బీట్ రూట్ లో మన ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని ఎన్నో వ్యాధులకు దూరంగా ఉంచుతాయి. అందులో బీట్ రూట్ జ్యూస్ ను ఉదయాన్నే పరిగడుపున తాగితే ఎన్నో లాభాలు కలుగుతాయి. అవేంటంటే?
బీట్ రూట్ ఎవ్వరికీ తినాలనిపించదు. ఎందుకంటే దీని టేస్ట్ అలా ఉంటుంది. కానీ దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. బీట్ రూట్ ను సలాడ్ లా తినొచ్చు లేదా జ్యూస్ గా చేసుకుని తాగొచ్చు. రోజూ బీట్ రూట్ జ్యూస్ ను తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు మీరు దూరంగా ఉంటారు. ముఖ్యంగా ఉదయం పరిగడుపున తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
రక్తపోటును క్రమబద్ధీకరిస్తుంది: బీట్ రూట్ లో నైట్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మన శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ గా మారి రక్త నాళాలను విస్తరించేలా చేస్తాయి. దీనివల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. బీపీ కూడా అదుపులో ఉంటుంది. అందుకే బీట్ రూట్ జ్యూస్ హైపర్ టెన్షన్ పేషెంట్లకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
రక్తహీనతను నివారిస్తుంది: బీట్ రూట్ లో ఐరన్ మెండుగా ఉంటుంది. ఈ ఐరన్ మన శరీరంలో ఎర్ర రక్త కణాలను తయారు చేయడానికి బాగా సహాయపడుతుంది. ఇనుము హిమోగ్లోబిన్ ను తయారు చేస్తుంది. దీంతో ఎర్ర రక్త కణాలు శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్ ను బాగా తీసుకువెళతాయి. కాని ఇనుము లోపం వల్ల హిమోగ్లోబిన్ తగ్గుతుంది. దీన్నే రక్తహీనత సమస్య అంటాం. రక్తహీనత సమస్యతో బాధపడేవారు బీట్ రూట్ జ్యూస్ తాగితే శరీరంలో ఐరన్ లోపం ఉండదు. రక్తహీనత కూడా తగ్గుతుంది.
కొలెస్ట్రాల్ తగ్గుతుంది: బీట్ రూట్ జ్యూస్ లో ఫైటో న్యూట్రియెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి బాగా సహాయపడతాయి. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడం వల్ల ధమనుల అడ్డంకి సమస్య తగ్గుతుంది. దీంతో పాటుగా గుండెజబ్బుల ముప్పు కూడా తగ్గుతుంది. బీట్ రూట్ జ్యూస్ ను తాగితే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
కాలేయానికి మేలు: బీట్ జ్యూస్ కాలేయాన్ని ఆక్సీకరణ నష్టం నుంచి కాపాడుతుంది. అలాగే ఇది శరీరంలో మంటను తగ్గిస్తుంది. అంతేకాదు ఇది మన శరీరాన్ని డిటాక్స్ చేయడానికి కూడా సహాయపడుతుంది. అందుకే బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల లివర్ డ్యామేజ్ అయ్యే రిస్క్ కూడా చాలా వరకు తగ్గుతుంది.
బరువు తగ్గడానికి: బీట్ రూట్ జ్యూస్ లో కేలరీలు తక్కువగా ఉంటాయి. కొవ్వులు మొత్తమే ఉండవు. అందుకే ఈ జ్యూస్ ను రోజూ ఉదయం పరిగడుపున తాగితే మీ ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉంటారు. బరువు పెరిగే అవకాశం చాలా వరకు తగ్గుతుంది.