
ఆరోగ్యంగా ఉండడానికి, కేలరీలు ఖర్చు చేయడానికి, చురుగ్గా ఉండటానికి సులభమైన, ప్రభావవంతమైన వ్యాయామం వాకింగ్. దీనికి ఎలాంటి పరికరాలు అవసరం లేదు. ఎక్కడైనా చేయవచ్చు. ఎప్పుడైనా చేయవచ్చు. కానీ మంచి ఫలితాలు చూడాలంటే మాత్రం రోజుకి ఎంత దూరం నడవాలో ఇక్కడ తెలుసుకుందాం.
ఆరోగ్య నిపుణులు సాధారణంగా రోజుకి 10,000 అడుగులు నడవాలని చెబుతుంటారు. 10 వేల అడుగులంటే సుమారు 8 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అయితే, 5,000 నుంచి 7,000 అడుగులు కూడా మీ ఆరోగ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాయి. వారానికి ఐదు రోజులు.. రోజుకు కనీసం 30 నిమిషాలు నడవడం వల్ల గుండె జబ్బులు, డయాబెటిస్, ఊబకాయం వంటి వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
మీ బరువు, వేగాన్ని బట్టి.. నడక మైలుకు 80-100 కేలరీలు ఖర్చు చేస్తుంది. 70 కిలోల బరువున్న వ్యక్తి 30 నిమిషాల వేగవంతమైన నడకలో దాదాపు 150 కేలరీలు ఖర్చు చేస్తాడు. మీ వేగాన్ని పెంచడం, ఎత్తుపైకి నడవడం లేదా తేలికపాటి బరువులు మోయడం వల్ల కేలరీలను మరింత ఎక్కువగా ఖర్చు చేయవచ్చు.
రోజూ నడవడం వల్ల మీ ఆరోగ్యం, మానసిక స్థితి మారుతుంది. చిన్నగా వాకింగ్ ప్రారంభించి క్రమంగా మీ సమయాన్ని, వేగాన్ని పెంచండి.