటిన సీఎం
  • ఎన్నారై ఫరూఖ్ పై చర్యలు తీసుకోవాలని ఎన్నారై మహిళ డిమాండ్
  • కాంట్రాక్ట్ క్షురకులను తొలగించిన టిటిడి 
  • ఎన్ ఎచ్ 65 పై రోడ్డు ప్రమాదం
  • తెలంగాణ ఎస్సై ఫలితాలపై హైకోర్టు స్టే
  • మంత్రి తలసాని కారుకు యాక్సిడెంట్

హైదరాబాద్ లో హై అలర్ట్

హైదరాబాద్‌ నగరంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఏకంగా 15 రోజులపాటు ప్రత్యేక ఆంక్షలు విధించారు. నగరంలోని థియేటర్లు, బస్టాండ్లు, షాపింగ్ మాల్స్‌, దేవాలయాలు, విద్యాసంస్థలు, మద్యం షాపులు, రెస్టారెంట్లు వద్ద నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ మహేందర్‌రెడ్డి తెలిపారు. 
 ఎంటర్‌టైన్‌మెంట్ ప్రాంతాలు, జనం గుమిగూడే ప్రాంతాల్లో తక్షణమే ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులకు ఆదేశించారు. జన సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో క్యూ పద్ధతి పాటించాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో సెక్యూరిటీ సిబ్బంది అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. 
ఈ మేరకు నిబంధనలు పాటించకుంటే సంబంధిత యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. జన సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోలీసులు ఇలా ప్రత్యేక ఆంక్షలు విధించారు. అయితే, దీపావళి పండుగను పురస్కారించుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. ఈ నిషేధాజ్ఞలు  ఇచ్చినట్టు హైద్రాబాద్ సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.                    

సిద్దిపేట ములుగులో కేసీఆర్ ఏం చేసిండో తెలుసా?

తెలంగాణ సీఎం మరోసారి తన సన్నిహితులకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో పలు సంధర్భాల్లో మనం చశాం.   తాజాగా అలాంటి సంఘటనే  సిద్ధిపేటలో జిల్లాలో జరిగింది. కేసీఆర్ సిధ్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయానికి శంకుస్థాపన చేయడానికి వెళుతుండగా ములుగు వద్ద ఆయన మిత్రులు అంజిరెడ్డి, జహంగిర్ లను నిల్చని ఉండటం చేశారు. వెంటనే తన వాహనాన్ని ఆపి వారిని పలకరించి, తనతో పాటే సిద్దిపేటకు తీసుకెళ్లారు. సీఎం హోదాలో ఉండి కూడా సామాన్యులైన తన స్నేహితులకు ఇంత ప్రాధాన్యత ఇవ్వడంతో స్థానికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. 
 

ఎమ్మెల్సీ ఫరూఖ్ పై ఎన్నారై మహిళ సీరియస్

అధికార పార్టీ ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సెన్ తన ఇంటిని కబ్జా చేయాలని చూస్తున్నాడని, ఇల్లు ఖాళీ చేయాలని అడిగినందుకు తనపై దాడికి ప్రయత్నించాడని ఎన్నారై మహిళ అంతుల్ వాసే తెలిపారు.  మహిళ అని కూడా చూడకుండా తనను దుర్భాషలాడుతూ, చెప్పుతో కొట్టడానికి ప్రయత్నించాడని ఆమె ఆరోపించారు. 
దీనిపై ఇవాళ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన ఆమె... ఫరూఖ్ పై సీఎం వెంటనే చర్యలు తీసుకుని, తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. దీనిపై సీఎం స్పందించకుంటే గవర్నర్, ప్రధాని లతో పాటు యూఎస్ కాన్సులేట్ కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  

240 మంది క్షురకులను తొలగించిన టిటిడి

భక్తుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపనపై టిటిడి లో పనిచేస్తున్న 240 మంది కాంట్రాక్ట్ క్షురకులను టిటిడి అధికారులు తొలగించారు. భక్తుల నుండి వీరిపై ఆరోపనలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టిటిడి అధికారులు తెలిపారు. 
అయితే తమను అనవసరంగా తొలగించారని పేర్కొంటూ క్షురకులు తిరుమలలోని జేఈ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. దీనిపై స్పందించిన జేఈ మూడు నెలల్లోపు దీనిపై విచారణ జరిపి, నిర్ణయం తీసుకుంటానని వారికి హామీ ఇచ్చారు.
 

సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఇద్దరు మృతి

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ దగ్గర ఎన్ ఎచ్ 65 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జహీరాబాద్ నుంచి హైదరాబాద్ కు వెళుతున్న తుఫాన్ వాహనాన్ని డిసిఎం వ్యాన్ ఢీ కొని ఇద్దరు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. మృతులు జహీరాబాద్ మండలం శేఖాపూర్ గ్రామానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
 

ఈ నెల 13 న యదావిధిగా తెరుచుకోనున్న పెట్రోల్ బంకులు

ఈనెల 13న పెట్రోల్ బంకుల బంద్ కు పిలుపునిచ్చిన ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్ల అసోషియేషన్ ఈ బంద్ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. వివిద కారణాల దృష్ట్యా బంద్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లు డీలర్స్ అసోసియేషన్ పేర్కొంది. ఈ రద్దు ప్రకటనతో దేశవ్యాప్తంగా 54 వేల పెట్రోల్ బంకులు యథావిధిగా తెరుచుకోనున్నాయి.

సొంత పార్టీ నేతలపైనే విమర్శలకు దిగిన యశ్వంత్ సిన్హా

బీజేపి సినియర్ నేత యశ్వంత్ సిన్హా మరోసారి పార్టీ నేతలపై విమర్శలకు దిగారు. బిజేపి జాతీయ అద్యక్షుడు అమిత్ షా తనయుడు జయ్ షా వచ్చిన అవినీతి ఆరోపణలపై స్పందించిన ఆయన, ఈ ఆరోపణలు పార్టీ నైతికతను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపించారు. ఈ కేసును వాదించడానికి  ప్రభుత్వ న్యాయవాది తుషార్ మెహతాను వాడుకోవడాన్ని తప్పుబట్టారు. జై షాకు విద్యుత్ మంత్రి పియుష్ గోయల్ కు మద్య జరిగిన లావాదేవీలు చూస్తుంటే ఏదో తప్పు జరిగినట్లు, అందులో ప్రభుత్వ పాత్ర ఉన్నట్లు అనుమానం వస్తోందని ఆరోపించారు. ఈ విషయంపై స్పందించి ప్రభుత్వం వెంటనే దర్యాప్తుకు ఆదేశించాలని కోరారు.  
 

ఎస్ఐ ఫలితాలపై స్టే విధించిన హైకోర్టు

ఎస్సై ప్రొవిజనల్ ఫలితాలను విడుదలపై ఉమ్మడి హైకోర్టు స్టే విధించింది. ఎన్సీసి కోటలో నియామకాల్లో అవకతవకలు జరిగాయని పేర్కొంటు సురేష్ అనే అభ్యర్థి కోర్టును ఆశ్రయించాడు. ఇతడి పిటిషన్ ను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం ప్రొవిజినల్ రిజల్ట్స్ విడుదల చేయరాదంటూ తీర్పునిచ్చింది. వచ్చే సోమవారం దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని హోమ్ సెక్రెటరీ కి, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కు ఆదేశాలు జారీ చేసింది.

తిరుమలలో భక్తుల తొక్కిసలాట

తిరుమల శ్రీ వారి దర్శన  క్యూలైన్ లో స్వల్ప తొక్కిసలాట జరిగింది. మహాద్వారం వద్ద ఈ సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే శ్రీ వారి దర్శనం కోసం క్యూలైన్ లో వేచివున్న కొంతమంది భక్తులు కరెంట్ షాక్ కు గురయ్యారు.  దీంతో గందరగోళం చెలరేగి భక్తులు పరుగుతీయడంతో స్వల్పంగా తొక్కిసలాట జరిగింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు కరెంట్ ను నిలిపివేసి, భక్తులను అదుపుచేయడంతో ప్రమాదం తప్పింది.
 

''విశాఖ కు ఐటీ కంపెనీలు రావడానికి సిద్దంగా లేవు" 

విశాఖ పట్నానికి ఐటీ కంపెనీలు రావడానికి సిద్దంగా లేవని, హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాలను వదిలి రావడానికి వారు సంసిద్దంగా లేరని ఎపి ఐటీ శాఖ మంత్రి లోకేష్ తెలిపారు. విశాఖలో ప్రపంచ స్థాయి పాఠశాలలు లేరకపోవడం, సామాజిక పర్యావరణ సిస్టం లేకపోవడం తో ఐటీ కంపెనీలు రావడానికి సంశయిస్తున్నాయని తెలిపారు.ఈ సమస్యలను అధిగమించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, వీటిని మెరుగుపర్చి ఐటీ కంపెనీలు వాటంతట అవే వచ్చేలాగా ప్రయత్నాలు చేస్తున్నామని లోకేష్ హామీ ఇచ్చారు. 
 

కోదండరాం పై విరుచుకుపడ్డ ముత్తిరెడ్డి

జనగామ జిల్లా :  తెలంగాణ ప్రభుత్వం తలపెట్టే ప్రతి పనికి కోదండరాం అడ్డుపడుతున్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆరోపించారు. ఆయన ఈ అలవాటును మార్చకోకుంటే ప్రజలే ఆయనకు బుద్ది చెబుతారని హెచ్చరించారు. కొందరు మాసిపోయినోళ్లు,పాచిపోయినోళ్లను వెంటేసుకుని ఆయనేదో యాత్ర చేస్తుండు, దానివల్ల ఒరిగేదేమి లేదని తీవ్ర విమర్శలు చేశారు.  
జనగామ లో జరిగిన ఆవిర్భావ దినోత్సవం,కలెక్టర్ కార్యాలయ సముదాయ శంఖుస్థాపన కార్యక్రమంలో  పాల్గొన్న ఆయన మాట్లాడుతూ...  కోదండరాం పై  మండిపడ్డారు. మొన్న సిఎం కెసిఆర్ చెప్పినట్లు ఆయన తయారు చేసిన వాళ్లలో కోదండరాం ఒకరు. ఆయనేదో గొప్ప మేధావి అనుకుంటున్నాడని, అది ఆయన అమాయకత్వానికి నిదర్శమని అన్నారు..  ఆయన ఇపుడు వరంగల్ మీద పడి యాత్ర పేరుతో ప్రజలకు అసత్య ప్రచారాలు చేయడానికి పూనుకుంటున్నారని విమర్శించారు.  
 

ప్రమాద ఘటనపై స్పందించిన తలసాని

ఔటర్ పై తన వాహనానికి జరిగిన ప్రమాదం మంత్రి తలసాని స్పందించారు. మేడ్చల్ కలెక్టరేట్ లో జరిగే సభకు ఎంపి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ల తో కలిసి వెళ్తున్న సమయంలో కీసర వద్ద తమ వాహనానికి లారీ ఢీ కొనడంతో స్వల్ప ప్రమాదం జరిగిందని తెలిపారు.అయితే ఈ ప్రమాదంలో తామంతా క్షేమంగానే ఉన్నామని, ఎవరూ ఆందోళన చెందవద్దని మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
 

అమెరికాలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య

అమెరికాలో ఓ తెలంగాణ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉన్నత చదేవుల కోసం అమెరికి వెళ్లిన ముద్దసాని వంశీ రెడ్డి మిచిగాన్ యూనివర్సీటీలో చదువుతున్నాడు. అతడి ఆత్మహత్యకు గల కారణఆలపై అమెరికా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఆత్మహత్యపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.  
 

ఔటర్ పై మంత్రి వాహనానికి యాక్సిడెంట్ (వీడియోలు)

 

మేడ్చల్ జిల్లా  షామీర్ పేట వద్ద మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వాహనం యాక్సిడెంట్ కు గురైంది. ఔటర్ పై ప్రయాణిస్తున్న ఆయన వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ డీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే మంత్రి తలసానికి ఎలాంటి అపాయం జరగలేదు. కానీ స్థానిక ఎమ్మెల్యే మాలిపేది సుధీర్ రెడ్డికి తలకి స్వల్ప గాయాలయ్యాయి.  గాయపడిన ఎమ్మెల్యేను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.   
షామీర్ పేట మండలంలోని అంతయిపల్లి గ్రామంలో నూతన కలెక్టర్ భవనానికి శంకుస్థాపన చేసి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లారీ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ ప్రమాదానికి గల కారణాలపై ధర్యాప్తు చేస్తున్నారు.                        

 మోదీ కోటలో రాహుల్ డ్యాన్స్ ( వీడియో )  

గుజరాత్ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ చేసిన నృత్యం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే గుజరాత్ లోని ఉధయ్ పూర్ జిల్లాలో పటీధార్ వర్గీయుల ఆహ్వానం మేరకు  రాహుల్ ఓ కార్యక్రమానికి హాజరయ్యారు.  ఆయన రాక సందర్భంగా ఏర్పాటుచేసిన సాంప్రదాయ "తిమ్లి'' నృత్యాన్ని చూసిన పరవశించిన రాహుల్ , కొద్దిసేపు వారితో కలిసి స్టెప్పులేశారు. వారితో కలిసి ఆయన చిందేయడంతో సభా స్థలం మారుమోగింది. 
మీరు కూడా ఆ నృత్యాన్ని చూడండి.
 

జగిత్యాల జిల్లాలో ప్రారంభమైన ప్రథమ వార్షికోత్సవ వేడుకలు

జగిత్యాల జిల్లాలో ప్రథమ వార్షికోత్సవ వేడుక కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో బాగంగా జగిత్యాల పట్టణంలో నిర్మించనున్న సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని, జిల్లా పోలీస్ కార్యాలయాలకు మంత్రి ఈటల రాజెందర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ మరియు జిల్లాకు సంభందించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక నాయకులు, ప్రభుత్వాధికారులు పాల్గొన్నారు.

భువనగిరి జిల్లా కలెక్టొరేట్ భవనానికి శంకుస్థాపన 

యాదాద్రి భువనగిరి జిల్లా : భువనగిరి పట్టణ శివారులో నిర్మిస్తున్న కలెక్టోరేట్ భవనానికి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఇవాళ శంకుస్థాపన చేశారు. 12 ఎకరాల సువిశాల స్థలంలో, అన్ని ప్రభుత్వ శాఖలు ఒకేచోట ఉండేలా సమీకృత భవనాన్ని నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా, ఉద్యోగులకు సౌకర్యవంతంగా ఉండేలా ఈ భవనాలను అత్యాధునికంగా నిర్మిస్తున్నట్లు వివరించారు.
 ఈ కార్యక్రమంలో ఎంపి బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, గొంగిడి సునీత, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తో పాటు వివిధ శాఖల అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

మంగళగిరిలో విషాదం

గుంటూరు జిల్లాలోని మంగళగిరి దారుణం జరిగింది. ఆత్మకూరులో గల నిర్మలా ఫార్మసీ కళాశాల లో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు సరదాగా గడపడానికి స్థానికంగా గల చెరువు వద్దకు వెళ్లారు. చెరువులో ఈత కొట్టడానికి దిగి ప్రమాదవశాత్తు మునిగిపోయి ఇద్దరు విద్యార్థులు చనిపోయారు.  విషయం తెలుసుకున్న స్థానికులు చెరువు వద్దకు చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. ఈ విద్యార్థులిద్దరు ఒకే కాలనీకి చెందినవారు కావడంతో ఆ కాలనీలో విషాదచాయలు అలుముకున్నాయి.

మాదాపూర్ లో రోడ్డు ప్రమాదం

 

హైదరాబాద్ : ఇవాళ ఉదయం మాధాపూర్‌ లో రోడ్డు ప్రమాదం జరిగింది.  కొత్తగూడ రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద ప్రధాన రహదారిపై ఓ భారీ ట్రక్కు డీకొనడంతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. భారీ ట్రక్కు కావడంతో చక్రాల కింద నలిగి మృతదేహం నుజ్జునుజ్జయింది.
చనిపోయిన మహిళ యోగా టీచర్ ధనలక్ష్మిగా స్థానికులు గుర్తించారు. మాదాపూర్ లోని బొటానికల్ గార్డెన్ లో యోగా తరగతులకు హాజరై వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసకపత్రికి తరలించారు.
 

click me!