సందర్భాన్ని, పనులను బట్టి కూర్చోవడ, నిల్చోవడం చేస్తుంటాం. ఇది చాలా కామన్. కానీ ఎక్కువ గంటలు కూర్చోవడం కానీ, నిల్చోవడం కానీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అందుకే ఆరోగ్యంగా ఉండేందుకు ఎన్ని గంటలు కూర్చోవాలి? ఎన్ని గంటలు నిలబడాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
కూర్చోవడం, నిల్చోవడం, నడవడం మన ఆరోగ్యానికి చాలా అవసరం. ఏదేమైనా వీటి మధ్య ఖచ్చితంగా సమతుల్యత ఉండాలంటారు ఆరోగ్య నిపుణులు. అవును ఏది ఎక్కువ సేపు చేసినా ఆరోగ్యం దెబ్బతింటుంది మరి. ఆరోగ్యంగా ఉండటానికి, వ్యాధులకు దూరంగా ఉండటానికి ఎక్కువ సేపు నిలబడ్డ తర్వాత లేదా ఎక్కువ సేపు కూర్చున్న తర్వాత బ్రేక్ ఖచ్చితంగా తీసుకోవాలి. మీరు బాగా కష్టపడేవారు అయితే మీ శరీరానికి విశ్రాంతిని ఖచ్చితంగా ఇవ్వాలి. అసలు హెల్తీగా ఉండటానికి ప్రతిరోజూ ఎన్ని గంటలు కూర్చోవాలి? ఎన్ని గంటలు నిలబడాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఎంత సేపు కూర్చోవాలి?
మీరు ఎలాంటి శారీరక శ్రమ చేయకుండా రోజంతా కూర్చోవడం వల్ల మీకు టైప్ 2 డయాబెటీస్, గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అయితే రోజూ 4 గంటల కంటే తక్కువ సమయం కూర్చునే వారికి ఈ సమస్యలు తక్కువగా వస్తాయని నివేదికలు చెబుతున్నాయి.
అలాగే రోజూ 4 నుంచి 8 గంటలు కూర్చునేవారికి ఈ వ్యాధులొచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఇకపోతే 8 నుంచి 11 గంటలు లేదా అంతకంటే ఎక్కువసేపు కూర్చునే వారికి కూడా ఈ సమస్యలు వస్తాయి. శారీరకంగా చురుగ్గా ఉంటే ఈ వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
రోజుకు ఎంత సేపు నిలబడాలి
రోజుకు కనీసం 2 గంటలు నిలబడాలని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అలాగే మీరు రోజుకు 4 గంటలు నిలబడ్డా కూడా మంచిదే. అయితే 2 లేదా 4 గంటలు నిరంతరం చేయాలనికాదు. రోజులో మీకు వీలున్నప్పుడల్లా ఇన్ని గంటలు నిలబడితే సరిపోతుంది. ఒకవేళ మీకు నిలబడే టైం లేకపోతే మీ కారును ఆఫీసుకు దూరంగా పార్క్ చేసి అటునుంచి నడిచి వెళ్లండి. దీనివల్ల మీకు రోజూ కొంతసేపు నడిచే అవకాశం దొరుకుతుంది. ఫోన్ లో మాట్లాడేటప్పుడు నడవండి. అలాగే ఆఫీసులో ప్రతి అంతస్తులో వాష్ రూమ్ ఉంటే మీ డెస్క్ కు దూరంగా వాష్ రూమ్ ను ఉపయోగించడి. ఈ చిన్న చిన్న రోజువారీ అలవాట్లు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.
రోజుకు ఎంతసేపు నడవాలి?
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ సేపు నడవడం ఆరోగ్యానికి మంచిది. అలాగే మెట్లు చూసి కాకుండా కిలోమీటర్లను చూసి నడవాలని కొందరు నిపుణులు చెబుతున్నారు. మీరు ప్రతిరోజూ ఒక కిలోమీటరు నడవడానికి ప్రయత్నిస్తే మీ ఆరోగ్యానికి ఏ డోకా ఉండదు.