
ఉదయం లేవగానే టీ లేదా కాఫీని పక్కాగా తాగాల్సిందే. అంతేకాదు ఎక్కువ సేపు ఖాళీగా ఉన్నా.. ఇంటికి గెస్ట్ లు వచ్చినా.. సాయంత్రం అయినా.. ఫ్రెండ్స్ తో అలా బయటకు వెళ్లినా.. టీ, కాఫీలను పక్కాగా తాగుతుంటాం. నిజానికి వీటిలో ఉండె కెఫిన్ ఆరోగ్యానికి మంచే చేస్తుంది. అది కూడా దీన్ని తక్కువగా తీసుకున్నప్పుడు మాత్రమే. టీస్టీగా ఉందనో.. వీటిని తాగకుండా ఉండలేననో కెఫిన్ ను ఎక్కువగా తీసుకుంటే మాత్రం ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేయాల్సి ఉంటుంది. కెఫిన్ మీకు తక్షణ శక్తిని ఇస్తుంది. మిమ్మల్ని మరింత చురుగ్గా ఉంచుతుంది. కానీ దీనిని ఎక్కువగా తీసుకుంటే మాత్రం శారీరక సమస్యలే కాదు మానసిక సమస్యలు కూడా వస్తాయి. ఒకవేళ మీరు టీ, కాఫీలను మానేయాలనుకున్నా.. ఎలా మానేయాలో తెలియకపోతే ఈ చిట్కాలను ఫాలో అవ్వండి. ఈ వ్యసనం నుంచి తొందరగా బయటపడతారు.
హెర్బల్ టీ ని ప్రయత్నించండి
మూలికా టీ లు కెఫిన్ టీ లకు గొప్ప ప్రత్యామ్నాయాలు. ఇవి ఎన్నో రకాల రుచులలో ఉంటాయి. హెర్బల్ టీ లను వేడిగా లేదా చల్లగా కూడా తాగొచ్చు. హెర్బల్ టీలు కేవలం రుచికరంగా ఉండటమే కాదు ఇవి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటాయి. చామంతి టీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతుంది. అల్లం టీ జీర్ణక్రియకు చాలా మంచిది.
కంటినిండా నిద్ర
మన శరీరానికి నిద్ర చాలా చాలా అవసరం. ఎన్ని పనులున్నా కంటి నిండా నిద్రపోతేనే మీరు తిరిగి ఎనర్జిటిక్ గా, ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. మీకు తెలుసా కాఫీ, టీ లను ఎక్కువగా తాగితే మీరు సరిగ్గా నిద్రపోలేరు. ఎందుకంటే కెఫిన్ నిద్రకు భంగం కలిగిస్తుంది. కాఫీ లేదా టీకి మీ వ్యసనాన్ని వదిలించుకోవాలనుకుంటే తగినంత నిద్రపోండి. నిద్ర మిమ్మల్ని రోజంతా శక్తివంతంగా ఉంచుతుంది. నిద్ర టీ లేదా కాఫీ కోసం మీ కోరికను నియంత్రించడానికి సహాయపడుతుంది.
ప్రత్యామ్నాయ పానీయాలు
కెఫిన్ లేకుండా ఉండే పానీయాలు చాలానే ఉంటాయి. హాట్ చాక్లెట్, ఆపిల్ సైడర్ వెనిగర్, మసాలా చాయ్ అన్నీ కెఫిన్ కు గొప్ప ప్రత్యామ్నాయ పానీయాలు. వీటిని ఆరోగ్యకరమైన పదార్ధాలతో ఇంట్లోనే సులువుగా తయారు చేయొచ్చు. వీటిని షాపుల్లో కొంటే వాటిలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. వీటికి కృత్రిమ రుచులను కూడా కలుపుతారు. ఇవి ఆరోగ్యానికి మంచివి కావు.
పోషకాహారం
మనల్ని అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంచడానికి పోషకాహారం ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే మీరు తినే ప్రతి భోజనంలో ముఖ్యమైన పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఇవి మీ శక్తి స్థాయిలను పెంచుతాయి. అలాగే కెఫిన్ లేదా టీ వినియోగాన్ని నివారించడానికి కూడా సహాయపడుతుంది.
టీ, కాఫీ వ్యసనం నుంచి ఎలా బయటపడాలి?
టీ, కాఫీ వ్యసనం నుంచి పూర్తిగా బయటపడటం అనుకున్నంత ఈజీ కాదు. కానీ మీరు ఖచ్చితంగా ప్రయత్నిస్తే మాత్రం అవుతుంది. రోజూ కొంచెం కొంచెం తగ్గించండి. అలాగే టీ, కాఫీని ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలతో భర్తీ చేయండి. ఒత్తిడిని తగ్గించడానికి, శక్తి స్థాయిలను పెంచడానికి ఇతర మార్గాలను ప్రయత్నించండి. కెఫిన్ ను ఎక్కువగా తీసుకుంటే హృదయ స్పందన రేటు పెరుగుతుంది. ఆందోళన, ఒత్తిడి, నిద్రపోవడంలో ఇబ్బంది వంటి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే కెఫిన్ ను పరిమితిలోనే తీసుకోవడానికి ప్రయత్నించండి.