
ఎండాకాలంలో తాజా పండ్లను ఖచ్చితంగా తినాలి. ముఖ్యంగా పుచ్చకాయను. అవును పుచ్చకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని తింటే మన శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. అలాగే దీనిలోని పోషకాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. పుచ్చకాయను తింటే రీఫ్రెష్ గా కూడా ఉంటాం. ఏదేమైనా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అతిగా మాత్రం తినకండి. బ్రేక్ ఫాస్ట్ లేదా భోజనాల మధ్య ఈ పండును తినండి. అలాగే దీనిని మీరు ఉదయాన్నే తినొచ్చు. కానీ రాత్రిపూట మాత్రం అస్సలు తినకూడదు. దీనివల్ల మీ కడుపు దెబ్బతింటుంది. మరి ఈ ఎండాకాలంలో పుచ్చకాయను తింటే ఎలాంటి ప్రయోజనాలను పొందుతామో ఇప్పుడు తెలుసుకుందాం..
రోగనిరోధక శక్తి పెరుగుతుంది
పుచ్చకాయలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ పవర్ ను బాగా పెంచుతుంది. కణాల నిర్మాణం, గాయం త్వరగా నయమయ్యేందుకు కొల్లాజెన్ ఉత్పత్తి చేయడానికి మన శరీరానికి సహాయపడుతుంది. పుచ్చకాయలోని విటమిన్ ఎ, బీటా కెరోటిన్ స్థాయిలు జుట్టును, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది
పుచ్చకాయ తీయగా ఉంటుంది. అయితే దీనిలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందని చాలా మంది అనుకుంటారు. 100 గ్రాముల పుచ్చకాయలో 6.2 గ్రాముల చక్కెర మాత్రమే ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పుచ్చకాయలో ఎక్కువగా ఉండే వాటర్ కంటెంట్, ఫైబర్ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచడానికి సహాయపడతాయి. అందుకే వీటిని తింటే భోజనం మధ్య ఆకలిగా ఉండదు. కొద్దిగా తిన్నా ఎంతో ఆకలి తగ్గుతుంది. దీనిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే దీన్ని తిన్నా మీరు బరువు పెరిగిపోతామన్న భయం అక్కర్లేదు. నిజానికి పుచ్చకాయ ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది.
గుండె ఆరోగ్యంగా ఉంటుంది
పుచ్చకాయలో ఉండే ఎన్నో పోషకాలు గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. పుచ్చకాయలో ఉండే లైకోపీన్ కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే అధిక రక్తపోటును నియంత్రిస్తుందని ఎన్నో అధ్యయనాలు కనుగొన్నాయి. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం వల్ల ఆక్సీకరణ నష్టం జరుగుతుంది. దీన్ని నివారించడానికి పుచ్చకాయ సహాయపడుతుంది. పుచ్చకాయలో ఉండే సిట్రులినన్ అనే అమైనో ఆమ్లం నైట్రిక్ ఆక్సైడ్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మీ రక్తపోటు ఉన్నపాటుగా పెరగకుండా చూస్తుంది.
కళ్లకు మంచిది
లైకోపీన్ కంటిచూపునకు చాలా మంచిది. పలు పరిశోధనల ప్రకారం.. లైకోపీన్ లో యాంటీ ఆక్సిడెంట్, శోథ నిరోధక లక్షణాలు ఉంటాయి. ఇవి వయస్సు సంబంధిత మాక్యులర్ క్షీణతను నివారించడానికి సహాయపడుతుంది.
చిగుళ్లను రక్షిస్తుంది
పుచ్చకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మీ చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే ఫలకం ఏర్పడటాన్ని నెమ్మదింపజేస్తుంది. కాబట్టి పుచ్చకాయలను తింటే మీ చిగుళ్లు బలంగా మారతాయి. ఇది బ్యాక్టీరియా దాడి నుంచి మీ చిగుళ్ల కణజాలాలను రక్షిస్తుంది. అలాగే మీ దంతాలు తెల్లగా ఉండేందుకు, పెదాలు పొడిబారకుండా లేదా పగిలలిపోకుండా నిరోధిస్తుంది.