శారీరకంగా దృఢంగా ఉంటే ఎలాంటి సమస్యలు రావని అనుకుంటాం. ఇందులో కొంతవరకు నిజమే ఉన్నా.. శారీరక ఆరోగ్యం ఒక్కటే మనల్ని కాపాడలేదని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు ఉదాహారణే ఇటీవల జిమ్ముల్లో ఉన్నట్టుండి కుప్పకూలుతున్నవారు.
ప్రస్తుతం చాలా మంది ఫిట్ నెస్ పట్ల ఆకర్షితులవుతున్నారు. సెలబ్రిటీలే కాదు సామాన్య జనాలు కూడా జిమ్ముల్లో చెమటలు చిందిస్తున్నారు. జిమ్ముల్లో టైం స్పెండ్ చేస్తూ శరీరాన్ని బలంగా చేసుకుంటారు. కండరాలను కూడా పెంచేస్తున్నారు. ఏదేమైనా ఎక్సర్ సైజెస్ వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. బాడీ యాక్టీవ్ గా ఉంటుంది. దీనివల్ల మరెన్నో లాభాలు ఉన్నాయి. అయితే చాలా మంది వ్యాయామం చేస్తే ఎలాంటి రోగోలు రావని అనుకుంటారు. కానీ దీనిలో పూర్తిగా వాస్తవం లేదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
వర్కౌట్స్ సమయంలో సెలబ్రిటీల్లో పెరుగుతున్న హార్ట్ ఎటాక్ కేసులు
ఈ మధ్యకాలంలో చనిపోయిన చాలా మంది సెలబ్రిటీలు జిమ్ముల్లోనే ఉన్నారు. లేదా శరీరకంగా దృఢంగా కనిపించారు కూడా. అందులో సిద్ధార్థ్ శుక్లా, సిద్దంత్ వీర్ సూర్యవంశీ, అమిత్ మిస్త్రీ వంటి యువ నటుల అకాల మరణం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. వీళ్లు చాలా ఫిట్ గా ఉన్నారని చాలా మంది అన్నారు. అందులోనూ వీళ్లు క్రమం తప్పకుండా జిమ్ లకు వెళ్లడం, వర్కవుట్లు చేయడం, మంచి, శుభ్రమైన ఆహారం తీసుకున్నారు. ఇకపోతే రీసెంట్ గా సుస్మితా సేన్ హార్ట్ ఎటాక్ నుంచి బయటపడ్డారు. దీంతో మళ్లీ ఆమె తెరపై చాలా ఫిట్ గా కనిపిస్తుందని అనుకున్నారు. ఇంత ఫిట్ గా ఉన్నా గుండెపోటు ఎందుకు వస్తుంది? అసలు తప్పు ఎక్కడ జరుగుతుందని చాలా మందికి అనుమానాలు వస్తున్నాయి.
శారీరక, మానసిక ఆరోగ్యం బాగుండే స్థితినే ఫిట్ నెస్ అంటారు. ఇది శరీర కూర్పు, జీవ విధులను కలిగి ఉంటుంది. జస్ట్ శారీరక ఆరోగ్యం ఒక్కటి బాగుంటేనే మనం ఫిట్ గా ఉన్నట్టు కాదంటున్నారు నిపుణులు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఫిట్నెస్ లో ఈ అంశాలు కూడా ఉండాలి.
నిద్ర
ఈ రోజుల్లో నిద్రలేమి సర్వ సాధారణం అయిపోయింది. చాలా మంది శరీరానికి కావాల్సినంత విశ్రాంతిని ఇవ్వరు. వయోజనులు రోజుకు 7-8 గంటల నిద్ర పోవాలి. తక్కువ నిద్ర మొదట్లో బద్ధకంగా అనిపించొచ్చు. కానీ క్రమం తప్పకుండా సరిగ్గా నిద్రపోకుంటే ఎన్నో సమస్యలు వస్తాయి. మన శరీరం ఒత్తిడి హార్మోన్లను నియంత్రించడానికి నిద్ర చాలా అవసరం ఉంది. సరిగ్గా నిద్రపోకుంటే గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.
ఆహారం
ఆహారంతోనే మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. కానీ నేడు చాలా మంది పోషకాలు లేని ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ లనే ఎక్కువగా తింటున్నారు. అందులోనూ ఎవరి వారే ఇది మంచి ఆహారం అని డిసైడ్ చేసుకుని డాక్టర్ ను సంప్రదించకుండా ప్రత్యేక డైట్ ను ఫాలో అవుతున్నారు. సెలబ్రిటీలు ఇలాంటి డైట్ ను ఫాలో అవుతున్నారంటే.. దాన్ని చూసి సామాన్య జనాలు ఫాలో అవుతున్నారు. నిజానికి ప్రతి ఒక్కరికీ ఒకేవిధమైన డైట్ సరైంది కాకపోవచ్చు. దీనివల్ల పోషక లోపంతో పాటుగా ఎన్నో సమస్యలు కూడా రావొచ్చు. ఇది కూడా గుండెను రిస్క్ లో పడేస్తుంది.
వ్యాయామం
ఫిట్ నెస్ అంటే కేవలం జిమ్ సెషన్స్ కు వెళ్లడం మాత్రమే కాదు. ఫిట్ నెస్ అంటే శరీరానికి సరైన శిక్షణ ఇవ్వడం..అతిగా శిక్షణ ఇవ్వడం కాదని అర్థం చేసుకోవాలి. ప్రతి వ్యాయామ సెషన్ లో రెస్ట్ టైం ఉంటుంది. ఇది శరీరంలోని కండరాలకు రెస్ట్ ను ఇవ్వడానికి, తర్వాతి రౌండ్ వ్యాయామాలను ప్రారంభించడానికి మనల్ని సిద్దం చేస్తుంది. శరీరానికి తగినంత రెస్ట్ ను ఇవ్వకపోవడం, పదేపదే శ్రమించడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.
మందులు
ఫిట్నెస్ కు సహాయపడే ఓవర్ ది కౌంటర్ మందులను వేసుకోవడం ఫిట్నెస్ కాదు. ఇలాంటి మందులు సులభంగా లభిస్తాయి. చాలాసార్లు దీనికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు. మీ శరీరాన్ని ప్రభావితం చేసే మందులు, స్టెరాయిడ్లు తీసుకోవడం మానుకోండి.