ఏషియానెట్-తెలుగు ఎక్స్ ప్రెస్ న్యూస్

First Published Aug 30, 2017, 10:53 AM IST
Highlights

నేటి విశేష వార్తలు

  • తాండూర్ పట్టణ మాజీ పట్టణాద్యక్షుడు ఆయూబ్ ఖాన్   ఆత్మహత్యాయత్నం
  • తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసిన యాంకర్ ఉదయభాను 
  • వరంగల్ నిట్ లో డ్రగ్స్ కలకలం
  • నిజామాబాద్‌లో రూ. 25 కోట్ల‌తో ఐటి ట‌వ‌ర్ ఏర్పాటు
  • కడప స్టీల్ ప్లాంట్ కోసం మైదుకూరు లో ధర్నా
  • ఇక నుంచి జూన్ 2 నుంచి తెలంగాణ విద్యా సంవత్సరం మొదలు

హైటెక్ వ్యభిచార ముఠా అరెస్ట్‌

హైదరాబాద్‌:  ఆన్‌లైన్‌లో విటులను ఆకర్షిస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠాను నాచారం లో ఎస్‌ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారిలో ఇద్దరు అమ్మాయిలతో పాటు నిర్వహకుడు, అతడికి సహకరిస్తున్న మరొక వ్యక్తి ఉన్నాడు. వారి వద్ద నుంచి రూ.2500 నగదు, 3 మొబైల్ ఫోన్లు,  రెండు బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు 

జీహెచ్ఎంసీలో  "మ‌ర్యాద‌మాసం"గా సెప్టెంబ‌ర్‌

జీహెచ్ఎంసీలో సెప్టెంబ‌ర్ మాసాన్ని మ‌ర్యాద‌మాసంగా పాటించాల‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ జ‌నార్థ‌న్‌రెడ్డి నిర్ణ‌యించారు. ఇప్ప‌టికే మ‌ర్యాద‌గా మాట్లాడుకుందాం, ఐ ల‌వ్ మై జాబ్‌, సేవ్ ఎన‌ర్జీ, చిన్న పొర‌పాటుకు భారీ మూల్యం త‌దిత‌ర సందేశాలు క‌లిగిన స్టిక్క‌ర్ల‌ను రూపొందించి జీహెచ్ఎంసీలోని అధికారులు, సిబ్బందికి గ‌తంలోనే పంపినీ చేశారు. ఇలాంటి కార్య‌క్ర‌మాలు ప్ర‌తి అధికారి, ఉద్యోగి త‌మ విధుల‌ను వంద‌శాతం నిబద్ద‌త‌తో నిర్వ‌హించ‌డానికి దోహ‌ద‌ప‌డ్డాయి.   ప్ర‌తిఒక్క‌రిని గౌర‌వంగా చూడ‌డంతో పాటు జ‌వాబుదారిగా విధులు నిర్వ‌హించాల‌నే ఉద్దేశంతో సెప్టెంబ‌ర్ మాసాన్ని మ‌ర్యాద మాసోత్స‌వంగా నిర్వ‌హించాల‌ని జ‌నార్థ‌న్‌రెడ్డి ఆదేశాలు జారీచేశారు. దీనిలో భాగంగా ప్ర‌తి కార్యాల‌యంలో బోర్డుల ప్ర‌ద‌ర్శ‌న, క్రిందిస్థాయి సిబ్బంది నుండి సామాన్య పౌరుడికి మ‌ర్యాద‌ను ఇవ్వ‌డంతో పాటు వారి ప‌నుల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను సావ‌దానంగా విన‌డం,  స‌వివ‌ర‌మైన స‌మాధానాలు ఇవ్వాల‌ని క‌మిష‌న‌ర్ తెలిపారు. 
 

పార్టీ సమావేశంలోనే ఆత్మహత్యకు పాల్పడిన టీఆర్ఎస్ నేత (వీడియో)
 

వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగిన టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో మంత్రి మహేందర్ రెడ్డి ఎదుటే ఒక స్థానిక నేత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నామినేటెడ్ పదవి విశయంలో మనస్థాపం చెందిన తాండూర్ పట్టణ మాజీ పట్టణాద్యక్షుడు ఆయూబ్ ఖాన్ ఒంటిపై పెట్రొల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆయనను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

డ్రగ్స్ కేసులో రెస్టరాంట్ యజమాని అరెస్టు

 

డ్రగ్స్ కేసు అరెస్టులు కొనసాగుతున్నాయి.డ్రగ్స్ కేసు లకు సంబంధించి హైదరాబాద్  టోలిచౌకి లోని ఓ రెస్టారెంట్ యజమానిని (పవన్ కుమార్ )ను ఎల్.బీ.నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

 

 
 

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు జోరుగా ఏర్పాట్లు

దేశం నలుమూలల నుంచి విచ్చేసే భక్తులకు ఆధ్యాత్మిక ఆనందం, మరింత భక్తిభావం కలిగేలా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు సాగుతున్నాయి.  సెప్టెంబరు 23 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఇవి అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టిటిడిలోని అన్ని విభాగాలు సిద్ధమవుతున్నాయి. సప్తగిరి సత్రాల నుండి ఆస్థాన మండపం వరకు నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు సెప్టెంబరు 20వ తేదీకి పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తారు. మాడ వీధులతోపాటు భక్తుల రద్దీ అధికంగా ఉన్న ప్రాంతాలలో 11 ఎల్‌ఈడి స్క్రీన్‌లు ఏర్పాటు చేస్తున్నారు.  గత ఏడాది కంటే ఈ ఏడాది ఐదు ఎల్‌ఈడి స్క్రీన్‌లు అదనంగా ఉంటాయి.
సెప్టెంబరు 27న శ్రీవారి గరుడసేవకు విశేషంగా విచ్చేసే భక్తుల పార్కింగ్   సౌకర్యం కూడా ఏర్పాటుచేస్తున్నారు.  తిరుపతిలోని భారతీయ విద్యాభవన్‌ పాఠశాల మైదానం, దేవలోక్‌ ప్రాంగణంలో 2500 నాలుగు చక్రాల వాహనాలు నిలిపి ఉంచేలా పార్కింగ్‌ ఏర్పాట్లు చేపడుతున్నారు.                        
 

సీఎం కేసీఆర్ ను కలిసిన యాంకర్ ఉదయభాను

టీవి యాంకర్ ఉద‌య‌భాను ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్ ను కలిసారు. తన పిల్లల పుట్టిన రోజు వేడుకలు ఈ నెల మూడవ తేదీన పార్క్ హయత్ హోటల్లో జరగనున్నాయని,  ఈ  వేడుకలకు ఆహ్వానించడానికి తాను సీఎంను కలిసానని ఆమె తెలిపారు. సీఎం తనతో చాలా ఆప్యాయతగా మాట్లాడాడని చెబుతూ ఆయనను కలిసిన పోటోలను తన ఫేస్ బుక్ లో  పోస్ట్ చేసింది. 

శృతి హాసన్ కు కారుణ్య మరణం ప్రసాదించండి - తల్లిదండ్రులు  
 

గుంటూరు జిల్లా : ఆరేళ్ల చిన్నారికి కారుణ్య మరణానికి అనుమతివ్వాలని తల్లిదండ్రులే కోర్టును ఆశ్రయించిన ఘటన మదనపల్లిలో జరిగింది. మదనపల్లెకు చెందిన బొగ్గుల చిన్నరెడ్డప్ప, సునీత దంపతుల కూతురు శృతిహాసన్ న్యూరో ఫోబియాతో భాదపడుతుంది. అయితే చిన్నారికి వైద్యం చేయించే స్తోమత లేక తల్లిదండ్రులు తీవ్ర వేదనను అనుభవిస్తున్నారు. ఇక తమకు తమ కూతురు భాధను చూసి తట్టుకునే దైర్యం లేదని, వెంటనే ఆమెకు కారుణ్య మరణానికి అనుమతించాలని మదనపల్లి రెండవ అదనపు జిల్లా కోర్టు ను ఆశ్రయించారు.దీనిపై తాము నిర్ణయం తీసుకోలేమని, పై కోర్టులను ఆశ్రయించాలని న్యాయమూర్తి కేవీ మహాలక్ష్మీ వారికి సూచించారు.  
 

భద్రాది కొత్తగూడెం జిల్లాలో లారీ డ్రైవర్ల ఆందోళన
 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసుల దౌర్యన్యంపై లారీ డ్రైవర్లు రోడెక్కారు. బూర్గంపాడు మార్కెట్ యార్డ్ లో నిలిపివుంచిన లారీలపై పోలీసులు దాడి చేయడాన్ని వారు తప్పుపట్టారు. తమ తప్పు లేకున్నా పోలీసులు ఓవరాక్షన్ చేసి సుమారు 50 లారీల అద్దాలను పగలగొట్టారని  వాపోయారు. ద్వంసానికి కారణమైన పోలీసులే తమకు జరిగిన నష్టాన్ని అందించాలని   డిమాండ్ చేశారు.
 

వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి
 

నిమజ్జనం రోజు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇప్పటికే అన్ని  ఏర్పాట్లు పూర్తిచేసినట్లు   జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌ రెడ్డి చెప్పారు. వినాయక ఉత్సవ కమిటీలతో పాటు , అన్ని శాఖల సహకారంతో ఈ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. చెత్త వేయడానికి అక్కడక్కడ లక్ష కవర్లను, 168 మంది యాక్షన్ టీమ్‌లను, 5300 మంది జీహెచ్‌ఎంసీ కార్మికులు, 203 వాహనాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
 

రెండు పండుగలు ఒకే సారి...అందుకే భారీ బందోబస్తు

హైదరాబాద్‌: బక్రీద్‌, వినాయకచవితి పండుగల సందర్భంగా 24 వేల మంది పోలీసులతో, వేలాది సీసీ కెమెరాల ద్వారా అణువణువునా పర్యవేక్షిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ మహేందర్‌ రెడ్డి తెలిపారు.  గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరుపుకోవడానికి పోలీసు శాఖ తరపున అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. రెండు పండగలు ఒకే సారి వస్తున్నందువల్ల ప్రజలందరూ సహకరించాలని, శాంతియుతంగా పండగ జరుపుకోవాలని తెలిపారు. 
 

వరంగల్‌లో డ్రగ్స్‌ కలకలం,నిట్ విద్యార్థుల అరెస్టు

వరంగల్‌: వరంగల్‌ జిల్లాలో డ్రగ్స్ కలకలం రేగింది. మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నఇద్దరు విద్యార్థులను ఖాజీపేట ఎక్సైజ్‌ పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. నిట్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న బిజ్జు , రమేష్ అనే విద్యార్థులు కొద్ది రోజులుగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. ఈ మధ్య డగ్ర్స్‌ కేసులో హైద్రాబాద్‌లో దొరికిన నిందితుల ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. దీంతో సంబంధిత అధికారుల ఆదేశాల మేరకు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరిని రిమాండ్ కు తరలించారు.

కెసిఆర్ ను కలసిన పివి సింధు, కోచ్ గోపిచంద్


ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో రజత పతకం సాధించిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి. సింధూ, కోచ్ గోపిచంద్ తో కలిసి ఈ మధ్యాహ్నం ప్రగతి భవన్  లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసారు.  ముఖ్యమంత్రి సింధూను, కోచ్ గోపిచంద్ ను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ఫైనల్ పోటిలో కొద్దిలో వోడిపోయినా మంచి ప్రతిభ కనబరిచిందని పివి.సింధూను కొనియాడిన సిఎం ఆమెకు ‘‘బెటర్ లక్ నెక్స్దా టైం’’ ‘‘ఆల్ ద బెస్ట్’’  అని తెలియజేశారు.

మాజీ సైనికులు మళ్లీ సైన్యంలోకి

న్యూఢిల్లీ:  దేశ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో సైనిక, రక్షణ రంగాన్ని పటిష్టపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు 57 వేల మంది మాజీ ఉద్యోగులను తిరిగి సైన్యంలోకి చేర్చుకోవాలని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఢిల్లీలో జరిగిన కేబినెట్‌ భేటీ వివరాలను ఆర్థిక, రక్షణ శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ  వెల్లడించారు. ఇండియన్‌ ఆర్మీకి సంబంధించి ఇది అతిపెద్ద సంస్కరణగా పేర్కొన్న ఆయన, రక్షణ పరంగా ఇది చాలా మంచి నిర్ణయమని రక్షణ మంత్రి కితాబిచ్చారు. 
 

తమిళనాడు ప్రభుత్వంపై  రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం
 

తమిళనాడు రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. ఇప్పటికే అన్నాడీఎంకే లోని తన వర్గం ఎమ్మెల్యేలతో రిసార్టు రాజకీయాలు చేస్తున్న దినకరన్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా  రాష్ట్రపతికి ఫిర్యాదు ప్రయత్నిస్తున్నాడు. అందుకోసం రేపు చెన్నై కి చేరుకోనున్న ఎమ్మెల్యేలు, మరుసటి రోజు డిల్లీకి చేరుకుంటారని దినకరన్ తెలిపాడు. వారితో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా తన వర్గంలో చేరనున్నట్లు ఆయన తెలిపాడు. ప్రభుత్వాన్ని బల నిరూపనకు ఆదేశించాలని రాష్ట్రపతిని కోరనున్నట్లు ఆయన తెలిపాడు. 

కాణిపాకం ఆలయంలో అగ్నిప్రమాదం

చిత్తూరు జిల్లాలోని ప్రముఖ దేవాలయమైన కాణిపాకం వినాయక దేవాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది.  ఆలయ గర్భగుడిలోని ఏసీలో మంటలు చెలరేగి ప్రమాదం చోటుచేసుకుంది. అయితే సకాలంలో ఆలయ అధికారులు స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. అయితే ఈ ప్రమాదం షాట్ సర్క్యూట్ వల్ల జరిగి వుంటుందని అధికారులు తెలిపారు. 
 

నేరెళ్ల ఘటనపై హైకోర్టు విచారణ

నేరేళ్ల ఘటనకు సంభందించి కరీంనగర్ సివిల్ హాస్పిటల్  మెడికల్ రిపోర్టు, కరీంనగర్ సబ్ జైల్ లో వారెంట్ ,భాదితుల గాయాల కు సంబంధించిన పూర్తి రిపోర్ట్ ను తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు కు సమర్పించింది. ఈ ఘటనపై ప్రభుత్వ రిపోర్టు కీలకంగా మారనుందని, అందువల్ల దీన్ని జాగ్రత్తగా పరిశీలించనున్నట్లు న్యాయమూర్తి తెలిపారు.దీనిపై తదుపరి విచారణను హైకోర్టు వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది .
 

జమ్మికుంటలో ప్రతిరోజు జాతీయ దినోత్సవమే (వీడియో) 

తెలంగాణ రాష్ట్రంలో చిన్న పట్టణం జమ్మికుంట. కాని దేశభక్తిలో మాత్రం పెద్ద పేరునే సంపాదించింది. అసలు విషయం ఏమిటంటే ఈ పట్టణం చుట్టూ వున్న 16 లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రతిరోజు ఉదయం జాతీయ గీతాన్ని వినిపిస్తుంటారు. ఆ సమయంలో పట్టణ ప్రజలు ఎక్కడి వారు అక్కడ నిలబడి, సెల్యూట్ చేస్తూ తమ దేశ భక్తిని చాటుకుంటారు.  ఈ విధంగా దేశ భక్తిలో దేశానికే ఆదర్శంగా నిలిచింది జమ్మికుంట.   
 

కరీంనగర్ బిర్యానీ హౌస్ లో కుళ్లిన మాంసం

కరీంనగర్ లోని కోర్ట్ చౌరస్తా లో గల శివాస్ బిర్యానీ హౌస్ లో  ఏం వడ్డిస్తున్నారో తెలిస్తే అవాక్కయిపోతారు. అక్కడ బిర్యానీ, తదితర నాన్ వెజ్ వంటకాలలో  కుళ్ళిన,పాచిన,దుర్గంధం వస్తున్న మాంసం వాడుతున్నారు. ఈ విషయం టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులలో వెల్లడయింది.

నిజామాబాద్ లో పారిశ్రామిక అభివృద్దిని పరుగులు పెట్టిస్తాం -ఎంపి కవిత

నిజామాబాద్ జిల్లాను పారిశ్రామికంగా అగ్ర‌గామిగా నిలిపేందుకు కృషి చేస్తున్న‌ట్లు నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత తెలిపారు. నిజామాబాద్‌లో జ‌రిగిన  ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ నూత‌న క‌మిటీ బాధ్య‌త‌ల స్వీకారోత్స‌వానికి  క‌విత ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ, హైద‌రాబాద్‌కే ప‌రిమిత‌మ‌యిన పారిశ్రామికాభివృద్ధిని జిల్లాల‌కూ విస్త‌రించాల‌ని ముఖ్య‌మంత్రి కెసిఆర్  నిర్ణ‌యం తీసుకున్నార‌న్నారు.అందులో భాగంగానే త్వ‌ర‌లోనే రూ. 25 కోట్ల‌తో నిజామాబాద్‌లో ఐటి ట‌వ‌ర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్త‌లు, ఐటి రంగ నిపుణులు  ఎంఓయు కుద‌ర్చుకునేందుకు ముందుకు రావాల‌ని ఆమె కోరారు.  
 

రంగారెడ్డి జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇళ్లకు శంకుస్థాపన 

రంగారెడ్డి జిల్లా :  బాలాపూర్ మండలం మల్లాపూర్ గ్రామంలో నిర్మించనున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి రవాణా మంత్రి మహేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ మండలంలో  రూ. 234 కోట్ల నిధులతో మొత్తం 2,700 డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి  జిల్లాలో 3,642 డబుల్ బెడ్ రూం ఇళ్లను రూ. 1,950 కోట్ల నిధులతో నిర్మించనున్నట్లు తెలిపాడు. మొత్తంగా జీహెచ్ఎంసీ పరిధిలో రూ.2,474 కోట్ల నిధులతో  లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్ళను నిర్మాణం చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి అన్నారు. 
 

సింగూరులో చేప పిల్లల పెంపకం (వీడియో)  

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లా సింగూరు రిజర్వాయర్ వద్ద మత్స్య శాఖ మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన సింగూరు జలాశయంలో చేపపిల్లలను వదిలారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు స్థానిక ఎమ్మెల్యే బాబుమోహన్, మత్స్య శాఖ కమిషనర్ సువర్ణ, వివిధ శాఖల అధికారులు, టీఆరెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. 
 

మైదుకూరు లో  కడప స్టీల్ ప్లాంట్ కోసం ధర్నా

 

కడప జిల్లా మైదుకూరు పట్టణంలో ఈ రోజు పలు ప్రజా సంఘాల,విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్  ఏర్పాటుచేయాలనే డిమాండ్ తో ధర్నాజరిగింది. ఈ ధర్నాలో సిఐటియు, ఎస్ ఎస్ ఐ, ఆర్ డిఎఫ్,  ఎఐడిడబ్ల్యూ లు కూడా పాల్గొన్నాయి.   యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయిందని ఈ సంఘాలు  విమర్శంచాయి. ఇలాంటపుడు స్టీల్ ప్లాంట్  ఏర్పాటు ద్వారా జిల్లాలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచవచ్చని చెబుతూ  విభజన చట్టం లోపేర్కొన్నట్లు ప్లాంటును వెంటనే ఏర్పాటుచేయాలని  ఈ సంఘాల నేతలు డిమాండ్ చేశారు.

 

వైద్యుల నిర్లక్ష్యంతో చిన్నారి మృతి (వీడియో)

కృష్ణాజిల్లా మైలవరంలో ఓ నర్సింగ్ హోమ్ వైద్యుల నిర్లక్ష్యం చిన్నారి ప్రాణాన్ని బలిగొంది. వైద్యం చేయడానికి  వైద్యులు చేసిన  ఆలస్యమే తమ బిడ్డ  బలితీసుకుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే కృష్ణా జిల్లాలోని కొత్తనాగులూరు గ్రామానికి చెందిన జల్లి శ్రీనివాసరావు  ఉమామహేశ్వరి లు భార్యాభర్తలు. ఉమామహేశ్వరి గర్బవతి కావడంతో ఆమెను ప్రసవం నిమిత్తం మైలవరం లోని తేజశ్వి నర్సింగ్ హోమ్ కు  తరలించారు కుటుంబసభ్యులు. అయితే ఆమెకు బ్లడ్ బ్లీడింగ్ అవుతుండటంతో తొందరగా ఆఫరేషన్ చేయాలని  శ్రీనివాసరావు హాస్పిటల్ సిబ్బంది ని కోరాడు. అయినా నొప్పులు పెరగాల్సి ఉందని అప్పటివరకు తాము ఏం చేయలేమని వారు తాత్సారం చేశారు. తర్వాత చాలా సేపటికి ఆమెను  పరీక్షించిన డాక్టర్,  ఆపరేషన్ చేసినప్పటికి బిడ్డను మాత్రం కాపాడలేకపోయారు. దీంతో ఆగ్రహించిన భాధితులు దీనికి బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను వేడుకున్నారు.  
 

ఓయూలో ఇంజనీరింగ్ విద్యార్థుల ధర్నా(వీడియో)

ఇంజీనిరింగ్ విద్యలో డిటెన్షన్ విధానాన్ని రద్దుచేయాలి డిమాండ్ చేస్తూ ఓయూ లో  ఇంజనీరింగ్ విద్యార్థుల ఆందోళన చేపట్టారు. అలాగే ఎన్నో రోజులుగా వాయిదా వేసుకుంటు వస్తున్న అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల నుండి పరిపాలన భవనం వరకు ర్యాలి నిర్వహించి, అక్కడే ధర్నాకు దిగారు. తమ సమస్యలపై అధికారులు దృష్టి పెట్టి, పరిష్కరించాలని కోరుకుంటున్నామని విద్యార్థులు తెలిపారు.
 

ఏపీ లో రాష్ట్రపతి పర్యటన వివరాలు

భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆంద్రప్రదేశ్ లో సెప్టెంబర్ 1 మరియు 2 తేదీల్లో పర్యటించనున్నారు. ఆయన తిరుపతిలో వివిధ అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో ఆయన పర్యటన షెడ్యూల్ ఇలా ఉండనుంది. మొదట  శ్రీ పద్మావతి మెడికల్ కాలేజీలో నూతనంగా నిర్మించిన భవనాన్ని గవర్నర్ , ముఖ్యమంత్రిలతో కలిసి ఆయన ప్రారంభిస్తారు. తర్వాత ఎస్వీ ఆర్ట్స్ కాలేజి ప్రాంగణంలో జరిగే బహిరంగ సభలో ఆయనకు ఏపీ ప్రభుత్వం తరపున పౌర సన్మానం జరగనుంది. అనంతరం ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కిల్ ట్రెయినింగ్ సెంటర్ భవనానికి శంకుస్థాపన చేయనున్నాడు. తర్వాత రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేయనున్న ప్రత్యేక విందులో పాల్గొంటారు. ఈ పర్యటనలోనే ఆయన తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకోనున్నారు.

రెండవ రోజు ఆయన పర్యటన మొత్తం తిరుమలలో సాగనుంది.  తిరుమల లో శ్రీ వారి తో పాటు , వరాహ స్వామిని ఆయన దర్శించుకోనున్నారు. అలాగే రంగనాయక మంటపంలో ఆయనకు టీటిడి అర్చకులు, అధికారులు తీర్థ ప్రసాదాలు అందించనున్నారు.      
 

జూన్ 2 నుంచి తెలంగాణ విద్యా సంవత్సరం

 

తెలంగాణ పాఠశాలల అకడెమిక్ కేలండర్‌  విడుదలయింది అయ్యింది.  తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం  నిర్వహిణతో కొత్తగా అకడమిక్‌ కేలండర్‌ను ప్రభుత్వం ఖరారు చేసింది.  దీనికి సంబంధించి విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆర్‌ ఆచార్య ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేలండర్‌ ప్రకారం 2017–18 అకాడమిక్ ఇయర్ వచ్చే ఏడాది ఏప్రిల్‌ 12వ తేదీతో ముగుస్తుంది. ఏప్రిల్‌ 13 నుంచి మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయి. జూన్‌ 1నవిద్యాసంస్థలు  ప్రారంభమవుతాయి. ఈ  కేలండర్‌ ప్రకారం పదో తరగతి విద్యార్థులకు జనవరి 31వ తేదీలోగా సిలబస్ పూర్తి చేయాలి. ఆపై రివిజన్‌ ప్రారంభించాలి. ఫిబ్రవరి 28లోగా ప్రీఫైనల్‌ పరీక్షలు నిర్వహించితీరాలి. ఒకటి నుంచి 9వ తరగతి వరకు సిలబస్‌ను ఫిబ్రవరి 28వ తేదీలోగా పూర్తి చేయాలి.

హై స్కూళ్లలో  ఆప్షనల్‌ హాలిడేస్‌ వినియోగించుకునే విషయంలో నిబంధనలు పాటించాలి. గతంలో మాదిరిగా టీచర్లంతా ఆప్షనల్‌ హాలిడేస్‌ తీసుకుని పాఠశాలకు సెలవు ఇవ్వడానికి వీలు లేకుండా చేశారు. ఒక పాఠశాలలో 30 శాతం మంది టీచర్లకు మించి ఆప్షనల్‌ హాలిడేస్‌ను ఇవ్వ కూడాదు. మిగతా వారితో స్కూళ్లను  నడిపించాలి.  ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు మాత్రం గతంలో తరహాలో పాఠశాలకు సెలవు ఇవ్వొచ్చు.

స్కూల్స్ టైమింగ్స్...

హై స్కూల్ : ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు. హైదరాబాద్‌ జంట నగరాల్లో ఉదయం 8:45 నుంచి సాయంత్రం 4 వరకు...

అప్పర్ ప్రైమరీ స్కూల్ : ఉదయం 9 నుంచి సాయంత్రం 4:15 వరకు. హైదరాబాద్‌ జంట నగరాల్లో ఉదయం 8:45 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు...

ప్రైమరీ స్కూల్ : ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు. హైదరాబాద్‌ జంట నగరాల్లో ఉదయం 8:45 నుంచి సాయంత్రం 3:45 వరకు...
 

నల్గొండ జిల్లాలో కీచక ఉపాద్యాయుడి అరెస్టు

నల్గొండ జిల్లాలోని అనుముల మండలం హలియా జిల్లా పరిషత్ హై స్కూల్ లో  దారుణం జరిగింది. విద్యార్థులకు విద్యా బుద్దులు నేర్పాల్సిన ఉపాద్యాయుడే విద్యార్థినులతో వెకిలిచేష్టలకు పాల్పడ్డాడు. స్కూల్లో ప్రధానోపాద్యాయుడిగా పనిచేస్తున్న గుండా కృష్ణ మూర్తి  ఓ విద్యార్థినిపై గత కొన్ని రోజులుగా లైంగిక దాడి చేస్తున్నాడు. ఈ విశయాన్ని గమనించిన ఇతర విద్యార్దులు పోలీసులకు పిర్యాదు చేయడంతో గుండా కృష్ణ మూర్తిని అదుపులోని తీసుకుని విచారిస్తున్నారు.
 

మిర్యాలగూడలో కానిస్టేబుల్ ఆత్మహత్య

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో శ్రీనివాస చారి అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  తన చావుకు ఎవరు భాద్యులు కాదని సూసైడ్ నోట్ రాసిపెట్టి, స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో  రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వ్యక్తిగత కారణాలు, మతిమరుపు సమస్య కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు.
 

గోరఖ్ పూర్ లో ఆగని చిన్నారుల మరణాలు

గోరఖ్‌పూర్‌ :  యూపీలో  గోరఖ్‌పూర్‌లో బాబా రాఘవ దాస్ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చిన్నారుల మరణాలు కొనసాగుతూనే వున్నాయి. ఇంతకు ముందే ఆక్సిజన్ అందక అనేక మంది చిన్నారులు చనిపోగా, కేవలం గడిచిన 48 గంటల్లోనే మరో 42మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. వారంతా   వివిధ కారణాలతో చనిపోయినట్లు ఆస్పత్రి ప్రిన్సిపల్‌ పీకే సింగ్‌ వెల్లడించారు.  

click me!