
ముఖం అందంగా ఉండాలని ఆడవాళ్లు ఎక్కువగా చర్మ సంరక్షణపైనే ఎక్కువ దృష్టి పెడతారు. దీనివల్లే అందంగా ఉంటారని అనుకుంటారు. కానీ మీ చర్మం అందంగా మెరవాలంటే మాత్రం తినే ఫుడ్ పై కూడా శ్రద్ధ పెట్టాలంటారు నిపుణులు. శరీరంలో హార్మోన్ల అసమతుల్యత, ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడం, ఒత్తిడి, శరీరంలో పోషకాలు లోపించడం, సరైన చర్మ సంరక్షణ లేకపోవడం వంటి వివిధ కారణాల వల్ల మీ ముఖం డల్ గా కనిపిస్తుంది.
మీకు తెలుసా? మనం ఏది తిన్నా.. అది మన శరీర పనితీరుపైనే కాకుండా మన చర్మంపై కూడా ప్రభావం చూపుతుంది. అనారోగ్యకరమైన ఆహారాలను తినేవారి, పొట్ట శుభ్రంగా లేనివారి ముఖం నీరసంగా ఉంటుంది. ఎప్పుడూ పాలిపోయి ఉంటుంది.
అయితే కొన్ని రకాల పానీయాలు మాత్రం మీ ముఖాన్ని అందంగా చేయడానికి బాగా సహాయపడతాయి. నిపుణుల ప్రకారం.. మీరు ప్రతిరోజూ ఉదయాన్నే పరిగడుపున కొన్ని డ్రింక్స్ ను తాగితే మీరు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా.. మీ చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మీ ముఖం అందంగా మెరిసిపోతుంది. ఇందుకోసం వేటిని తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
కలబంద రసం
కలబంద రసం మన చర్మానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ -సి పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే దెబ్బతిన్న చర్మాన్ని మరమ్మత్తు చేస్తాయి. వృద్ధాప్య సంకేతాలను తగ్గించడానికి సహాయపడతాయి.
ముఖ్యంగా చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. కలబంద రసం మన చర్మాన్ని లోపలి నుంచి హైడ్రేట్ గా ఉంచుతుంది. అలాగే మన చర్మానికి లోపలి నుంచి పోషణను అందిస్తుంది. ఈ జ్యూస్ ను ఉదయాన్నే పరిగడుపున తాగితే మీ స్కిన్ సాఫ్ట్ గా అవుతుంది. అలాగే పిగ్మెంటేషన్ తగ్గుతుంది. రోజూ ఉదయాన్నే సుమారు 15 మి.లీ. ఒక గ్లాసు నీటిలో కలబంద రసం కలుపుకుని తాగాలి.
సబ్జా, ఆలివ్ విత్తనాల వాటర్
సబ్జా గింజల్లో ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటే.. ఆలివ్ విత్తనాల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్-ఇ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అలాగే వీటిలో యాంటీ ఏజింగ్ లక్షణాలు కూడా ఉంటాయి. అందుకే ఈ వాటర్ ను తాగితే మీ చర్మం ఆరోగ్యంగా మెరిసిపోతుంది. ఇందుకోసం ఈ రెండు విత్తనాలను 1 గ్లాసు నీటిలో అర టీస్పూన్ చొప్పున వేసి తాగాలి.
పచ్చి పసుపు నీళ్లు
పచ్చి పసుపు నీళ్లను తాగితే మీ శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా అందుతాయి. అలాగే ఆక్సీకరణ ఒత్తిడిని కూడా తగ్గుతుంది. ఇది మీ శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది. అలాగే మంటను తగ్గిస్తుంది. ముఖ్యంగా ఇది మీ ముఖాన్ని మెరిసేలా చేయడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
అవిసె గింజల వాటర్
అవిసె గింజల వాటర్ కూడా మీ ముఖాన్ని అందంగా మెరిసేలా చేయడానికి సహాయపడుతుంది. ఈ గింజల్లో ఫైబర్, లిగ్నన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-ఇ లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ పోషకాలన్నీ మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ప్రకాశవంతంగా చేయడానికి బాగా సహాయపడతాయి. ఇందుకోసం ఒక గ్లాసు నీళ్లను తీసుకుని అందులో ఒక టీ స్పూన్ వేయించిన, గ్రైండ్ చేసిన అవిసె గింజలను మిక్స్ చేసి తాగండి.