
పొగాకు ఆరోగ్యానికి హానికరం అన్న సంగతి ప్రతి ఒక్కరికీ తెలుసు. అయినా దీనిని తాగకుండా కొంతమంది అస్సలు ఉండలేరు. పొగాకు క్యాన్సర్, గుండె జబ్బులు, శ్వాసకోశ రుగ్మతలతో సహా ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. నిజానికి ధూమపానాన్ని మానేయడం అంత సులువు కాదు. కానీ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం ఈ అలవాటుకు పుల్ స్టాప్ పెట్టాల్సిందే. ఏదేమైనా ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం ఖచ్చితం స్మోకింగ్ ను మానేయాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటంటే..
దీర్ఘకాలిక దగ్గు
స్మోకింగ్ అత్యంత సాధారణ హెచ్చరిక సంకేతాలలో దీర్ఘకాలిక దగ్గు ఒకటి. స్మోకింగ్ అలవాటు ఉన్నవారు నిరంతరం దగ్గుతుంటే.. ముఖ్యంగా ఉదయం పూట దగ్గు రావడం ప్రమాదకరం. ఇది మీ ఊపిరితిత్తులు సిగరెట్ పొగ నుంచి విషాన్ని క్లియర్ చేయడానికి కష్టపడుతున్నాయని సంకేతం కావొచ్చు. ఇది ఫ్యూచర్ లో దీర్ఘకాలిక బ్రోన్కైటిస్, ఇతర శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది.
శ్వాస ఆడకపోవడం
స్మోకింగ్ కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. ముఖ్యంగా శారీరక శ్రమ సమయంలో ఇలా ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే సిగరెట్ పొగ ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. ఆక్సిజన్ ను తీసుకోవడం, సమర్థవంతంగా ఉపయోగించడాన్ని కష్టతరం చేస్తుంది. కొద్ది దూరం నడిచినా... లేదా మెట్లు ఎక్కినా శ్వాసతీసుకోవడానికి ఇబ్బంది కలుగుతుంది. ఇలాంటి సమస్య ఉంటే వెంటనే ధూమపానం మానేయండి.
రుచి, వాసనను గ్రహించలేకపోవడం
ధూమపానం వల్ల రుచి, వాసను పసిగట్టే జ్ఞానం మందగిస్తుంది. స్మోకింగ్ అలవాటు ఉన్నవారికి ఇష్టమైన ఆహారాలు మునుపటిలా రుచిగా అనిపించకపోయినా.. అలాగే మునపటిలా వాసన చూడకపోయినా మీ శరీరంపై స్మోకింగ్ ప్రభావం ఎక్కువైందని అర్థం చేసుకోండి. ఇది మీరు వెంటనే స్మోకింగ్ ను మానేయాలని సంకేతం ఇస్తుంది.
పసుపు పచ్చ దంతాలు, వేళ్లు
సిగరెట్ పొగలో ఎన్నో రసాయనాలు ఉంటాయి. ఇవి కాలక్రమేణా మీ దంతాలు, వేళ్ల రంగును మారుస్తాయి. మీ దంతాలు పసుపు రంగులోకి మారుతున్నట్టు లేదా వేళ్ల రంగు పసుపు కలర్ లోకి మారాయిని అనిపిస్తే మీరు వెంటనే స్మోకింగ్ ను మానేయాలని నిపుణులు చెబుతున్నారు. లేదంటే ప్రాణాంతకంగా మారుతుంది.
ఆరోగ్య సమస్యల ప్రమాదం పెరుగుతుంది
ధూమపానం ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె జబ్బులు, స్ట్రోక్ తో సహా ఎన్నో తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఈ అనారోగ్య సమస్యలను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని తగ్గించడానికి ధూమపానం మానేయడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు.