ఈ నెలాఖరులో  ఏపీ గ్రూప్ 2 ఫలితాలు

First Published Sep 16, 2017, 11:11 AM IST
Highlights

విశేష వార్తలు

  •  ఈ నెలాఖరులో  ఏపీ గ్రూప్ 2 ఫలితాలు
  • నకిరేకల్ లో దేశవ్యాప్త కిసాన్ ముక్తి యాత్ర లో పాల్గొన్న కోదండరామ్
  • కొరియా ఓపెన్ సూపర్ సిరీస్‌ లో ఫైనల్ కి చేరిన తెలుగుతేజం పివి సింధు 
  • విశాఖపట్నం లో పర్యావరణ ప్రాంతీయ సదస్సును ప్రారంభించిన కేంద్ర మంత్రి హర్షవర్దన్
  • మారేడ్ పల్లి పల్లి రిజిస్ట్రేషన్ ఆఫీసులో స్తంబించిన రిజిస్ట్రేషన్ సేవలు 
  • జమ్మికుంటలో తలకిందులుగా ఎగిరిన జాతీయ జెండా  

ఈ నెలాఖరులో  ఏపీ గ్రూప్ 2 ఫలితాలు 

ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించిన  గ్రూప్ 2 ఫలితాలను ఈ నెలాఖరులోగా  ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్‌ తెలిపారు. ఇవాళ ఆయన విలేకరులతో మాట్లాడుతూ... మొదట గ్రూప్-2, ఆ తర్వాత గ్రూప్-3 ఫలితాలు వెల్లడిస్తామన్నారు. గీతం కాలేజిలో జరిగిన అవకతవకలపై  విచారణ జరుగుతోందని, దోషులను పక్కన పెట్టి మిగతావారి ఫలితాలు ప్రకటిస్తామని వెల్లడించారు.
అలాగే ఆర్థికశాఖ అనుమతి రాగానే కొత్త నోటిఫికేషన్లు జారీ చేస్తామని నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. 
 

సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కృష్ణమూర్తి అకాల మరణం

సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కృష్ణమూర్తి ఇవాళ మరణించారు. హిందూ పత్రికలో సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్ గా పనిచేస్తున్న ఈయన అకాల మరణం పట్ల సహచర జర్నలిస్టులతో పాటు రాజకీయ, సినీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.  మీడియా రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.  
 

వినియోగదారుల హక్కు చట్టంలో మార్పులు తేవాలి - సి.వి ఆనంద్  

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వినియోగదారుల హక్కు చట్టంలో మార్పులు తేవాల్సిన అవసరం ఉందని పౌరసరఫరాల కమిషనర్‌ సి.వి. ఆనంద్‌ అన్నారు. ఈ చట్టం ఏర్సడి ముప్పై సంవత్సరాలు అవుతోందని, అప్పటికీ ఇప్పటికీ  ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయని అన్నారు. అందుకు అనుగుణంగా నేషనల్‌ కన్‌స్యూమర్‌ యాక్ట్‌లో మార్పులు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని ఆనంద్‌ తెలిపారు.
ముఖ్యంగా వినియోగదారుల హక్కులపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, వినియోగదారుల కోర్టుల్లో కేసులను త్వరితగతిన పరిష్కరించాలి. ఇవి జరగాలంటే రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కన్‌స్యూమర్‌ ఫోరమ్‌లలోని ఖాళీలను భర్తీ చేసి వాటి బలోపేతం చేయాలని సి.వి. ఆనంద్‌ సూచించారు.
 

కిసాన్ ముక్తి యాత్రలో పాల్గొన్న కోదండరామ్

అందరి ఆకలి బాధలు తీర్చే  రైతన్నలకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అండగా నిలబడి, వారి సంక్షేమానికి పాటుపడాలని కోరుతూ చేపడుతునన్న దేశవ్యాప్త కిసాన్ ముక్తి యాత్ర నేడు  నల్లగొండ జిల్లా నకిరేకల్ కు చేరుకుంది. ఈ సంధర్బంగా తెలంగాణ జేఏసి చైర్మన్ కోదండరామ్ తో పాటు వ్యవసాయ రంగ సంఘాలు ఈ యాత్రలో పాల్గొన్నాయి. ఈ సంధర్బంగా కోదండరామ్ మాట్లాడుతూ... యాత్ర ముఖ్య లక్ష్యమైన దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగం యొక్క మొత్తం అప్పులు రద్దు చేయాలని అన్నారు. అలాగే అన్ని పంటలకు ఉత్పత్తి ఖర్చులపై 50 శాతం కలిపి గిట్టుబాటు ధర కల్పించాలని  డిమాండ్ చేశారు. 

విశాఖపట్నం లో పర్యావరణ ప్రాంతీయ సదస్సు 

పర్యావరణాన్ని కాపాడాలంటే ప్రజల భాగస్వామ్యంతో సాధ్యమని, అందుకోసం ప్రజల్లో అవగాహన పెంచాలనే ఉద్దేశంతో విశాఖపట్నంలో చేపడుతున్న పర్యావరణ ప్రాంతీయ సదస్సును కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రారంభించారు. ఏపీ,తెలంగాణ కాలుష్య నియంత్రణ శాఖలతో పాటు జాతీయ హరిత ట్రిబ్యునల్ లు సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి. రెండు రోజుల పాటు జరగనున్న సదస్సులో పలువురు పర్యావరణ శాస్త్రవేత్తలు, న్యాయమూర్తులు పాల్గొన్నారు.
 

ఒకే చోట ఐదు మద్యం షాపులా..! 

కడప జిల్లాలో  వైసీపి ఎమ్మెల్యే ఒకరు మద్యం దుకాణాల అనుమతుల్లో అవకతవకలు జరిగాయంటూ   నిరసనకు దిగారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి తన నియోజకవర్గంలోని రామేశ్వరం వద్ద ఒకేచోట ఐదు మద్యం దుకాణాలకు ఎలా అనుమతిస్తారని ఎక్సైజ్ శాఖ అధికారులను ప్రశ్నించారు. అధికార పక్షానికి చెందిన నాయకుల షాపులు కావడంవల్లే అన్నింటికి అనుమతించారని విమర్శించారు.వాటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగిన ఎమ్మెల్యేకు స్థానికులు కూడా మద్దతు పలికారు. 
 

మరో ఇంటర్నేషనల్ సిరీస్ విజయానికి అడుగుదూరంలో పివి సింధు

కొరియా ఓపెన్ సూపర్ సిరీస్‌ లో తెలుగుతేజం పివి సింధు ఫైనల్ కి చేరింది. సెమిపైనల్ లో చైనా క్రీడాకారిణి బింజాయావో పై 21-10, 17-21, 21-16 తేడాతో గెలిచి సిరీస్ కు అడుగు దూరంలో నిలిచింది. మొదటి రౌండ్ ను సునాయాసంగా గెలెచుకున్న సింధు, రెండవ రౌండ్ లో కాస్త తడబడింది. నిర్ణయాత్మక మూడో రౌండ్ లో విజయం సాధించి ఫైనల్ పోరుకు సిధ్దమైంది. ఫైనల్ లో గెలిచి దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేయాలని ఆశిద్దాం.
 

యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంటుకు వంద శాతం నిధులు 
 

యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంటు ఐదో దశ నిర్మాణానికి అవసరమైన రూ.4,009 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అంగీకరించింది. దీంతో 4వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన యాదాద్రి ప్లాంటు నిర్మాణానికి అవసరమైన నిధులు నూటికి నూరు శాతం సమకూరినట్లయింది. ఐదో యూనిట్ నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సాయం అందించడానికి అంగీకరిస్తూ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సిఎండి రాజీవ్ శర్మ విద్యుత్ సౌధలో శుక్రవారం జెన్ కో సిఎండి డి.ప్రభాకర్ రావుకు లేఖను అందించారు. ఇందులో మొదటి నాలుగు యూనిట్ల నిర్మాణానికి అవసరమైన రూ.16,950 కోట్ల ఆర్థిక సాయం అందించడానికి ఆర్.ఇ.సి ముందుకురాగా, తాజాగా ఐదో యూనిట్ కు ఆర్థిక సాయం అందించడానికి  పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ముందుకొచ్చింది.   
యాదాద్రి పవర్ ప్లాంటులోని ఐదో యూనిట్ కు ఆర్థిక  సాయం లభించడం పట్ల జెన్ కో చైర్మన్ ప్రభాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు.  అత్యంత ప్రాధాన్యత కల్గిన ప్లాంటుకు ఇటీవలే పర్యావరణ అనుమతులతో పాటు అన్ని రకాల అనుమతులు వచ్చాయని, ఇప్పుడు నిర్మాణానికి అవసరమైన నిధులు కూడా నూటికి నూరుశాతం సమకూరాయని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన ప్రకారం యాదాద్రి ప్లాంటు నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేస్తామని చెప్పారు.

ఇంటర్ నెట్ లేదు - అందుకే రిజిస్ట్రేషన్ కాదు  
 

గత కొన్ని రోజులుగా  మారేడ్ పల్లి రిజిస్ట్రేషన్ ఆపీసులో రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయాయి. కారణం ఏంటో తెలుసా? ఇంటర్ నెట్ కనెక్షన్ లేకపోవడం. ఇంత చిన్న కారణంతో ఇలా రిజిస్ట్రేషన్  సేవలు స్తంభించడంతో  సిబ్బంది, స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఉన్నతాధికారులకు సమస్య గురించి చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, దీని వల్ల రోజుకు పది లక్షలకు పైగా ఆదాయం దెబ్బతిందని అధికారులు తెలిపారు.

 
 

మంత్రి సాక్షిగా తలక్రిందులుగా ఎగిరిన జాతీయ పతాకం

తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సాక్షిగా కరీంనగర్ లో జాతీయ పతాకానికి అవమానం జరిగింది. వివరాల్లోకి వెళితే జమ్మికుంట పట్టణంలో నిర్వహించిన 5కె రన్ కార్యక్రమాన్ని ఈటల రాజేందర్ ప్రారంభించారు. ఈ సంధర్బంగా స్థానిక గాంధీ చౌక్ వద్ద జాతీయ జెండాను ఈటల రాజెందర్ ఎగరవేసారు. అయితే జెండా తలక్రిందులుగా ఉండటం చూసిన ఆయన వెంటనే జెండాను కిందికి దించి సరిచేసారు. అయితే ఈ తప్పు మంత్రి గన్ మెన్ వల్ల జరిగిందని, అతడు మంత్రికి సాయం చేస్తూ ఒక తాడుకు బదులు మరో తాడు లాగడంతో ఈ తప్పు జరిగిందని అధికారులు చెబుతున్నారు.
 

మహిళల అక్రమ రవాణాను అడ్డుకుందాం

రంగారెడ్డి జిల్లా : మహిళల అక్రమ రవాణా నిరోదించాలని ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రూపొందించిన "స్వరక్ష" పోస్టర్ ను రవాణా మంత్రి మహేందర్ రెడ్డి విడుదల చేశారు. చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ లో పర్యటించిన ఆయన మహిళల అక్రమ రవాణాను నిరోదించడానికి తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని అన్నారు. అందుకోసం ప్రతీ 3 వ శనివారం మహిళల అక్రమ రవాణాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళల అక్రమ రవాణా అరికట్టి  మానవీయ సమాజాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు. 
 ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఎల్ఏ యాదయ్య, ఎంఎల్సీ పట్నం నరేందర్ రెడ్డి తో పాటు అధికారులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. 
 

గ్లోబల్ డైవర్సిటీ అవార్డ్ ను అందుకున్న సల్మాన్ ఖాన్

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్  బ్రిటీష్ పార్లమెంట్ నుంచి గ్లోబల్ డైవర్సిటీ అవార్డ్ 2017 అవార్డును  అందుకున్నారు. భారత సినీ రంగానికి హీరోగా,నిర్మాతగా,గాయకుడిగా,వ్యాఖ్యాతగానే కాకుండా మంచి సామాజిక సేవకుడిగా సేవలందిస్తున్నందుకు ఈ అవార్డున అందిస్తున్నట్లు బ్రిటిష్ పార్లమెంట్ ఆయన్ను కొనియాడింది. ఈ సందర్బంగా తెలుగు సంతతి బ్రిటీష్ ఎంపి కీత్ వాజ్ మాట్లాడుతూ..సినీ నటుడుగానే కాకుండా బీయింగ్ హ్యుమన్ స్వచ్చంద సంస్థను స్థాపించి సల్మాన్ అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నట్లు  ప్రశంసించారు. 
ఈ అవార్డు కార్యక్రమంలో సల్మాన్ మాట్లాడుతూ తాను ఇప్పటివరకు చాలా సినిమా అవార్డులు అందుకున్నానని, కాని వ్యక్తిగత సేవలకు అందుకున్న ఈ అవార్డు తనకెంతో ప్రత్యేకమైనదని తెలిపారు.
 

కాకినాడ మేయర్ గా సుంకర పావని

ఇటీవల కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో విజయాన్ని సొంతం చేసుకున్న అధికార టీడిపి పార్టీ ఇవాళ తమ మేయర్ అభ్యర్థిని ప్రకటించింది. మేయర్ గా సుంకరి పావనిని, డిప్యూటి మేయర్ గా సత్తిబాబు ను నియమిస్తూ టీడిపి కార్పోరెటర్లు నిర్ణయం తీసుకున్నారు.
 

రీజినల్ ఓకేషనల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

 తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు మొదటి రీజినల్ ఓకేషనల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేశారు. రాజధాని హైదరాబాద్ లోని విద్యానగర్ లో నాలుగు ఎకరాల్లో రూ.19.95 కోట్లతో ఆర్ వీటీఐ క్యాంపస్ ను ఏర్పాటుచేస్తున్నారు. ఈ సందర్బంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ... మహిళా సాధికారత కోసం  ఈ  ట్రేనింగ్ సెంటర్ బాగా ఉపయోగపడుతుందని  అన్నారు. దీంట్లో ఫ్యాషన్ డిజైన్ టెక్నాలజీ, ఆర్కిటెక్చరల్ , కాస్మెటాలజీ, పుడ్ అండ్ బేవరేజస్ సర్వీసులో విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు.   వీటిల్లో ఏటా వెయ్యి మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తారు.
ఈ కార్యక్రమంలో  కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ, రాష్త్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

click me!