Hyderabad: మెంట‌ల్ హెల్త్‌ బాగుంటేనే ఆరోగ్యంగా ఉన్న‌ట్లు.. అవి కూడా అనారోగ్య స‌మ‌స్య‌లే

Published : May 09, 2026, 04:48 PM IST
Hyderabad

సారాంశం

Hyderabad: హైదరాబాద్‌లోని కామినేని హాస్పిటల్స్ ఎల్‌బీనగర్‌లో ‘మెంటల్ హెల్త్ అవేర్‌నెస్ మంత్-2026’ సందర్భంగా “More Good Days Together” పేరుతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మాన‌సిక ఆరోగ్యం గురించి ఆసక్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కామినేని హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ డా. ఎం. శారధి గౌడ్ మాట్లాడుతూ.. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం రెండూ ఒకదానితో ఒకటి విడదీయరాని సంబంధం కలిగి ఉన్నాయని చెప్పారు. ఫిజికల్‌గా ఎంత ఆరోగ్యంగా ఉన్నా, మానసిక ఆరోగ్యం సరిగా లేకపోతే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం కాదన్నారు.

యువతలో మానసిక ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్నప్పటికీ ఇంకా అనేక అపోహలు, భయాలు ప్రజలను చికిత్స తీసుకోవడం నుంచి వెనక్కి నెడుతున్నాయని తెలిపారు. చాలా మంది మానసిక సమస్యలు ఉన్నప్పటికీ సైకియాట్రిస్టులను కలవడానికి సిగ్గుపడుతున్నారని చెప్పారు.

డిప్రెషన్, ఆందోళన కూడా వైద్య సమస్యలే

మానసిక సమస్యలను బలహీనతగా, ఆత్మవిశ్వాసం లేమిగా లేదా “ఓవర్ థింకింగ్”గా చూడటం సరికాదని డా. శారధి గౌడ్ అన్నారు. డిప్రెషన్, ఆందోళన, వ్యసనాలు, ఒత్తిడి సంబంధిత సమస్యలు జీవశాస్త్ర, మానసిక, సామాజిక కారణాల వల్ల వచ్చే వైద్య సమస్యలేనని వివరించారు.

చాలామంది దీర్ఘకాలిక ఒత్తిడి, ఒంటరితనం, భావోద్వేగ అలసట వంటి సమస్యలను సహజంగా తీసుకుని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డయాబెటిస్, గుండె జబ్బుల మాదిరిగానే మానసిక సమస్యలకు కూడా వైద్య సహాయం తీసుకోవడం సాధారణంగా భావించాలని సూచించారు. సరైన సమయంలో గుర్తిస్తే కౌన్సెలింగ్, జీవనశైలి మార్పులు, అవసరమైతే మందులతో మానసిక సమస్యలను నియంత్రించవచ్చన్నారు.

సోషల్ మీడియా, AI ప్రభావం యువతపై ఎక్కువ

కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ డా. గౌతమి నాగభైరవ మాట్లాడుతూ.. ప్రస్తుతం AI, స్మార్ట్‌ఫోన్లు, సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైందని తెలిపారు. టెక్నాలజీ విద్య, వైద్యం, కమ్యూనికేషన్‌కు ఉపయోగపడుతున్నప్పటికీ మరోవైపు మానసిక ఒత్తిడిని పెంచుతోందన్నారు.

సోషల్ మీడియా పోలికలు, ఆన్‌లైన్ గుర్తింపు కోసం తపన, సైబర్ బులీయింగ్, గేమింగ్ వ్యసనం, నిద్రలేమి, ఎప్పుడూ సంతోషంగా కనిపించాలనే ఒత్తిడి యువతపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. అసాధ్యమైన జీవనశైలి, అందం ప్రమాణాలు యువతలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయని చెప్పారు.

పిల్లలు, టీనేజర్లపై ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉందన్నారు. బయట ఆటలు తగ్గడం, అధిక స్క్రీన్ టైమ్, నిద్రలేమి, ఏకాగ్రత లోపం, భావోద్వేగ నియంత్రణ తగ్గడం, చిన్న విషయాలకు అసహనం పెరగడం వంటి సమస్యలు పెరుగుతున్నాయని వెల్లడించారు.

టెక్నాలజీని సమతుల్యంగా ఉపయోగించాలి

టెక్నాలజీని పూర్తిగా తప్పుపట్టలేమని, కానీ అది మనుషుల సంబంధాలు, కుటుంబ బంధాలు, నిద్ర, వ్యాయామం, భావోద్వేగ బలాన్ని నియంత్రించడం ప్రారంభించినప్పుడు సమస్యలు వస్తాయని డా. గౌతమి పేర్కొన్నారు.

మానసిక సమస్యలకు చికిత్స ఉందని, ముందుగానే గుర్తించడం, భావోద్వేగ మద్ధతు, సైకోథెరపీ, జీవనశైలి మార్పులు, అవసరమైతే మందుల ద్వారా జీవన నాణ్యతను మెరుగుపరచవచ్చన్నారు. అందుకే ఈ మెంటల్ హెల్త్ అవేర్‌నెస్ మంత్ సందర్భంగా కేవలం అవగాహన మాత్రమే కాదు, అపోహలను తొలగించడం, టెక్నాలజీని బాధ్యతాయుతంగా ఉపయోగించడం మీద కూడా దృష్టి పెట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Fertility Crisis: ప్రమాదంలో మానవ జాతి? భవిష్యత్తులో పిల్లలు పుట్టడం కష్టమే.. ఏం జరుగుతోంది?
AC : ఎండలోంచి నేరుగా ఏసీ రూమ్‌ లోకి వెళ్తున్నారా..? ఆ చల్లదనం ఎంత డేంజరో తెలుసా..?