ఏషియానెట్-తెలుగు క్రైమ్ న్యూస్

First Published Oct 3, 2017, 10:38 AM IST
Highlights

విశేష వార్తలు

  • లండన్ లో విజయ్ మాల్యా అరెస్ట్
  • జీహెచ్ఎంసి కమీషనర్ కు హెచ్చార్సీ నోటీసులు 
  • చిన్నారి మరణంపై హెచ్చార్సీకి పిర్యాదుచేసిన బాలల హక్కుల సంఘం  
  • స్కూల్ విద్యార్థినిని తల్లిని చేసిన ప్రధానోపాద్యాయుడు 
  • కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఐదుగురి మృతి

రోడ్డు ప్రమాదంలో బాలిక మృతి

పశ్చిమగోదావరి జిల్లా జిలుగుమిల్లి మండలం పూచికపాడు వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది.  విద్యార్థులతో ప్రయాణిస్తున్న ఆటో బోల్తా పడి జోస్న(7) అనే చిన్నారి మృతి చెందింది. మరో పది మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట  ఆస్పత్రికి తరలించారు.
వీరంతా సత్తుపల్లికి చెందిన 15 మంది ఆటోలో గుబ్బలమంగమ్మ గుడి వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
 

నకిలీ జీవోల సృష్టిపై నిఘా

భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ లో ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటన పేరిట సోషల్ మీడియాలో వైరల్ అయిన నకిలీ జీవో వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ అయింది.నకిలీ జీవో సృష్టికి కారకులైన వారిపై సైబర్ క్రైమ్ పోలీసుల నిఘా  ద్వారా ఆట కట్టించడానికి ప్రభుత్వ ఉన్నతాధికారులు పథకం రచిస్తున్నారు. భవిష్యత్ లో ఇలాంటి వార్తలు సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి జరక్కుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారుల దృష్టి సారించారు.

ఎట్టకేలకు విజయ్ మాల్యా అరెస్టు

మనీ లాండరింగ్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటు లండన్ లో తలదాచుకున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు అధికారికంగా వెల్లడించారు. అయితే ఐదు నెలల క్రితం ఇలాగే అరెస్టైనప్పటికి మాల్యా చాకచక్యంగా లండన్ చట్టాలను అడ్డుపుట్టుకుని బయటపడ్డాడు. అయితే ప్రస్తుతం అరెస్టునుంచి కూడా ఇదే పద్దతిలో బయటపడటానికి ఆయన ప్రయత్నిస్తాడన్న అనుమానంతో అధికారులు పకడ్భందీ ఏర్పట్లు చేసినట్లు సమాచారం. 

జీహెచ్ఎంసి కమీషనర్ కు హెచ్చార్సీ నోటీసులు 

జిహెచ్ఎంసి కమిషనర్ కి మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. వర్షాల కారణంగా మట్టిపెళ్లలు కూలి వాటి కింద చిక్కుకున్న ఓ చిన్నారిని అతడి తండ్రిని కాపాడటంలో జీహెచ్ఎంసి అధికారులు నిర్లక్ష్యం వహించడంతో వారు చనిపోయారని  బాలల హక్కుల సంఘం హెచ్చార్సీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై డిసెంబర్ 14 కల్లా రిపోర్టు సమర్పించాలని జీహెచ్ఎంసి కమీషనర్ కు హెచ్చార్సీ ఆదేశాలు జారీ చేసింది.

సెల్పీల మోజుతో ముగ్గురు యువకుల దుర్మరణం 

సెల్పీల మోజు తో ముగ్గురు యువకులు ప్రాణాలు పోగొట్టుకున్న దుర్ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే బెంగళూరులోని హెజ్జల మరియు బందాడి రైల్వే స్టేషన్ల మద్య గల రైల్వే ట్రాక్ పై ముగ్గురు యువకులు సెల్పీ లు తీసుకుంటున్నారు. అయితే అదే సమయంలో బెంగళూరు నుంచి  మైసూరు వెళుతున్న గోల్ గుంభజ్ ఎక్స్ ప్రెస్ ప్రమాదవశాత్తు వీరిని ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు.  వీరు సెల్పీ తీసుకుంటుండగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యేక సాక్షులు చెబుతున్నారని రైల్వే ఎస్పీ చైత్ర తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్లు ఆమె తెలిపారు. 

సినిమా స్టంట్ కు ప్రయత్నించి ఓ విద్యార్థి మృతి
 

సినిమాల్లో మాదిరిగా స్టంట్ కు ప్రయత్నించి ఓ బాలుడు మృతిచెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే సురేష్ అనే 8 సంవత్సరాల విద్యార్థి స్నేహితులతో కలిసి సరదాగ స్నానానికి మిట్టె జలపాతం వద్దకు వెళ్లారు. జలపాతంలో ఈత కొడుతూ, సురేష్ బాహుబలి సినిమాలో మాదిరిగా బాగా ఎత్తులోంచి డైవ్ చేయడానికి ప్రయత్నించి  ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డాడు. తాము వారించినప్పటికి వినకుండా సురేష్ ఈ విన్యాసాలకు పాల్పడ్డాడని అతడి స్నేహితులు చెబుతున్నారు.
 

దిలీప్ కుమార్ కు బెయిల్ మంజూరు

 లైంగిక వేధింపుల కేసులో  జైలు శిక్షను అనుభవిస్తున్న మలయాళీ నటుడు దిలీప్ కుమార్ కు కేరళ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గత 86 రోజులుగా శిక్ష అనుభవిస్తున్న అతడి బెయిల్ పిటిషన్ ను పలుమార్లు తిరస్కరించిన కోర్టు, తాజాగా అతడు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారించి బెయిల్ మంజూరు చేసింది.    

హెచ్చార్సీలో బాలల హక్కుల సంఘం పిటిషన్

భారీ వర్షాలతో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 లో నాయుడు నగర్ లో  మట్టి పెల్లలు కూలి యాదులు అనే వ్యక్తి తో పాటు అతడి కొడుకు జోసెఫ్ (6 నెలల వయసు) అనే చిన్నారి మరణించిన విషయం తెలిసిందే. అయితే వీరి మరణాలకు జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం కారణమని బాలల హక్కుల సంఘం  పేర్కొంది. ఈ దుర్ఘటన పట్ల నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలకు జీహెచ్ఎంసి కమీషనర్ ను వెంటనే ఆదేశించాలని బాలల హక్కుల సంఘం  హెచ్చార్సీ కి లేఖ రాసింది. ఈ అధికారులపై క్రిమినల్ కేసు నమోదు చేసి, భాదిత కుటుంబానికి ప్రకటించిన ఎక్స్ గ్రేషియాను పెంచేలా ఆదేశించాలని బాలల హక్కుల సంఘం హెచ్చార్సీని కోరింది.
 

జీవో 39 కు వ్యతిరేకంగా తొర్రూరులో నిరసన

రైతు సమన్వయ సమితుల కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 39, 42 లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూర్ లో  జేఏసీ,అఖిల పక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.  రైతులకు ఏ విధంగా ఉపయోగపడని సమన్వయ సమితులను రాజకీయ నిరుద్యోగితను తొలగించడానికి తీసువస్తున్నారని వివిధ పార్టీల నాయకులు టీఆరెస్ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.
 

రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురి మృతి

కరీంనగర్ జిల్లా పెద్దపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రాజీవ్ రహదానిపై వేగంగా ప్రయాణిస్తున్న ఓ కారు డివైడర్ ను ఢీ కొని అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మరో కారును డీ కొట్టడంతో రెండు కార్లు నుజ్జునుజ్జయ్యాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 

చిన్నారిని తల్లినిచేసిన కీచక ప్రధానోపాద్యాయుడు

ఒడిషా లోని కోరాపుట్ జిల్లాలో దారుణం జరిగింది. విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే ఓ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి తల్లిని చేసిన విషాద సంఘటన బయటపడింది.  బాలికను ఇంట్లో భందించి మరీ అత్యాచారానికి పాల్పడ్డాడు నిందితుడు. ఈ విషయం బయటపడటంతో ప్రధానోపాద్యుడు నాయక్ పై విద్యాశాఖ అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే చిన్నారికి మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. దీనిపై పూర్తిగా విచారించిన తర్వాత నిందితుడిపై చర్యలు తీసుకుంటామని స్థానిక పోలీసులు తెలిపారు. 

click me!