ఏషియానెట్-తెలుగు ఎక్స్ ప్రెస్ న్యూస్

First Published Aug 11, 2017, 11:21 AM IST
Highlights
  • కోదండరామ్ ని హైదరాబాద్ కి తరలిస్తున్న పోలీసులు
  • డిజిపితో ముగిసిన అఖిలపక్ష నేతల భేటీ
  • రాచకొండ యూనిట్ యూనిఫామ్ లోగోను ఆవిష్కరించిన  కమిషనర్ మహేష్ భగవత్
  •  ప్రతి మదర్సాలోను స్వాతంత్య్ర దినోత్సవం రోజున జాతీయ గీతాన్ని ఆలపించాలని ఆదేశాలు జారీ చేసిన యూపి సీఎం 

అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం 

విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులపై సీరియస్ అయ్యారు. ఉచిత ఇసుక ఇస్తున్నా ప్రజల్లో సంతృప్తి లేకపోవడంతో అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. ఇవాళ ఇసుక ధరలను ప్రభుత్వం ప్రకటించింది. ఇసుక రీచ్‌ల నుంచి లారీ, ట్రాక్టర్లకు ఎంత తీసుకోవాలన్నదానిపై కమిటీలు నిర్ణయించాయి. కలెక్టర్‌ ఆధ్వర్యంలో నలుగురు సభ్యులతో కమిటీ నియమించడం జరిగింది. అధిక ధరలకు ఇసుక అమ్మితే కఠినచర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.

అమరవీరుల యాత్రను కొనసాగించి తీరతా - కోదండరామ్

తాటాకు చప్పుళ్లకు బయపడి తాను ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని జేఏసి చైర్మన్ కోదండరామ్ అన్నారు.   రేపు ఉద‌యం 9 గంట‌లకు  హైద‌రాబాద్ నుంచే త‌మ‌ యాత్ర ప్రారంభమ‌వుతుంద‌ని   తెలిపారు. పోలీసులు, ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా యాత్రను మాత్రం ఆపనని స్పష్టం చేశారు. అధికారాన్ని ఉపయోగించాల్సింది  కాంట్రాక్టుల‌ు పొందడానికి కాదని, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తీర్చ‌డానికని పరోక్షంగా కేసీఆర్ ను విమర్శించారు. జేఏసి అంబేద్క‌ర్‌, గాంధీ చూపిన  శాంతి బాట‌లో ఉద్యమం చేస్తోందని తెలిపారు . కేసీఆర్ పిలుపు మేరకే టీఆరెస్ కార్యకర్తలు తనను అడ్డుకున్నారని కోదండరామ్ అన్నారు.

భారీగా పెరిగిన టీఎస్ పిఎస్సీ సభ్యుల జీతాలు


తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్ మరియు సభ్యుల జీతాలు భారీగా పెరిగాయి. చైర్మన్ జీతాన్ని రూ.80 వేల నుంచి రూ.2.25 లక్షలకు, సభ్యుల జీతాలను రూ.79 వేల నుంచి రూ.2.24లక్షలకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన జీతాలు 2016 జనవరి నుంచి  అమల్లోకి వస్తున్నందున, బకాయిలను త్వరలో అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. 
 

యూపీ సీఎం మరో సంచలన నిర్ణయం

  యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాతంత్య్ర దినోత్సవంపై  సంచనల నిర్ణయం  తీసుకున్నారు. ఉత్తర ప్రదేశ్ లోని ప్రతి మదర్సాలోను స్వాతంత్య్ర దినోత్సవం సంధర్బంగా జాతీయ గీతాన్ని ఆలపించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలో ఉన్నసుమారు 8,000 మదరసాలు ప్రభుత్వ ఆదేశాలను  పాటించాలని ఆదేశించారు.సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించాలని, వాటిని పోటోలుగాని, విడియోలుగాని తీసి భద్రపర్చాలని ఆదేశించారు.

నా నిర్ణయం సరైనదే - బీహార్ సీఎం నితీష్

జేడీయూ బీజేపితో పొత్తుపెట్టుకోవడం పట్ల అసంతృప్తిగా ఉన్న శరత్ యాదవ్ పై బిహార్ సీఎం నితీష్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయనకు పూర్తి స్వేచ్చ ఉందని, తన అభిప్రాయాలను ఆయనపై రుద్దడంలేదని నితిష్ అన్నారు. శరత్ యాదవ్ కు ఏ మార్గాన్నయినా ఎంచుకునే స్వేచ్చ ఉందన్నారు.   తాను పార్టీలో మెజారిటి నాయకుల నిర్ణయం ప్రకారమే నడుచుకున్నట్లు జేడీయూ అధినేత నితీష్ తెలిపారు. శరద్‌ యాదవ్‌ సొంత పార్టీ ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో బీహార్ సీఎం వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. 
 

రాచకొండ కమీషనరేట్ యూనిట్ లోగో ఆవిష్కరణ 


రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఈ రోజు గచ్చిబౌలి లో కమిషనరేట్ లో రాచకొండ యూనిట్ యూనిఫామ్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా లోగోలను అడిషనల్ డీసీపీ, ఏసీపీ లకు సీపీ అలంకరించారు. ఈ సందర్బంగా సిబ్బంది అందరికి ఈ లోగోను అందించారు. 15 ఆగస్ట్ నుండి విధిగా ఈ లోగోను అందరూ ధరించాలని ఆయన ఆదేశించారు.
 

నిస్పక్షపాత విచారణ జరిపించండి డిజీపి గారు - అఖిలపక్షం నేతలు

నేరెళ్ల ఘటనలో పోలీసుల విచారణ నిస్పక్షపాతంగా సాగడంలేదని ఆరోపిస్తు అఖిల పక్ష నేతలు డీజీపీకి విన్నవించారు. డీజీపితో సమావేశం అనంతరం  అఖిల పక్షం నేతలు మీడియాతో మాట్లాడారు. సిరిసిల్ల ఎస్పీ విశ్వజిత్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరినట్లు  కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క  తెలిపారు.  ఘటన జరిగి 40 రోజులు  గడుస్తున్న పోలీసులు పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, దారుణంగా కొట్టిన sp ని వెంటనేబసస్పెండ్ చేయాలని డీజీపిని కోరినట్లు సిపిఐ నేత చాడా వెంకట్ రెడ్డి తెలిపారు. రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గకుండా పోలీసులపై చర్యలు తీసుకోవాలని తెలిసినట్లు రేవంత్ రెడ్డి అన్నారు.  
 

వరంగల్ జిల్లాలో  గంజాయి పట్టివేత 

వరంగల్ : వరంగల్ జిల్లా వ్యాప్తంగా నార్కోటిక్ పోలీసులు జరిపిన దాడుల్లో దాదాపు 100 కిలోల గంజాయి పట్టుబడింది. అనుమానితుల ఇళ్లను సోదా చేయగా ఇంత మొత్తంలో పట్టుబడినట్లు పోలీసులు తెలుపుతున్నారు. న‌ర్సంపేట‌, నెక్కొండ‌, శాయంపేట మండ‌లాల్లో జరిగిన ఈ  దాడుల్లో ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. జిల్లాలో మాదక ద్రవ్యాల నివారణకోసం ఆ దాడులకు పాల్పడినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలుపుతున్నారు. 
 

క్రీడా విశ్వవిద్యాలయానికి తొలి అడుగు


మణిపూర్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటుచేయనున్న క్రీడా విశ్వవిద్యాలయ పనులను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది.  దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటుచేయనున్న క్రీడా విశ్వవిద్యాలయానికి సంభందించిన బిల్లును లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. క్రీడాకారులకు అత్యుత్తమైన శిక్షణ అందించడానికి  ఈ విశ్వవిద్యాలయం  తోడ్పడుతుందని క్రీడా శాఖ మంత్రి విజయ్‌ గోయల్‌ తెలిపారు.

కాకినాడలో ముగిసిన నామినేషన్ల పర్వం


 కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మొత్తంగా 493 నామినేషన్లు దాఖలయినట్లు అధికారులు తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో వాటిని పరిశీలించే పనుల్లో పడ్డింది ఎన్నికల కమీషన్. ఓ వైపు నామినేషన్ల ప్రక్రియ ముగిసి, ఎన్నికలు దగ్గర పడుతున్నప్పటికి బీజేపి, టీడీపిల మద్య సీట్ల సర్ధుబాటులో ఏకాభిప్రాయం కుదరడం లేదు.  
 

రేపటి నుంచి మెడికల్ వెబ్ కౌన్సెలింగ్

   
జాతీయ వైద్య విధాన మండలి ఆదేశాల ప్రకారం తెలంగాణలోని ఏ కేటగిరి  మెడికల్ సీట్లకు  ఈ నెల 18లోపు కౌన్సెలింగ్‌ పూర్తి చేయాల్సి వుంది. కావున ఈ నెల 12 వ తేదీ నుంచి  ప్రభుత్వ, ప్రైవేటు, మైనారిటీ కాలేజీల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో ఏ కేటగిరీ సీట్లకు  రెండవ దశ వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ మొదలుకానుంది.  ఆగస్టు 14తో  ఈ ప్రక్రియ ముగుస్తుందని  కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం  తెలిపింది.
 

కోదండరామ్ ను హైదరాబాద్ కి తరలిస్తున్న పోలీసులు

నిజామాబాద్ లో అమరవీరుల యాత్ర ను అడ్డుకుని, జేఏసీ చైర్మన్ కోదండరామ్ ను అరెస్టు చేసిన పోలీసులు ఆయన్ని హైదరాబాద్ కి తరలిస్తున్నారు. యాత్రకు పర్మిషన్ లేదన్న పోలీసుల వాదనను తోసిపుచ్చిన ఆయన, సాయంత్రం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మిగతా విషయాలు విల్లడిస్తానన్నారు.
 

హజ్ యాత్రకు ఏర్పాట్లు షురూ


శంషాబాద్  ఎయిర్ పోర్ట్ లోని హజ్ టెర్మినల్ ను ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ పరిశీలించారు.  హజ్ యాత్రికుల కోసం జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. హజ్ కు వెళ్లే ప్రయాణికులకు ప్రభుత్వం తరపున పూర్తి సహాయం అందిస్తామని ఆయన తెలిపారు. హజ్ కమిటీ కూడా  ప్రయాణికుల భద్రతపై విమానాశ్రయ అధికారులకు తడు సూచనలు చేసింది.  
 

నేరెళ్లలో దీక్ష చేపడతానంటున్న వీహెచ్

సీఎం కెసిఆర్ అహంకార మాటలు మానుకుని, దళితులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ నేత వి హన్మంతరావు అన్నారు. ఈ నెల 30లోపు ఎస్పీ పై చర్యలు తీసుకోవాలని, లేదంటే నేరెళ్లలో దీక్ష చేపడతానని అల్టిమెటం జారీ చేశారు. థర్డ్ డిగ్రీ కి కారణమయిన ఎస్పీని సస్పెండ్ చేసినపుడే బాధితులకి న్యాయం జరుగుతుందన్నారు. పెద్దపులి ఎస్పీ ని వదిలి జింకపిల్ల లాంటి ఎస్సై పై వేటు వేయడం సిగ్గుచేటని ఆయన ప్రభుత్వాన్ని, పోలీసు శాఖను నిందించారు.
 కాంగ్రెస్ నేతలను టూరిస్టులుగా పేర్కొంటున్న కేటీఆరే,  లండన్ నుంచి వచ్చిన నిజమైన టూరిస్టని ఎద్దేవా చేశారు వీహెచ్. కేటీఆర్ పై ఎస్సి,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఇప్పటి వరకు మరణానికి కారణమయిన లారీ డ్రైవర్,ఓనర్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 
 

వినాయక చవితి ఉత్సవాలపై నాయిని సమీక్షా సమావేశం

 


 తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సచివాలయంలో సి బ్లాక్ లో జరిగిన ఈ సమావేశంలో వినాయక చవితి ఉత్సవాలకు పోలీసులు అనుసరించాల్సిన విధానాలపై ఆయన పలు సూచనలు చేశారు.శాంతి భద్రతలకు విగాతం రాకుండా చూడాలని ఆయన అధికారులకు సూచించారు.

వరంగల్ లో బస్సు ప్రమాదం

వరంగల్ రూరల్: వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో ఆర్టీసి బస్సు అదుపుతప్పి ప్రమాదం జరిగింది. నర్సంపేట డిపోకు చెందిన బస్సు వేగంగా పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు కానీ, పలువురి ప్రయాణికులకు గాయాలయ్యాయి

ఆనంద్ అభిమానులు ఆనందించే గెలుపు 


ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌ కు దూరమైన  విశ్వనాథ్‌ ఆనంద్ చాలా రోజుల తర్వాత అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. అమెరికాలో జరుగుతున్న సింక్‌ఫీల్డ్‌ కప్‌ చెస్‌ టోర్నమెంట్లో ఆనంద్ ఈ ఘనత సాధించాడు. రష్యా ఆటగాడు ఇయాన్‌ నెపోనియాచి పై గెలిచి 4.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ప్రస్తుతం ప్రపంచ ఛాంపియన్‌ గా ఉన్న కార్ల్‌సన్‌ 4 పాయింట్లతో రెండో స్థానంలో  ఉన్నాడు.
 

డ్రగ్స్ కేసులో సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది


డ్రగ్స్ కేసులో జరుగుతున్న తదుపరి విచారణపై అకున్ సబర్వాల్ మాట్లాడారు.  డ్రగ్స్ కేస్ లొ గ్లామర్ పార్ట్ విచారణ  ముగిసిందని, ఇక సిని వర్గాలపై విచారణ ఉండదన్నారు.  రెండవ విడత విచారణ సెప్టెంబర్ లో మొదలు పెడతామని, దాంట్లో పలువురిని విచారించనున్నట్లు అకున్ తెలిపారు. కొంత మంది సినీ ప్రముఖులు, ఇతరుల నుంచి సేకరించిన సాంపుల్స్  రిపోర్టు వచ్చాక, చార్జిషీట్లు దాఖలు చేస్తామని అకున్ సబర్వాల్ తెలిపారు..
 

జాతీయ రహదారుల అభివృద్దిని సమీక్షించిన తుమ్మల

 


మ్మం-సూర్యాపేట  మరియు ఖమ్మం- అశ్వరావుపేట జాతీయ రహదారి పై మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఈరోజు ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించారు. ఈ రహదారులకు సంభందించిన ఎలైన్మెంటును ఖరారు చేశారు. భూసేకరణకు షెడ్యూల్ సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. సెప్టెంబర్ కల్లా టెండర్లు పూర్తిచేసి పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ సమీక్షలో  సింగరేణి అధికారులు, జాతీయ రహదారుల అభివృధి సంస్థ అధికారులు  పాల్గొన్నారు.
 

కారంపూడిలో కంచాల మోత

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్బనాభం కారంపూడిలోని తన నివాసంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా     కంచాలు మోత కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రబాబు నాయుడు కాపు ఉద్యమాన్ని పోలీసులతో అణచివేయిస్తూ, కాపు వ్యతిరేకిగా మారిపోయారన్నారు ముద్రగడ. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కంచాల మోత కార్యక్రమాన్ని చేపట్టారు.

ముత్తూట్ దోపిడి కేసులో పురోగతి


హైదరాబాద్: మైలార్ దేవురపల్లిలో జరిగిన ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ కేసులో ప్రధాన నిందితుడు మొహమ్మద్ షరీఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్దనుంచి ఒక తుపాకీ తో పాటు, 15 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురు నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసారు. ఇంకా పరారీలో ఉన్న రాజేష్, ఫారూఖ్, షేర్ఖాన్ ల కోసం పోలీసులు ముమ్మరంగా వేట సాగిస్తున్నారు.
 

మాట నిలబెట్టుకున్న మంత్రి హరిష్

హైదరాబాద్ చాదర్గాట్ లోని న్యూ లైఫ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్రికెటర్ కమురోద్దీన్ ను మంత్రి హరీష్ రావు  పరామర్శించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన కమురోద్దీన్ కుటుంబసభ్యులకు జహీరాబాద్ పర్యటనలో హరీష్ ఆదుకుంటానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అలా ఇచ్చిన మాట నిలబెట్టుకోడానికి యువ క్రీడాకారుడి చికిత్స కోసం   2,50,000 ఆర్థిక సాయాన్ని ఆసుపత్రిలో కుటుంబ సభ్యులకు అందజేశారు. మంత్రి వెంట మెదక్ ఎం.పి.ప్రభాకరరెడ్డి , ఎం.ఎల్.సి.ఫరీదుద్దీన్ లు కూడా ఉన్నారు.
 

ప్రతిపక్ష నేతపై ఆర్థికమంత్రి ఆగ్రహం 


అమరావతి: ఆంద్రప్రదేశ్ ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పదవి దక్కదనే అక్కసుతో జగన్మోహన రెడ్డి ఉన్మాదిగా మాట్లాడుతున్నాడని అన్నారు. ఉన్మాదం తారాస్థాయికి చేరిందని, అందుకే రాష్ట్రానికి, ప్రజలకు కీడు చేసేందుకు కూడా జగన్ వెనుకాడడం లేదని యనమల తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు.
 

చిత్తూరులో భారీ అగ్నిప్రమాదం

చిత్తూరు పట్టణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.  అపూర్వ టెక్స్‌టైల్స్‌లో చెలరేగిన మంటలు భారీ ఆస్తి నష్టాన్ని కల్గించాయి.ఈ ప్రమాదంలో ప్రాణనష్టమేమి సంభవించలేదు. మంటలు ఆర్పడానికి 8  ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.  భవనం మొత్తానికి మంటలు వ్యాపించడంతో అదుపుచేయడం కష్టంగా ఉందంటున్నారు అగ్నిమాపక సిబ్బంది.  
 

అమరవీరుల స్ఫూర్తియాత్ర పై నెలకొన్న ఉద్రిక్తత

 

మెదక్ జిల్లా సరిహద్దులోని బిక్కనూరువద్ద కోదండరాం యాత్రను అడ్డుకోడానికి టిఆర్ఎస్ నేతలు రోడ్డుపై బైటాయించారు. నిజామాబాద్ జిల్లాలో కోదండరాం పాదయాత్ర ఆపాలంటూ నినాదాలు చేస్తున్నారు. అయితే అమరవీరుల స్ఫూర్తి యాత్రను కొనసాగించి తీరతామని టి జెఏసి నేతలు కూడా అక్కడకు చేరుకున్నారు.దీంతో వారిమద్య వాగ్వివాదం,తోపులాట జరిగింది. దీంతో అక్కడ భారీగా పోలీసులను మొహరించారు.
 

భారత ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన వెంకయ్య నాయుడు

భారతదేశ 13వ ఉపరాష్ట్రపతిగా తెలుగువాడైన ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లోని దర్బార్ హాల్ లో వెంకయ్య నాయుడు చేత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు. మొదట మహాత్మాగాంధీ, సర్ధార్ వల్లభాయ్ పటేల్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ విగ్రహాలకు వెంకయ్య నివాళులర్పించారు. తర్వాత దర్బారు హాలుకు చేరుకున్న ఆయన అట్టహాసంగా జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమానికి పాల్గొన్నారు. ఈ ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ,   స్పీకర్ సుమిత్రా మహాజన్, ఎల్ కే అద్వానీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లతో పాటు వివిధ రాష్ట్రాల  ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.  
 

click me!