
వాతావరణంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎండ తీవ్రత రోజురోజుకు అధికమవడంతో వేసవి తాపం కనపడుతుంది. ఈ క్రమంలోనే ఎండ తీవ్రత అధికమవుతున్న తరుణంలో ఎక్కువగా చాలామంది డిహైడ్రేషన్ కి గురవుతూ వడదెబ్బకు గురయ్యే ప్రమాదాలు ఉన్నాయి. ఇలా డిహైడ్రేషన్ సమస్య నుంచి బయటపడాలంటే చాలామంది పానీయాలను అధికంగా సేవించాలని చెబుతారు. అయితే బయట దొరికే పానీయాల కన్నా మన ఇంట్లో సహజసిద్ధంగా తయారు చేసుకుని పానీయాలను తాగటం వల్ల డిహైడ్రేషన్ సమస్య నుంచి బయటపడటమే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. మరి ఆ సహజ పానీయాలు ఏంటి అనే విషయానికి వస్తే...
నిమ్మరసం: మంచినీటిలోకి రెండు ఐస్ ముక్కలు వేసి కొద్దిగా చక్కెర నిమ్మరసం చిటికెడు ఉప్పు కలిపి ఈ నిమ్మరసం తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా నిమ్మరసం తాగటం వల్ల డిహైడ్రేషన్ సమస్య నుంచి బయటపడటమే కాకుండా మన శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
చెరుకు రసం: వేసవికాలంలో మనకు ఆరోగ్యాన్ని కలిగించి, మనకు శక్తిని అందించే పానీయాలలో చెరుకు రసం ఒకటి. ముప్పావు లీటర్ చెరుకు రసం ఒక గిన్నెలోకి వడబోయాలి. ఈ గిన్నెలోకి మూడు చెంచాల నిమ్మరసం కొద్దిగా మిరియాల పొడి రెండు ఐస్ ముక్కలు కలుపుకొని తాగితే మనకు శక్తిని అందించడమే కాకుండా ఎలాంటి వేసవి తాపానికి గురికాకుండా ఉండేలా కాపాడుతుంది.
మసాలా మజ్జిగ: ఒక గిన్నెలో ఒక వంతు పెరుగు నాలుగు వంతుల నీటిని వేసి మజ్జిగను తయారు చేయాలి.ఇందులోకి చిన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి అల్లం తురుము తాజా కరివేపాకులు కొద్దిగా కొత్తిమీర తగినంత ఉప్పు రెండు చెంచాలు నిమ్మరసం కలుపుకుంటే ఎంతో రుచికరమైన మసాలా మజ్జిగ తయారు అయినట్లే. మసాలా మజ్జిగలో మనకు పొటాషియం, పాస్పర్, క్యాల్షియం, రైబో ఫెవిన్ విటమిన్ బి 12 చాలా పుష్కలంగా లభిస్తాయి. ఈ విధంగా ఇంట్లో సహజ సిద్ధంగా తయారు చేసుకున్న ఈ పానీయాలు మనకు డిహైడ్రేషన్ కలగకుండా చూడడమే కాకుండా ఎంతో ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది.