ఏషియానెట్-తెలుగు ఎక్స్ ప్రెస్ న్యూస్

First Published Sep 17, 2017, 11:52 AM IST
Highlights

విశేష వార్తలు

  • ఉస్మానియాలో బతుకమ్మ సంబరాలు
  • యూరోప్ బతుకమ్మ సంబరాల పోస్టర్ లాంచ్
  • పాడి రైతులతో ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమావేశం
  • కొరియా ఓపెన్ సిరీస్ లో తెలుగుతేజం పివి సింధు ఘనవిజయం
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీం ఇండియా 

ఓయూ లో మొదలైన బతుకమ్మ సంబరాలు

ఉద్యమాల పురిటగడ్డ ఉస్మానియా లో బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని కోరుతూ ఆర్ట్స్ కాలేజి వద్ద కొందరు అభ్యుదయ వాద స్త్రీలు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ వేడుకలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం పాల్గొన్నారు.
 

యూరోప్ లో బతుకమ్మ సంబరాలు, పోస్టర్ లాంచ్ చేసిన ఎంపి కవిత

యూరోప్ లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ జాగృతి ఏర్పాట్లు పూర్తి చేసింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదివారం హైదరాబాద్ లో  యూరోప్ లో నిర్వహించనున్న బతుకమ్మ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో  తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శులు  రోహిత్ రావు, మర్పడగ కృష్ణా రెడ్డి, యూత్ కన్వీనర్ కోరబోయిన విజయ్ కుమార్,  జాగృతి పిఆర్వో సంతోష్ , నందికొండ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ కవిత డెన్మార్క్, స్విట్జర్లాండ్, ఐర్లాండ్ దేశాలలోని మహిళ లకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. 
ఈ నెల 23న  డెన్మార్క్ లో ని  కోపెన్ హెగెన్  నగరంలో బతుకమ్మ సంబరాలు జరుగుతాయని కవిత తెలిపారు.  ౩౦ న ఐర్లాండ్ దేశం లోని డబ్లిన్ నగరంలో  ,  అక్టోబర్ 1న స్విట్జర్లాండ్ లో ఎత్ జురిచ్ యూనివర్సిటీ లో   తెలంగాణ జాగృతి బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నదని చెప్పారు. ఈ వేడుకలను తెలంగాణ జాగృతి యూరోప్ అధ్యక్షులు  సంపత్ దన్నంనేని పర్యవేక్షిస్తారని కవిత వివరించారు. స్థానికంగా జాగృతి కార్యకర్తలు బతుకమ్మ పండుగను పెద్దఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు బాగా చేశారని తెలిపారు.

 

కంచె ఐలయ్య ఓ దేశద్రోహి - టీజి వెంకటేశ్

 

సామాజిక అంశాలను సాకుగా చూపి కులాల మద్య చిచ్చుపెట్టే వారిని నడి రోడ్డుపై ఉరి తీయాలని ఎంపి టీజి వెంకటేశ్  అన్నారు. కంచె ఐలయ్య ''కోమటోళ్లు సామాజిక స్మగ్లర్లు'' పేరిట ఆర్యవైశ్యులను కించపరుస్తూ రాసిన పుస్తకంపై ఇవాళ హైదరాబాద్ లో ఆర్యవైశ్య మహాసభ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న వెంకటేశ్ మాట్లాడుతూ... కులాల మద్య చిచ్చు పెడుతూ, శాంతి భద్రతలకు  భంగం కల్గిస్తున్న వారు సామాజిక అభ్యుదయకారులు కారని, పక్కా దేశద్రోహులని విమర్శించారు.  ఐలయ్యపై కేసులు పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని   టీజి వెంకటేశ్ తెలిపారు.    
 

మదర్ డైరీ రైతులకు కూడా 4 రూపాయల ప్రోత్సాహకం

విజయ డైరీ మాదిరిగానే మదర్ డైరీ కి పాలు సరఫరా చేసే రైతులకు కూడా లీటరకు 4 రూపాయల ప్రోత్సాహకం అందజేయనున్నట్లు సీఎం కేసీఆర్  హామీ ఇచ్చారు. రెండు నెలల్లో వారికి కూడా నాలుగు రూపాయల ప్రోత్సాహకం అందేలా చూస్తానని  తెలిపారు. ఇవాళ పాడి రైతు సంఘాలతో ప్రగతి భవన్ లో సమావేశం సంధర్బంగా పై విధంగా హామీ ఇచ్చారు. పాడి రైతులను ఆదుకోడానికి తమ ప్రభుత్వం ఎల్లపుడు ముందుంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు.

ఈ ప్రోత్సాహకం పెంపు పట్ల మదర్ డైరీ పాల ఉత్పత్తిదారుల సంఘం సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇండియా-ఆసీస్ తొలి వన్డే తాజా సమాచారం

నత్తనడకన సాగుతున్న టీమ్ ఇండియా బ్యాటింగ్...

ప్రస్తుతం టీం ఇండియా స్కోరు 11/3 ( 6.2 )
 

బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాజ్ నాథ్ సింగ్

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా నిజామాబాద్ బీజెపి నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొనడానికి కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు తెలంగాణ బిజెపి అద్యక్షుడు లక్ష్మణ్, మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. ఇక్కడ్నుంచి కాసేపట్లో ప్రత్యేక హెలికాప్టర్ లో హోం మంత్రి నిజామాబాద్ చేరుకోనున్నారు.  

చెన్నై వన్డేలో టాస్ గెలిచిన టీం ఇండియా

భారత్ ఆసిస్ ల మద్య జరగనున్న ఐదు వన్డేల సీరిస్ లో భాగంగా ఇవాళ చెన్నైలో మొదటి వన్డే జరగనుంది.ఈ వన్డేలో టీం ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవ‌కాశం ఉండ‌టంతో టాస్ గెలిచిన కెప్టెన్ విరాట్‌ కోహ్లి మ‌రో ఆలోచ‌న లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 

కొరియా ఓపెన్ సిరీస్ లో తెలుగుతేజం పివి సింధు విజయం

కొరియా ఓపెన్ సిరీస్ లో తెలుగుతేజం పివి సింధు ఘన విజయం సాధించింది. ఇవాళ జరిగిన ఫైనల్ లో వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ నొజొమి ఒకుహ‌ర‌పై  తిరుగులేని విజయాన్ని సాధించి టైటిల్ ను కైవసం చేసుకుంది.  హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో జపాన్ క్రీడాకారిణి ఒకుహరా పై 22-20, 11-21, 21-18 తేడాతో సింధు విజయం సాధించింది. వరల్డ్ చాంఫియన్ షిప్ లో తన ఓటమికి కారణమైన ఒకుహరాను ఓడించి ప్రతీకారం తీర్చుకుంది పివి సింధు.

పరిటాల వారి పెళ్లికి ఉపరాష్ట్రపతికి ఆహ్వానం

హైదరాబాద్ : ఆంద్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత కుటుంబ సమేతంగా ఇవాళ  రాజ్ భవన్ లో  ఉప రాష్ట్రపతి  వెంకయ్య నాయుడి ని కలిసారు.  తన కుమారుడు పరిటాల శ్రీరామ్ వివాహానికి రావాల్సిందిగా ఉపరాష్ట్రపతిని ఆహ్వానించారు.ఆమె కుమారులు పరిటాల శ్రీరామ్, సిద్దార్ధ, కుమార్తె  స్నేహలత లతో కలిసి వెంకయ్యకు వివాహ ఆహ్వాన పత్రిక అందించారు.

click me!