ఏషియానెట్-తెలుగు ఎక్స్ ప్రెస్ న్యూస్

Published : Aug 12, 2017, 11:26 AM ISTUpdated : Mar 25, 2018, 11:41 PM IST
ఏషియానెట్-తెలుగు ఎక్స్ ప్రెస్ న్యూస్

సారాంశం

నెక్లెస్‌రోడ్డులో బీజేపి ఆధ్వర్యంలో నిర్వహించిన  తిరంగా యాత్ర 100 కోట్ల ఖర్చుతో హైదరాబాద్ పార్కులను  అభివృద్ధి  చేస్తామన్న అటవీ మంత్రి జోగు రామన్న కోదండరాం యాత్రను  ప్రభుత్వం అడ్డుకోవడం దారుణమన్న జీవన్ రెడ్డి ఇక క్రికెట్ వ్యవహారాకు పూర్తిగా దూరంగా ఉంటానన్న లలిత్ మోదీ హైదరాబాద్ లో భారీ వర్షం

కవి సమ్మేళనంలో పాల్గొన్న కల్వకుంట కవిత


జయశంకర్ జయంతి (ఆగస్ట్ 6), కాళోజీ జయంతి (సెప్టెంబర్ 9) లను పురస్కరించుకుని తెలంగాణ జాగృతి రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో 31 చోట్ల కవి సమ్మేళనాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో నేడు నిజామాబాద్ లో నిర్వహించిన తెలంగాణ జాగృతి కవితాంజలి కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు  కల్వకుంట్ల కవిత  పాల్గొన్నారు. ఇప్పటికి 10 జిల్లాలలో జరిగిన కవి సమ్మేళనంలో మొత్తం 650 కవులు పాల్గొన్నారని  కవిత   ప్రకటించారు. ఈ కవి సమ్మేళనంలో పాల్గొన్న ప్రతి కవిని శాలువా, మొమెంటో, ప్రశంసాపత్రంతో సన్మానించారు ఎంపీ కవిత. 

రోడ్డు ప్రమాదంలో ట్రెయినీ ఎస్సై మృతి


రాజేంద్రనగర్ లో హిమాయత్ సాగర్ అవుటర్  రింగ్ రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారు చెట్టుకు  ఢీ కొని యస్ఐ మృతి చెందారు. కార్లొ ఉన్న మరో ఇద్దరీ పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో ఉస్మానియా హస్పిటల్ కి తరలించారు. అప్పాలో ట్రైనింగ్ లో ఉన్న  ఎస్సై సెలవులు రావడంతో ఇంటికి వెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.      

ప్రాజెక్టుల పురోగతిపై మంత్రి హరిష్ రావ్ సమీక్ష

కాళేశ్వరం ప్రాజెక్ట్ లో బాగంగా నిర్మస్తున్న రంగానాయక సాగర్ రిజర్వాయర్ భూసేకరణ ఫై కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో  రాష్ట్ర నీటి పారుదల శాఖామంత్రి హరీష్ రావు సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ పి. వెంకట్రామి రెడ్డి తో పాటు సాగునీటి పారుదల ఇంజినీర్లు , ఆర్డీవోలు, తహసీల్దార్లు, ,స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. 

హుక్కా సెంటర్లపై పోలీసుల ఉక్కుపాదం


హైదరాబాద్ లో హుక్కా కేంద్రాలపై నిషేదం ఉన్నందున వాటి నిర్వహకులపై కఠిన చర్యలు తీసుకుంటాయని సీపి మహేందర్ రెడ్డి తెలిపారు. యువతను మత్తులో చిత్తు చేస్తున్న మాదకద్రవ్యాల పైనే కాదు, హుక్కా ను కూడా నిషేదించినట్లు సీపి వెల్లడించారు. హోటళ్లు, రెస్టారెంట్లు, కాఫీ షాపుల్లో  హుక్కా పంపిణీ చేస్తున్నట్లు, వాటిపై కూడా చర్యలుంటాయని ఆయన తెలిపారు. దీనికి సహకరిస్తున్న పోలీసులను కూడా వదిలిపెట్టమని మహేందర్ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్ లో భారీ వర్షం


 హైదరాబాద్ నగరవాసులు వీకెండ్ వేళ వర్షంలో తడిసి ముద్దవుతున్నారు.సాయంత్రం వేళ అకస్మాత్తుగా మొదలైన వాన ఉగ్రరూపం దాల్చింది.  భారీ వర్షం వల్ల వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు.  ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా  కరెంట్ సరఫరాకు అంతరాయం కలిగింది.

 క్రికెట్ ను పూర్తిగా వదిలేస్తున్నా - లలిత్ మోదీ


ఐపీఎల్‌ మాజీ చీఫ్‌ లలిత్‌ మోడీ క్రికెట్‌కు పూర్తిగా దూరమయ్యారు.ఇప్పటికే అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన లండన్ కు మకాం మార్చిన విషయం తెలిసిందే. అయితే నాగ్‌పూర్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయన ఇవాళ క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు ట్వీట్ చేశాడు.ఇన్నాళ్లు తనకు అండగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు తెలియజేశాడు.

బీజేపీని దెబ్బతీయడానికి సత్యాగ్రహమే అస్త్రం


 సెప్టెంబర్‌ 1న గుజరాత్‌లో  బీజేపికి వ్యతిరేకంగా  సత్యాగ్రహ ర్యాలీన నిర్వహించాలని కాంగ్రెస్‌  పార్టీ భావిస్తోంది.  గిరిజనులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా చేపట్టనున్న ఈ ర్యాలీ కోసం ప్రతిపక్షాల మద్దతు కూడగట్టేందుకు కాంగ్రస్ నాయకత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ఏడాది చివర్లో గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోఈ ర్యాలీ ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. ఈ నిరసనకు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నేతృత్వం వహించనున్నారు.
 

ఉద్యమ ద్రోహులకు పదవులు, ఉద్యమ నేతలకు నిర్భందాలా?

కోదండరాం యాత్రను పోలీసుల చేత ప్రభుత్వం  అడ్డుకోవడం దారుణమని అన్నారు సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి. ఉద్యమ ద్రోహులైన తుమ్మల, తలసాని, మహేందర్ రెడ్డి లాంటివారిని పక్కన చేర్చుకుని,  తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన కోదండరామ్ లాంటి వారిని నిర్భందించడం తగదన్నారు. అలాగే రాష్ట్రంలో దళితుల పై  జరుగుతున్న దాడులపై కూడా ఆయన ద్వజమెత్తారు. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే దళితులను కించపరచడం తగదన్నారు.  నేరేళ్ల ఘటన విచారణ కేటీఆర్ కనుసన్నల్లో జరుగుతోందని, ఇసుక మాఫియాలో అంతా ఆయన కుటుంబ సభ్యులే ఉన్నారని జీవన్ రెడ్డి విమర్శించాడు. 
 

శరత్ యాదవ్ పై చర్యలు షురూ


జనతా దళ్ మాజీ అధ‍్యక్షుడు శరత్ యాదవ్ పై వేటు పడింది.   రాజ్యసభ లో జేడీయు పార్టీ అధికార ప్రతినిధి పదవి నుంచి ఆయన్ని తప్పిస్తూ జేడీయూ ప్రస్తుత అద్యక్షుడు, బీహార్ సీఎం నితీష్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. ఈ స్థానంలో నితీష్ సన్నిహితుడు ఆర్‌సీపీ సింగ్ కు అవకాశం కల్పించాలని రాజ్యసభ స్పీకర్‌ వెంకయ్యనాయుడును కోరింది జేడియు పార్టీ.
 

అగ్రిగోల్డ్ బాధితుల చైతన్య యాత్ర చేపడతాం

ఏపీ ప్రభుత్వం తమకు న్యాయం చేయకపోగా, అన్యాయం చేసిన వారికి కొమ్ముకాస్తోందని అగ్రిగోల్డ్ భాదితులు ఆవేదన చెందారు, అందుకు నిరసనగా ఈ నెల 16 నుంచి నెల రోజుల పాటు అగ్రిగోల్డ్ బాధితుల చైతన్య యాత్ర  చేపట్టనున్నట్లు అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ తెలిపింది. ఈ విషయంలో ఆత్మహత్యలు జరుగుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని వారు చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించారు.అగ్రిగోల్డ్ సమస్య  పరిష్కారం కోసం శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు  చైతన్య యాత్ర   సాగనుందని తెలిపారు. 
 

గ్రంథాలయ ఉద్యోగులకు అండగా ఉంటాం - కడియం


గ్రంథాలయాల ఉద్యోగులకు 010 పద్దుకింద వేతనాలివ్వాలన్న ప్రతిపాదనలు ఇప్పటికే సిఎంకు పంపించామని, ఆయన ఆమోదించగానే 010 పద్దు కిందే వారికి  జీతభత్యాలు అందిస్తామని ఉద్యోగులకు కడియం హామీ ఇచ్చారు. రంగరాజన్ 125వ జయంతి సందర్భంగా లైబ్రేరియన్ డే  జరుపుకుంటున్న గ్రంథాలయాల ఉద్యోగులు, అధికారులు, పాఠకులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. టెక్నాలజీ పెరగడం వల్ల పుస్తకాలకు  ప్రాధాన్యత తగ్గిందన్నారు. పుస్తకాలకు వేరే ప్రత్యామ్నాయం లేదు..వాటికి నెలవైన గ్రంథాలయాలను పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ ఉద్యోగులకు ప్రోత్సాహకాలు


రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది. 2016-17 సంవత్సరానికి వివిధ విబాగాల్లో అత్యుత్తమ పనితీరు కనబర్చిన ఉద్యోగులకు సాదారణ పరిపాలన శాఖ తరపున మెడల్స్ అందుకోనున్నారు. ఇప్పటికే దరఖాస్తుల పరిశీలన ముగిసి 12 మందిని ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు.   గ్రూప్ 1,2,3,మరియు 4 స్థాయి అదికారులను మూడు కేటగిరీలుగా విడదీసి   మెడల్స్ అందించనున్నట్లు పరిపాలన శాఖ అదికారులు తెలిపారు.
 

మహావీర్ హరిణి వనస్థలిని సందర్శించిన అటవీ మంత్రి జోగు రామన్న

 

హైదరాబాద్ : వనస్థలిపురంలోని మహావీర్ హరిణి వనస్థలిని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న సందర్శించారు. హైదరాబాద్ చుట్టూ పచ్చదనాన్ని పెంచి, అటవీ బ్లాక్ లను మరింత అభివృద్ధి చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే ఇలా పార్కు ల్లో పర్యటిస్తున్నామన్నారు మంత్రి. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏల సమన్వయం తో, రూ. 100 కోట్లు ఖర్చు పెట్టి   పార్క్ లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోందని అటవీ మంత్రి తెలిపారు. ఈ పర్యటనలో మంత్రిలో పాటు  మేయర్ బొంతు రామ్మోహన్,  జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.
 

జగన్ కుటుంబం మొత్తానిది నేర చరిత్రే - పార్థసారధి


ప్రతిపక్ష నాయకుడు జగన్‌ చిల్లర వ్యక్తి అని. అతడో 420 అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారధి మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు పై జగన్‌ చేసిన వ్యాఖ్యలను పార్థసారధి ఖండించారు .జగన్‌ కుటుంబం నేర చరిత్రతోనే రాజకీయాల్లోకి వచ్చిందని, వాళ్ల తాత నరసయ్య అనే వ్యక్తిని చంపి గనులు స్వాధీనం చేసుకున్నారని బీకే వ్యాఖ్యానించారు. తండ్రి రాజశేఖర్‌రెడ్డి స్వయంగా అప్పటి ప్రధాని పీవీ నరసింహారావుపైనే చెప్పులు వేయించారన్నారు.

నంద్యాలలో అరాచకత్వానికి.. అభివృద్ధికి మద్యే పోటి - దేవినేని 


నంద్యాలలో అరాచకత్వానికి.. అభివృద్ధికి మధ్య పోటీ జరుగుతోందని ఏపీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. రాష్ట్రానికి అసమర్థ ప్రతిపక్ష నాయకుడు ఉండటం శోచనీయమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్‌ చేసిన వ్యాఖ్యలను ఎన్నికల సంఘం సుమోటోగా తీసుకోవాలని కోరారు.  

అధికార పార్టీ ఎమ్మెల్యేకు యావజ్జీవ కారాగారం


 గుజరాత్‌: పదమూడేళ్ల నాటి హత్య కేసులో గుజరాత్‌కు చెందిన భీజేపి ఎమ్మెల్యేకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. 2004 ఫిబ్రవరిలో గుజరాత్‌కు చెందిన నీలేశ్‌ రయానీ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో సౌరాష్ట్రలోని గోండల్‌ ఎమ్మెల్యే జయరాజ్‌సిన్హ్‌ జడేజా సహా 14 మందిపై హత్య కేసులు నమోదయ్యాయి.


 నూజివీడు టీడిపిలో వర్గ విభేదాలు


 నూజివీడు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ (ఏఎంసీ) పదవి ఎట్టకేలకు ఎంపీ మాగంటిబాబు వర్గానికి చెందిన రావి చర్ల సర్పంచ్‌ కాపా శ్రీనివాసరావుకు ఖరారు చేయడంతో నూజివీడులో తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మొద‌టి నుంచి పార్టీ న‌మ్ముకున్న వారికి కాకుండా పార్టీ కార్యాల‌యంలో వంక కూడా చూడ‌ని నేత‌కు ప‌ద‌వి ఇవ్వ‌డం ప‌ట్ల ముద్దరబోయిన వర్గం బాహాటంగానే విమ‌ర్శించింది. మాగంటి బాబుపై తీవ్ర స్తాయిలో మండిప‌డింది..
 

త్రివర్ణ శోభితమైన నెక్లెస్ రోడ్

హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో బీజేపి ఆధ్వర్యంలో శనివారం ఉదయం తిరంగా యాత్ర నిర్వహించారు. జాతీయ పతాకాలను ప్రదర్శిస్తూ నిర్వహించిన ఈ ర్యాలీలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ.. భాజపా తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్‌.. పలువురు భాజపా నేతలు పాల్గొన్నారు.

  
వరుస సెలవులతో  సొంతూరి బాట పట్టిన నగరవాసి

హైదరాబాద్‌ నలువైపుల ఉన్న టోల్‌గేట్ల వద్ద వాహనాల రద్దీ అధికంగా ఉంది. వరసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో హైదరాబాద్‌ నుంచి ప్రజలు సొంత వూర్లకు వెళ్తుండటంతో వాహనాల సంఖ్య పెరిగింది.
 

తెలంగాణలో హరితమిత్ర అవార్డుల ప్రకటన


తెలంగాణకు హరితహారంలో భాగంగా హరిత మిత్ర అవార్డులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. పచ్చదనం పెంపు కోసం పాటుపడిన ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థ లకు  హరిత మిత్ర అవార్డులు అందించనుంది. ఉత్తమ ప్రదర్శన కనబర్చిన వ్యక్తులకు, సంస్థలకు  స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఈ అవార్డులను ప్రధానం చేయనున్నారు.

సిద్దిపేటలో అభివృద్దిని పరుగులుపెట్టిస్తా - మంత్రి హరిష్

 సిద్ధిపేట పట్టణంలో రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు పటు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు.మొదటగా పట్టణంలో రూ.51 లక్షల  అంఛనా వ్యయంతో నిర్మించనున్న సిద్దిపేట  వ్యవసాయ సహకార సంఘం నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత  డివైడర్ లపై ఏర్పాటు చేస్తున్నఐరన్ విద్యుత్ స్థంభం పనులు పరిశీలించారు. ప్రయాణికులకు, వాహన దారులకు ఇబ్బందులు రాకుండా నిర్మాణం చేపట్టాలని కాంట్రాక్టరుకు పలు సూచనలు చేశారు.                        
 

యాత్ర  వద్దంటే మీటింగ్ జరుపుతాం - కోదండరామ్

తార్నాకలో కోదండరాం నివాసంలో ఇవాళ టీ జేఏసీ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం  జేఏసీ నేతలతో కలిసి విలేకరుల సమావేశం లో మాట్లాడిన ప్రొఫెసర్ కోదండరాం... ఈ రోజు తలపెట్టిన అమరుల స్ఫూర్తి యాత్ర కు నిజామాబాదు sp అనుమతి ఇవ్వలేదని తెలిపారు. అందుకే యాత్ర కాకుండా నిజామాబాద్ హాల్లో మీటింగ్  జరుపనున్నట్లు ఆయన తెలిపారు. దీనికి పోలీసుల అనుమతి అవసరం లేదని, అయినా వారికి సమాచారం అందించామన్నారు. నిజామాబాదు జిల్లా అబివృద్ది, సమస్యలు, ప్రజా చైతన్యమే ఎజెండాగా ఈ మీటింగ్ ను ఏర్పాటుజేసినట్లు కోదండరామ్ తెలిపారు.
 

భద్రాచలం పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్ట్ దేవయ్య

 
భద్రాద్రి కొత్తగూడెం : మణుగూరు ఏరియా మావోయిస్టు దళ కమాండర్ సోడి దేమయ్య భద్రాచలం పోలీసుల ఎదుట లొంపోయాడు. ఇతడు ఖమ్మం జిల్లా చర్ల మండలం రాళ్లగూడెం కి చెందినవాడు. దేవయ్య సాధారణ మావోయిస్టుగా నక్సల్స్ లో చేరి దళ కమాండర్ గా ఎదిగాడు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు పోలీస్ లకు లొంగిపోతున్నట్లు దేవయ్య తెలిపాడు.   

స్కూలు బస్సు ఢీకొని చిన్నారి మృతి

రంగారెడ్డి :  రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని హనుమాన్ నగర్ కాలనీలో ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొని రెండేళ్ళ పాప మృతి చెందింది.  విద్యార్థులను తీసుకెళ్ళేందుకు కాలనీలోకి వచ్చిన బస్సు అక్కడే ఆడుకుంటున్న పాపను డీ కొట్టింది. చనిపోయిన పాప ఎల్లప్ప, అంజలి దంపతుల కూతురు మానస గా పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొననున్న ట్రంప్ కూతురు ఇవాంక  
 

హైదరాబాద్‌లో నవంబర్ 28 నుంచి జరగనున్న అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సుకు అమెరికా ప్రతినిధుల బృందానికి ఇవాంక నేతృత్వం వహిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అమెరికా పారిశ్రామికవేత్తల తరపున తన కూతురు ఇవాంక ప్రాతినిద్యం వహించడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్నమహిళా పారిశ్రామికవేత్తల ప్రాతినిద్యానికి  సంకేతంగా ఉంటుందని  ఆయన వ్యాఖ్యానించారు.    

అమిత్ షా ఏపీ పర్యటన ఖరారు

భీమవరం :  బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈ నెల 28, 29, 30 తేదీల్లో  ఏపీలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో బీజేపీ పటిష్ఠతకు ఈ పర్యటన ఎంతగానో ఉపయోగపడుతుందని బీజేపి నాయకులు తెలిపారు. విజయవాడలో అమిత్‌షాకు ఘనస్వాగతం పలికే ఏర్పాట్లు చేస్తున్నామని బీజేపీ సమన్వయకర్త పురిఘళ్ళ రఘురామ్‌ చెప్పారు.రాష్ట్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఎంతగానో కృషి చేస్తున్నారని  పురిఘళ్ళ తెలిపారు.  

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)