
ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితానికి కంటినిండా నిద్ర చాలా అవసరం. కానీ నేడు చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. తగినంత నిద్రలేకపోతే మన మొత్తం ఆరోగ్యం దెబ్బతింటుంది. చాలా రోజులుగా నిద్ర కరువైతే మీ శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.
రాత్రిపూట సరిగా నిద్రపోకపోతే బాగా అలసిపోతారు. చిరాకు కలుగుతుంది. పగటిపూట నిద్రపోతారు. ముఖ్యంగా మీ రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. అంతేకాదు అధిక రక్తపోటు, మానసిక ఒత్తిడి వంటి శారీరక, మానసిక సమస్యలు కూడా వస్తాయి. అంతేకాదు కళ్ల చుట్టూ నల్లటి మచ్చలు ఏర్పడుతాయి. ఈ సమస్యలన్నింటికీ నిద్రలేమే ప్రధాన కారణమంటున్నారు నిపుణులు. అయితే కొన్ని ఆహారాలు మనకు రాత్రిళ్లు నిద్రలేకుండా చేస్తాయి. అందుకే రాత్రిళ్లు ఇలాంటి ఆహారాలను తినకపోవడమే మంచిది. హాయిగా నిద్రపోవాలంటే ఎలాంటి వాటిని తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
కాఫీ
కాఫీ మనకు తక్షణ శక్తిని ఇస్తుంది. అలాగే మనల్ని ఉత్సాహంగా చేస్తుంది. అయితే కాఫీలో కెఫిన్ కంటెంట్ ఉంటుంది. ఇది మన నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. అందుకే రాత్రి పడుకునే ముందు కాఫీని తాగకండి.
స్పైసీ, పుల్లని ఆహారాలు
పడుకునే ముందు స్పైసీ, పుల్లని ఆహారాలను అసలే తినకూడదంటున్నారు నిపుణులు. ఇవి శరీర ఉష్ణోగ్రతను పెంచి ఎసిడిటీకి కారణమవుతాయి. ఇది నిద్ర సమస్యలను కలిగిస్తుంది.
జంక్ ఫుడ్
జంక్ ఫుడ్ మన ఆరోగ్యానికి అసలే మంచిది కాదు. జంక్ ఫుడ్ ను రాత్రిపూట అసలే తినకూడదు. ఎందుకంటే ఇది నిద్రకు ఆటంకం కలిగిస్తుంది.
ఐస్ క్రీం
రాత్రిపూట ఐస్ క్రీం తినడం కూడా మంచిది కాదు. కానీ ఇందులోని అధిక కొవ్వు, తీపి నిద్రను దూరం చేస్తుంది.
చాక్లెట్
చాక్లెట్ మన ఆరోగ్యానికి మంచిదే అయినా.. దీనిలో నిద్రకు ఆటంకం కలిగించే 'టైరోసిన్' అనే భాగం ఉంటుంది. ఇది మనకు రాత్రి నిద్ర లేకుండా చేస్తుంది.
ప్రోటీన్
ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని కూడా రాత్రిపూట తినొద్దు. ఎందుకంటే ఇవి జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. ఇది మిమ్మల్ని నిద్రకు దూరం చేస్తుంది.
సిట్రస్ పండ్లు
నారింజ, నిమ్మకాయ వంటి సిట్రిస్ పండ్లు విటమిన్ సి కి మంచి వనరులు. కానీ వీటిని రాత్రిపూట తినకూడదు. ఎందుకంటే ఇవి రాత్రిపూట జీర్ణం కావడం చాలా కష్టం.