
ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ కొలెస్ట్రాల్ గుండె పోటు, స్ట్రోక్ వంటి గుండె జబ్బులకు దారితీస్తుంది. అయితే కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి కొన్ని మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ కొన్ని ఆహారాల పదార్థాలు కూడా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఎంతగానో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..
ఓట్స్
ఓట్స్ ఫైబర్ కు అద్భుతమైన మూలం. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ప్రతిరోజూ కనీసం ఒకటిన్నర కప్పుల ఉడికించిన ఓట్స్ తినాలని నిపుణులు చెబుతున్నారు. వోట్స్ ను వోట్మీల్, రాత్రిపూట ఓట్స్ గా తినొచ్చు. స్మూతీల్లో వేయొచ్చు.
చిక్కుళ్ళు
కాయధాన్యాలు, చిక్పీస్, బీన్స్ వంటి చిక్కుళ్ళో మొక్కల ఆధారిత ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. చిక్కుళ్లను క్రమం తప్పకుండా తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు బాగా తగ్గుతాయి. ఇందుకోసం వారానికి కనీసం రెండు లేదా మూడు సార్లు చిక్కుళ్లను తినాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
కొవ్వు చేపలు
చేపలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా సాల్మన్, సార్డినెస్, మాకేరెల్ వంటి కొవ్వు చేపలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మంటను తగ్గించడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగా సహాయపడతాయి. ఇందుకోసం వారానికి కనీసం రెండు సార్లు కొవ్వు చేపలను తినాలని నిపుణులు చెబుతున్నారు.
గింజలు
వాల్ నట్స్, బాదం, జీడిపప్పు వంటి గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. రోజుకు గుప్పెడు గింజలను తింటే ఆరోగ్యం బాగుండటమే కాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి.
అవోకాడో
అవోకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అవొకాడో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. అయితే అవొకాడోలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటిని ఎక్కువగా తినాకూడదు.
ఆలివ్ ఆయిల్
ఆలివ్ ఆయిల్ గుండో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడే ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇతర వంట నూనెలు, కొవ్వులకు ప్రత్యామ్నాయంగా ఆలివ్ నూనెను ఉపయోగించండి.
కూరగాయలు
వంకాయ, బెండకాయ, బ్రస్సెల్స్ మొలకలు వంటి కూరగాయలలో ఫైబర్ తో పాటుగా ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి బాగా సహాయపడతాయి. ఈ కూరగాయలను క్రమం తప్పకుండా తింటే ఆరోగ్యం బాగుండటంతో పాటుగా కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి.