
క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి. దీనిలో అసాధారణ కణాలు నియంత్రణ లేకుండా పెరిగిపోతాయి. ప్రపంచ వ్యాప్తంగా చనిపోతున్నవారిలో క్యాన్సర్ రోగులే ఎక్కువ మంది ఉన్నారని సర్వేలు వెల్లడిస్తున్నారు. 2020 భారత గణాంకాల ప్రకారం.. 27 లక్షల మందికి క్యాన్సర్ నిర్దారణ అయ్యింది. 8.5 లక్షల మంది క్యాన్సర్ సంబంధిత సమస్యలతో చనిపోయారు.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పేలవమైన జీవన శైలి అలవాట్లు శరీర కణాలను ప్రభావితం చేస్తాయి. ఇవి క్యాన్సర్ కు గురవుతాయని ఎన్నో పరిశోధనలు వెల్లడించాయి. అయితే ఆరోగ్యకరమైన అలవాట్లను కలిగి ఉండి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, కంటి నిండా నిద్రపోవడం వంటి జీవన శైలి మార్పులు క్యాన్సర్ ముప్పును తగ్గిస్తాయి. క్యాన్సర్ బారిన పడకూడదంటే మీరు ముందుకు చేయాల్సిన మొదటి పని పోగాకుకు దూరంగా ఉండటం. స్మోకింగ్ ఊపిరితిత్తుల క్యాన్సర్ కు ప్రధాన కారణం. ఇది మూత్రాశయం, మూత్రపిండాలు, గొంతు క్యాన్సర్ తో పాటుగా ఇతర క్యాన్సర్లకు కూడా దారితీస్తుంది. అసలు క్యాన్సర్ రిస్క్ ను తగ్గించుకోవాలంటే జీవన శైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలంటే..
రోగనిరోధక శక్తిని పెంచాలి
క్యాన్సర్ కు ఖచ్చితమైన కారణం ఏంటో తెలియదు. కానీ క్యాన్సర్ కణాలు లేదా కణితుల పెరుగుదల మనలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్లే జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే రోగనిరోధక వ్యవస్థ ఎప్పుడూ బలంగా ఉండేలా చూడండి.
ఆరోగ్యకరమైన బరువు
బరువు సర్వ రోగాలకు దారితీస్తుంది. అయితే ఆహారం, వ్యాయామం ద్వారా బరువును కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. స్థూలకాయం వల్ల రొమ్ము, పెద్దపేగు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వంటి ఎన్నో రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
ఆరోగ్యకరమైన ఆహారం
పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్, తృణధాన్యాలు ఎక్కువగా ఉండే ఆహారంలో మన శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన బరువును కంట్రోల్ లో ఉంచుతాయి. అలాగే క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తాయి. ఈ ఆహారాల్లో యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు ఉంటాయి. ఇవి క్యాన్సర్ ను కలిగించే పదార్థాల నుంచి మన శరీరాన్ని రక్షిస్తాయి. ఆల్కహాల్ ను తాగడం తగ్గించడం లేదా పూర్తిగా మానేసినా మీకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
టెస్టులు, స్క్రీనింగ్ లు
లైఫ్ స్టైల్ లో మార్పులతో పాటుగా క్రమం తప్పకుండా క్యాన్సర్ స్క్రీనింగ్లు, పరీక్షలు తప్పనిసరి. అలాగే కొన్ని లైంగిక సంక్రమణ అంటువ్యాధులు రాకుండా ఉండేందుకు టీకాలు తీసుకోవాలి. అలాగే క్రమం తప్పకుండా శారీరక శ్రమ కార్యకలాపాల్లో పాల్గొనాలి. అయితే వీటివల్ల క్యాన్సర్ ముప్పు పూర్తిగా తగ్గుతుందని హామీని ఇవ్వలేనప్పటికీ.. ఇవి కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదాన్ని చాలా తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆరోగ్యకరమైన అలవాట్లు ఎన్నో రోగాలను దూరం చేస్తాయి.