తెలంగాణ జిల్లాల టీడీపీ అధ్యక్షులు వీరే

Published : Aug 31, 2017, 10:30 AM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
తెలంగాణ జిల్లాల టీడీపీ అధ్యక్షులు వీరే

సారాంశం

నేటి విశేష వార్తలు పిఎస్ఎల్ వి సి.39 ప్రయోగం విఫలం భారీ స్కోరు సాధించిన టిం ఇండియా తమిళనాడు రాజకీయాపై స్పందించిన కమల్ హాసన్ మరో వివాదంలో అర్జున్ రెడ్డి సినిమా బుట్టో హత్య కేసులో ముషారఫ్ ను దోషిగా తేల్చిన కోర్టు   వినాయక నిమజ్జనానికి 25 ప్ర‌త్యేక కొల‌నుల ఏర్పాటు

తెలంగాణ జిల్లాల టీడీపీ అధ్యక్షులు వీరే

చంద్రబాబుతో ముగిసిన టీటీడీపీ నేతల భేటీ

తెలంగాణలోని 25 జిల్లా అధ్యక్షుల పేర్లు ఖరారు.

పెండింగులో 6 జిల్లా అధ్యక్షుల పేర్లు.

01. నిర్మల్- వేలం శ్యాం సుందర్ (మాదిగ)

02. ఆదిలాబాద్- సోయం బాపూరావు (ఎస్టీ-గొండు)

03. మంచిర్యాల- బోడ జనార్దన్ (మాల)

04. ఆసిఫాబాద్- గుళ్లపల్లి ఆనంద్ (పద్మశాలి)

05. నిజామాబాద్- అరికెల నర్సారెడ్డి (రెడ్డి)

06. కామారెడ్డి- సుభాష్ రెడ్డి (రెడ్డి)

07. పెద్దపల్లి- విజయ రమణరావు (వెలమ)

08. కరీంనగర్- కవ్వంపల్లి సత్యనారాయణ (మాదిగ)

09. జగిత్యాల- ఐలినేని సాగర్ రావు (వెలమ)

10. సిరిసిల్ల- అన్నంనేని నర్సింగరావు (వెలమ)

11. సంగారెడ్డి- శశి కళా యాదవ్ రెడ్డి (రెడ్డి)

12. సిద్దిపేట- ఒంటేరు ప్రతాప్ రెడ్డి (రెడ్డి)

13. వికారాబాద్- సుభాష్ యాదవ్ (యాదవ్)

14. రంగారెడ్డి- సామా రంగారెడ్డి (రెడ్డి)

15. మేడ్చెల్- తోటకూర జంగయ్య యాదవ్ (యాదవ్)

16. వరంగల్ రూరల్- గన్నోజు శ్రీనివాసచారీ (విశ్వ బ్రహ్మాణ)

17. వరంగల్ అర్బన్- ఈగ మల్లేశం (పద్మశాలి)

18. భూపాలపల్లి- గండ్ర సత్యనారాయణ రావు (వెలమ)

19. జనగాం- కొండా మధుసూదన్ రెడ్డి (రెడ్డి)

20. సూర్యాపేట్- పటేల్ రమేష్ రెడ్డి (రెడ్డి)

21. మెదక్- ఏ.కె. గంగాధరరావు (వెలమ)

22. హైదరాబాద్- ఎంన్ శ్రీనివాస్ (మాల)

23. యాదాద్రి- ఎలిమినేటి సందీప్ రెడ్డి (రెడ్డి)

24. మహబూబాబాద్- చుక్కల విజయ్ చందర్ (ముదిరాజ్)

25. నల్గొండ- బిల్యా నాయక్ (లంబాడీ)

 

 

కొంపలు ముంచిన బిల్డర్ చౌదరి అరెస్టు                        

 మియాపూర్ మదీనగూడ లో నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్ తవ్వి దీప్తీశ్రీ నగర్ కాలనీ ముంపుకు కారకుడైన శ్రీ తిరుమల ఇన్ ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ యండి జే. ప్రకాష్ చౌదరిని  మియాపూర్ పోలీసులు అరెస్టుచేశారు. జిహెచ్ఎంసి అధికారులు, కాలనీ వాసులు ఇచ్చిన పిర్యాదు తో, మియాపూర్ పోలీసులు బిల్డర్ ప్రకాష్ చౌదరి పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.నాలాను మూసివేసి భారీ సెల్లార్ తీయడంతోనే పక్కనే ఉన్న సత్యనారాయణ ఎన్ క్లేవ్ అపార్ట్ మెంట్ కు ప్రమాదం ఏర్పడడంతో, పాటు తమ కాలనీలోకి వరద నీరు చేరుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు..

పిఎస్ఎల్ వి సి.39 ప్రయోగం విఫలం

పిఎస్ఎల్ వి సి.39 ఉపగ్రహ ప్రయోగం విఫలమైంది. శ్రీహరికోట నుంచి ఇవాళ సాయంత్రం 7 గంటలకు ప్రయోగించిన ఈ ఉపగ్రహ వాహక నౌక ఐఆర్ ఎన్ఎస్ ఎస్ 1హెచ్ ఉపగ్రహాన్ని కక్ష్యలో పెట్టాల్సి ఉంది. కానీ ప్రయోగం మొదలైన కొద్దిసేపటికే విఫలమైంది. పిఎస్ఎల్ వి నుంచి ఉపగ్రహం విడిపోని కారణంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టలేకపోయింది. ప్రైవేటు రంగంలో తయారైన మొట్టమొదటి ఈ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చలేకపోయిన ఇస్రో, ఈ ప్రయోగ విఫలంపై సమీక్షించి వివరాలు తెలియజేస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు. 

ముంబై బాధితులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన మహారాష్ట్ర సీఎం

ముంబైలో భారీ వర్షాల కారణంగా పురాతన భవనం కుప్పకూలిన ఘటనలో చనిపోయిన భాదితుల కుటుంబానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఎం పడ్నవీస్ భాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందించనున్నట్లు తెలిపాడు. క్షతగాత్రులకు కూడా ప్రభుత్వం తరపున వైద్య సాయం అందించనున్నట్లు హామీ ఇచ్చారు.  
 

ఎంపి సుబ్బిరామిరెడ్డి పై కేసు నమోదు
 

కాచిగూడ : రాజ్యసభ సభ్యుడు టి. సుబ్బిరామిరెడ్డిపై సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. ఆయన యాజమాన్యంలో నడుస్తున్న మహేశ్వరి పరమేశ్వరి థియేటర్ లో అక్రమంగా పార్కింగ్ చార్జీలు వసూలు చేస్తున్నారని పేర్కొంటు ఓ వ్యక్తి  పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీనిపై అపార్టుమెంట్‌ యాక్టు కింద సుబ్బిరామిరెడ్డిపై కేసు  నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
 

శ్రీలంక లక్ష్యం 376
 

కొలంబో:  శ్రీలంకతో జరుగుతున్న నాలుగో వన్డేలో బ్యాట్స్ మెన్స్ చెలరేగడంతో టీం ఇండియా భారీ స్కోరు సాధించింది. మొదట భ్యాటింగ్ చేసిన భారత జట్టు 375 పరుగుల  సాధించి లంక  ముందు భారీ లక్ష్యాన్ని  ఉంచింది. శ్రీ లంక బౌలర్లను ఊచకోత కోస్తూ కెప్టెన్ విరాట్ కోహ్లీ(131), ఓపెనర్ రోహిత్ శర్మ(104)లు సెంచరీలు చేశారు. చివర్లో పాండే అర్థ శతకంతో, దోనీ 49 పరుగులతో నాటౌట్ గా నిలవడంతో టీం ఇండియా భారీ స్కోరు సాధించింది. 

అర్జున అవార్డు గ్రహీత, విలువిద్యకారిణి జ్యోతికి రు.కోటి బహుమానం

అర్జున అవార్డు గ్రహీత, విలువిద్యకారిణి జ్యోతి సురేఖ ఈ రోజు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన జ్యోతికి 500చదరపు గజాల ఇంటి స్థలం,రూ.కోటి నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. ఇంటి స్థలం విజయవాడలో కానీ అమరావతి లో గాని ఇస్తారని  ముఖ్యమంత్రి చెప్పారు.  ఇదే విధంగా ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఇదే విధంగా స్కేటింగ్ లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించిన జీ.దేవిశ్రీప్రసాద్ కూడా ముఖ్యమంత్రిని కలిశారు. ఆయనకు ప్రోత్సాహకంగా రూ.10లక్షల నగదు బహుమతిని ముఖ్యమంత్రి ప్రకటించారు.దేవిశ్రీ ప్రసాద్ కు శిక్షణ సదుపాయాలు కల్పిస్తామని,తిరుపతి ఎస్వీయూ యూనివర్శిటీలో స్కేటింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

 

కర్ణాటక సీఎం సిద్దరామయ్యను కలవనున్న కాంగ్రెస్ నేతలు

  

పాలమూరు జిల్లాలో నీటి కష్టాలను తీర్చడానికై టీపిసిసి నేతలు రేపు కర్ణాటక సీఎం సిద్దరామయ్యను కలవనున్నారు. నారాయణ పూర్ జలాశయం జూరాలకు 15  టీయంసీల నీరు విడుదల చేయాలని వారు సీఎంను కోరనున్నారు. దీనికోసం టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఉన్నతస్థాయి బృందం  రేపు బెంగుళూరులో సిద్దరామయ్యను కలిసి వినతిపత్రం సమర్పించనున్నారు. అలాగే ఆర్డీఎస్ స్పిల్ వే పనులకు  వేగవంతం చేయాలని కోరనున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఈ ఉన్నతస్థాయి బృందంలో ఉత్తమ్ తో పాటు  సీఎల్పీ నేత జానారెడ్డి, మండలి విపక్ష నేత షబ్బీర్ అలీ, మహబూబ్ నగర్ జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు ఉన్నారు.
 

రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి (వీడియో)

కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గండేపల్లి లో రోడ్డు  ప్రమాదంలో నల్లబోతుల కిరణ్ అనే  నాలుగేళ్ల  బాలుడు మృతి చెందాడు.  కిరణ్ స్కూలు నుండి ఇంటికి వస్తుండగా ఈ ఘటన జరిగింది.  ఈ పసి బాలుడు రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టడంతో అతడు సంఘటన స్థలంలోనే  ప్రాణాలు వదిలాడు. తమ చిన్నారి రక్తపు మడుగులో పడివుండటం చూసిన తల్లిదండ్రులు  కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దీనిపై  కేసు నమోదుచేసుకున్న పోలీసులు, మృతదేహాన్ని నందిగామ మార్చురీ కి తరలించారు.
 

రాకీ యాదవ్ ను దోషిగా తేల్చిన కోర్టు

జేడీయూ మాజీ ఎమ్మెల్సీ కుమారుడు రాకీ యాదవ్ ను హత్య కేసులో దోషిగా తేల్చింది పాట్నా కోర్టు. గత సంవత్సరం రాకీ యాదవ్ తన కారును ఓవర్ టేక్ చేశాడని ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని గన్ తో కాల్చి హత్య చేసిన విషయం అందరికి తెలిసిందే. అప్పటినుంచి ఈ కేసుపై విచారణ జరుపుతున్న న్యామస్థానం ఇవాళ తుది తీర్పు వెలువరించింది.
 

రాజకీయాలు ప్రక్షాళన చేద్దాం రండి : కమల్

 విలక్షణ నటుడు కమల్ హాసన్ తమిళ నాడు రాజకీయాల్లోకి చేరినట్లే కనిపిస్తున్నాడు. ఎందుకంటే రాజకీయ ప్రక్షాలనకు తన వెంట నడిచి రావాలని తమిళ ప్రజలకు పిలుసునివ్వడం చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. జయలలిత మరణంతో తమిళ రాజకీయాల్లో ఏర్పడిన ఖాళీని తన సినీ గ్లామర్ తో భర్తీ చేయాలని చూస్తున్నట్లు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఆయన ఆ మద్య ప్రజా సమస్యలు, రాజకీయ అవినీతిపై స్పీచ్ లు దంచుతున్నాడు.  
ఇటీవల తమిళనాడు రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలనై ఆయన ఇవాళ స్పందించారు.   రాష్ట్రంలోని అవినీతి ఎమ్మెల్యేలు, మంత్రులు,స్థానిక లీడర్ల అక్రమాలపై ఆధారాలను సేకరించాలని అభిమానులకు పిలుపునిచ్చారు.  అవినీతి కోటను బద్దలుకొడదాం, తనతో పాటు పోరాటానికి సిద్ధంకండి అంటూ ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
 

సీనియర్ సిటిజన్ పై టీం ఇండియా ప్లేయర్ వీరంగం

రోడ్డుపై ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వీరంగం సృష్టించి, ఇదేమిటని ప్రశ్నించిన సీనియర్ సిటిజన్ పై దాడికి దిగాడు టీం ఇండియా క్రికెటర్ అంబటి రాయుడు. అంతే కాదు దీన్ని అడ్డుకోడానికి ప్రయత్నించిన స్థానికులపై కూడా తన దౌర్యన్యాన్ని ప్రదర్శించాడు.  

మరో వివాదంలో అర్జున్ రెడ్డి

ఎన్నో వివాదాల మద్య విడుదలై, భారీ విజయాన్ని అందుకున్న ‘అర్జున్ రెడ్డి’  సినిమా మరో కొత్త వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా కథను గతంతో తాను తెరకెక్కించిన ‘ఇక సె..లవ్’ షార్ట్ ఫిల్మ్ నుంచిచోరీ చేశారని, ఈ కథ తనదేనంటూ ఖమ్మం జిల్లాకు చెందిన నాగరాజు అనే వ్యక్తి ఆరోపిస్తున్నాడు. దీనికి సంబంధించి దర్శక, నిర్మాతలకు నోటీసులు కూడా పంపాడు. అనుమతి లేకుండా తెరకెక్కించినందుకు రూ. 2 కోట్ల నష్ట పరిహారం ఇవ్వాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ నోటీసులో పేర్కొన్నాడు.

బెనజీర్ బుట్టో హత్య కేసులో ముషారఫ్ దోషి

పాకిస్థాన్ మాజీ అద్యక్షురాలు బెనజీర్ బుట్టో హత్య కేసులో పర్వేజ్ ముషారప్ ను పాకిస్థాన్ కోర్టు దోషిగా తేల్చింది. అంతే కాకుండా ఆయన ప్రస్తుతం పరారీలో ఉన్నాడని  ప్రకటించింది. అయితే ఇదే కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మరో ఐదుగురు నిందితులను మాత్రం నిర్దోషులుగా తేల్చింది. 
 

విజయవాడ రైల్వే స్టేషన్ లో భారీగా బంగారం స్వాదీనం

 

ఈ రోజు కేరళ ఎక్స్ ప్రెస్ లో ఇద్దరు ప్రయాణికులు  భారీగా బంగారు ఆభరణాల తీసుకెళ్లున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎలాంటి రసీదులు లేకుండా వారు  తీసుకెళ్తున్న2 కిలోల బంగారునగలను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని  పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

 

ముంబైలో పురాతన భవనం కూలి 8 మంది మృతి

 

ముంబైలో  భారీ వర్షాలతో  భవనం కూలిన ఘటనలో ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. అలాగే మరో 13 మంది తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.   15 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానిక అధికారులు సహాయక చర్యలు  కొనసాగిస్తున్నారు. కాబట్టి క్షతగాత్రుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుంది. 

నిమజ్జనానికి కదిలిన అన్ని శాఖలు

నిమజ్జనం కోసం రోడ్ల మ‌ర‌మ్మ‌తులు, శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌, సాఫిగా నిమ‌జ్జ‌న కార్య‌క్ర‌మ నిర్వ‌హ‌ణ‌, క‌నీస సౌక‌ర్యాల ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసి, జ‌ల‌మండ‌లి, పోలీసు, హెచ్ఎండిఏ, నీటి పారుద‌ల శాఖ‌, రెవెన్యూ త‌దిత‌ర శాఖ‌లచే విస్తృత ఏర్పాట్లు చేయ‌డం జ‌రిగింది. శోభాయాత్ర జ‌రిగే మార్గంలో రోడ్ల మ‌ర‌మ్మ‌తులు, అద‌న‌పు విద్యుత్ దీపాల ఏర్పాటు, తాత్కాలిక మ‌రుగు దొడ్ల ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల సెప్టెంబ‌ర్ 5వ‌ తేదీ వ‌ర‌కు జ‌రిగే శోభ‌యాత్ర ఊరేగింపు మార్గంలో ఏవిధ‌మైన చెత్త కుండీలు లేకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అలాగే బ్లీచింగ్ పౌడ‌ర్‌, సున్న‌పు పౌడ‌ర్‌ను శోభ‌యాత్ర మార్గంలో చల్లడం, దోమ‌ల నివార‌ణ‌కు స్ప్రేయింగ్‌, ఫాగింగ్ చేప‌ట్ట‌డం వంటి కార్యక్రమాలను చేపడుతున్నారు.  ప్లాస్టిక్ వ్య‌ర్థాలు, పూలు, ప‌త్రిని తొల‌గించ‌డానికి ప్రత్యేకంగా పారిశుద్ద కార్మకులను ఏర్పాటు చేశారు. ఈ పారిశుద్ద కార్యక్రమాలను పర్యవేక్షించడానికి ప్ర‌త్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.
 

నిమజ్జనంలో కాలుష్యానికి చెక్ పెట్టే ఏర్పాటు

వినాయక విగ్రహాల నిమజ్జనం వల్ల చెరువులు కలుషితం కాకుండా నగరంలో  25 ప్ర‌త్యేక కొల‌నులను ఉపయోగించనున్నట్లు జీహెచ్ఎంసి తెలిపింది. అంటే గత సంవత్సరం నిర్మించిన 10 కొలనులతో పాటు, ప్ర‌స్తుత సంవత్సరం నిర్మించిన 15 ప్ర‌త్యేక కొల‌నుల‌ను ఈ నిమ్మజనం కోసం వాడుకోనున్నారు.  
గ‌త సంవ‌త్స‌రం నిర్మించిన నిమ‌జ్జ‌న కొల‌నుల‌ వివ‌రాలు
1. హుస్సేన్‌సాగ‌ర్ లేక్,  సికింద్రాబాద్, 2. ఊర‌చెరువు,  కాప్రా, 3. చ‌ర్ల‌ప‌ల్లి ట్యాంక్ - చ‌ర్ల‌ప‌ల్లి, 4. పెద్ద చెరువు-శేరిలింగంప‌ల్లి, 5. వెన్న‌ల చెరువు - జీడిమెట్ల, 6. రంగ‌ధాముని కుంట - కూక‌ట్‌ప‌ల్లి, 7. మ‌ల్క చెరువు - రాయ‌దుర్గ్, 8. న‌ల‌గండ్ల చెరువు - న‌ల‌గండ్ల, 9. పెద్ద చెరువు - స‌రూర్‌న‌గ‌ర్, 10. ప‌రికి చెరువు-కూక‌ట్‌ప‌ల్లి, 
ప్ర‌స్తుత సంవ‌త్స‌రంలో నిర్మింస్తున్న నిమ‌జ్జ‌న కొల‌నుల వివ‌రాలు
1. పెద్ద‌చెరువు-నెక్నాంపూర్‌, 2. లింగంచెరువు-సూరారం, 3. ముళ్ల‌క‌త్వ‌చెరువు-మూసాపేట్‌, 4. ప‌త్తికుంట‌-రాజేంద్ర‌న‌గ‌ర్‌, 5. బోయిన్‌చెరువు-హ‌స్మ‌త్‌పేట్‌, 6. నాగోల్‌చెరువు, 7. అల్వాల్‌-కొత్త‌చెరువు, 8. న‌ల్ల‌చెరువు- ఉప్ప‌ల్‌, 9.సాకిచెరువు -ప‌టాన్‌చెరు, 10. రాయ‌స‌ముద్రం చెరువు- రామ‌చంద్రాపురం, 11. హ‌స్మ‌త్‌పేట్‌-కైద‌మ్మకుంట‌, 12. మియాపూర్‌-గురునాథ్‌చెరువు, 13.లింగంప‌ల్లి- గోపిచెరువు, 14. రాయ‌దుర్గ్ - దుర్గంచెరువు, 15. హుస్సేన్‌సాగ‌ర్ చెరువు- అంబేద్క‌ర్‌న‌గ‌ర్‌.
 

వినాయక నిమజ్జనం కోసం జీహెచ్ఎంసి ప్ర‌త్యేక కంట్రోల్ రూం

 

హైద‌రాబాద్ న‌గరంలో సెప్టెంబ‌ర్ 5వ తేదీన జ‌రిగే గ‌ణేష్ నిమ‌జ్జ‌న కార్యక్రమంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్ర‌త్యేక కంట్రోల్ రూం ను జీహెచ్ఎంసి ఏర్పాటు చేసింది. ఇక్కడి నుండి నిమజ్జన కార్యక్రమాన్ని నిరంత‌రం ప‌ర్య‌వేక్ష‌ించనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా ఏవిధ‌మైన స‌మ‌స్య‌లు ఉన్నా డ‌య‌ల్ 100  ద్వారా గానీ, జీహెచ్ఎంసి కాల్ సెంట‌ర్ నెంబర్ 040-21111111 ద్వారా కానీ, మై జీహెచ్ఎంసి యాప్ ద్వారా త‌మ దృష్టికి తేవాల్సిందిగా అధికారులు సూచించారు. 
 

ఎంబీఎ స్టూడెంట్ కుక్కను దొంగిలించాడు
 

పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి, ఆ కుక్కల యజమానుల నుంచి డబ్బులు వసూలు చేసే కథాంశంతో ఇటీవల ఒక తెలుగు సినిమా వచ్చింది మీకు గుర్తుందా. సేమ్ టు సేమ్ అలాంటి ఘటనే ఒకటి  హైదరాబాద్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే ఎల్బీనగర్ లో కొందరు దొంగలు బిగిలిగ్రిడ్ జాతికి చెందిన  కుక్కను దొంగిలించారు. ఐ10 కారులో వచ్చిన ముగ్గురు యువకులు తన కుక్కను దొంగిలించాడని యజమాని పోలీసులకు పిర్యాదు చేశాడు. దీనిపై ముమ్మరంగా తనిఖీలు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు యూరప్ లో ఎంబీఏ చదివిన విద్యార్థి వుండటంతో పోలీసులు సైతం విస్మయానికి గురయ్యారు. అయితే సినిమాల ప్రభావమో లేక ఆర్థిక ఇబ్బందులో కాని  వీరిని ఈ విదంగా విచిత్రమైన దొంగతనం చేసి, కటకటాల పాలయ్యేలా చేసింది.  

తిరుపతి మీదుగా వెళ్లాల్సిన పలు రైలు రద్దు

 

తిరుపతి: ముంబైలో భారీ వర్షాల కారణంగా తిరుపతి మీదుగా వెళ్లాల్సిన పలు రైళ్లు రద్దయ్యాయి. దీంతో తిరుపతి రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. టీటీడీ సహకారంతో ప్రయాణికులకు భోజన సౌకర్యం కల్పించారు.

 

 

తెలంగాణ బాటలోనే ఏపీ ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం మాదిరిగానే ఏపీ ప్రభుత్వం కూడా పాఠశాల విద్యార్థులకు దసరా సెలవులను పెంచింది. ఈ సంవత్సరం నుంచి విద్యార్థులకు 14 రోజులు దసరా సెలవులు ఇవ్వనున్నట్లు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు సెప్టెంబర్ 19 నుంచి 30 వ తేదీ వరకు దసరా సెలవులను ప్రకటించింది. అయితే అక్టోబర్ 1 వ తేదీ ఆదివారం, 2వ తేదీన  గాంధీ జయంతి సందర్బంగా సెలవులు ఉండటంతో  స్కూళ్లు సెప్టెంబర్ 3 వ తేదిన పున: ప్రారంభం అవుతాయని ప్రభుత్వం ప్రకటించింది.                         

 

పట్టుబడిన భారీ గంజాయి ముఠా
 

తూర్పుగోదావరి జిల్లాలో  గంజాయిని అక్రమంగా  తరలిస్తున్న 12 మందితో కూడిన మాదకద్రవ్యాల  ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రంపచోడవరం ఏజన్సీ ప్రాంతంలో వీరిని గుర్తించి, వీరి వద్ద గల 900 కిలోల గంజాయితో పాటు, మూడు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు  ఏ ఎస్పీ నయీం  తెలిపారు.  పట్టుబడ్డ గంజాయి విలువ  కోటి రూపాయల వరకు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.                        

స్లం లెస్ సిటీగా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతా - కేటీఆర్


మేడ్చల్ జిల్లా :  హైదరాబాద్ నగరాన్ని స్లమ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. అందులో భాగంగానే డబుల్ బెడ్ రూం ఇళ్లను యుధ్ద ప్రాతిపదికన నిర్మించడానికి అధిక నిధులను కేటాయిస్తున్నామని అన్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి నగరంలో లక్ష ఇళ్ళు నిర్మించి తీరతామని ఆయన హామీ ఆచ్చారు. 
ఆయన ఇవాళ కీసర మండలంలోని రాంపల్లి గ్రామంలో తలపెట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణానికి  శంకుస్థాపన చేసారు.తర్వాత అక్కడ జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు.   ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి, ఎంఎల్ఏ సుధీర్ రెడ్డి, మేయర్  బొంతు రామ్మోహన్ తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 
 

నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఉద్రిక్తత

కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటిలో రెండు విద్యార్థి వర్గాల మద్య ఘర్షణ చెలరేగి క్యాంపస్ ప్రాంగణంలో ఉద్రిక్త నెలకొంది. ర్యాగింగ్ పేరుతో జూనియర్ విద్యార్ధులను సీనియర్లు చితకబాదటంతో గొడవ మొదలైంది. ఈ గొడవను అడ్డుకోడానికి వెళ్ళిన ఫ్యాకల్టీపై కూడా  సీనియర్లు బెదిరింపులకు దిగారు. పరిస్థితి చేయి దాటుతుండటంతో అధికారులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ట్రిపుల్ ఐటి ప్రాంగణానికి చేరుకుని పర్యవేక్షిస్తున్నారు.
 

ఏసీబి వలలో మరో అవినీతి అధికారి

గుంటూరు జిల్లాలో రోడ్లు భవనాల శాఖ అధికారి రాఘవేంద్రరావు నివాసంలో అవినీతి నిరోదక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆర్ ఆండ్ బి సూపరిండెంట్ ఇంజినీర్ పనిచేస్తున్న ఈయనపై ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఫిర్యాదు మేరకు ఈ సోదాలు నిర్వహించారు. గుంటూరు, సత్తెనపల్లి, మంగళగిరి, మచిలీపట్నంలలో  ఏసీబికి చెందిన 9 బృందాలు ఈయనకు సంబందించిన ఆస్తులపై సోదాలు నిర్వహిస్తున్నాయి. అంతేగాక రాఘవేంద్రరావు బంధువుల ఇళ్లలోనూ ఈ తనిఖీలు  కొనసాగుతున్నాయి. 
 

ముంబైలో కుప్పకూలిన పురాతన భవనం

ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలతో ఒక 70 ఏళ్ల నాటి పురాతన భవనం కుప్పకూలింది. బెండి బజార్ సమీపంలోని ఈ ఐదంస్తుల భవనంలో దాదాపు 10 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ కుటుంబాలకు చెందిన దాదాపు 30 మంది ఈ శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానిక అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు శిథిలాల నుంచి ముగ్గురు క్షతగాత్రులను ప్రాణాలతో రక్షించారు. అయితే  శిథిలాల కింద చిక్కుకుని ఎంత మంది చ‌నిపోయార‌న్న విష‌యాన్ని ఇప్పుడే చెప్ప‌లేమ‌ని డీసీపీ డాక్ట‌ర్ మ‌నోహ‌ర్ శ‌ర్మ తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)