
ఎన్ని రకాల ట్రెండీ దుస్తులు మార్కెట్లోకి వచ్చినా.. అవన్నీ చీర తర్వాతే. చీరకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. రోజూ డ్రెస్సులు వేసుకొని, ఏదైనా పండగకో, పెళ్లికో చీర కట్టుకంటే చాలా అందంగా కనిపిస్తాం. ఇక నార్మల్ చీర కంటే పట్టుచీరకు మరి కాస్త క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉన్నా, పెళ్లి కి వెళ్లాలన్నా కచ్చితంగా పట్టుచీర కట్టుకోవాల్సిందే. కానీ ఒక్కోసారి పొరపాటున ఈ చీరలపై మరకలు పడుతూ ఉంటాయి. వేల రూపాయలు ఖర్చు చేసి కొన్న పట్టుచీర మీద మరకలు పడితే ఎవరికైనా బాధగానే ఉంటుంది. ఆ మరకలు వదలడం అంత ఈజీ కాదు. నార్మల్ గా అన్ని దుస్తులు ఉతికినట్లు.. సబ్బు తో రుద్ది, వాషింగ్ మెషిన్ లో వేసి ఉతకలేం. మరి, ఆ మరకలను ఎలా తొలగించాలి అని ఆలోచిస్తున్నారా? దాని కోసం కొన్ని సింపుల్ చిట్కాలు ఉన్నాయి. వాటిని ఫాలో అయితే.. ఎలాంటి మరకలు అయినా తొలగిపోవాల్సిందే.
చల్లటి నీటిని వాడండి: వేడి లేదా గోరువెచ్చని నీటికి బదులుగా చల్లటి నీటిలో పట్టు చీరలను ఉతకడం ముఖ్యం. వేడి నీటితో పట్టుచీరలను ఉతికితే అవి పాడైపోతాయి. చీర మెరుపు కూడా తగ్గే అవకాశం ఉంది. అందుకే, వేడి నీరు వాడకూడదు. చల్లటి నీరు మృదువుగా ఉంటుంది. చీర రంగు పోవడం, మెరుపు పోవడం లాంటి సమస్య ఉండదు.
తేలికపాటి సబ్బు: పట్టు చీరను ఏ సబ్బు పడితే ఆ సబ్బుతో ఉతకకూడదు.స్పెషల్ గా ఈ పట్టుచీరలు మాత్రమే ఉతికే సబ్బులు మార్కెట్లో ఉంటాయి. మీరు వాటిని వాడొచ్చు. అలా కాకుండా కఠినమైన సబ్బులు వాడితే..చీరలోని పట్టు డ్యామేజ్ అవుతుంది. చీర రంగు కూడా పోయి, కళ తగ్గుతుంది. అందుకే మనం రోజువారీ లాండ్రీకి ఉపయోగించే సబ్బును పట్టు చీరలపై ఉపయోగించకూడదు. సబ్బును ఎలాంటి వస్త్రాలకు ఉపయోగించాలి అని దాని లేబుల్ మీద రాసి ఉంటుంది. అలాంటి వాటిని చూసుకొని మాత్రమే వాడాలి.
చేతులతో సున్నితంగా ఉతకాలి: పట్టు చీరలను వాషింగ్ మెషీన్‌లో కాకుండా చేతితో ఉతకాలి. బకెట్ ని చల్లటి నీటితో నింపి పట్టు వస్త్రాలను ఉతకడానికి వాషింగ్ లిక్విడ్ వేయండి. చీరను కొంతసేపు నానబెట్టండి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇతర దుస్తులు పిండినట్లు.. పట్టు చీరలను పిండకూడదు. ముడతలు పడతాయి.
గాలిలో ఆరబెట్టండి: పట్టు చీరలను గాలిలో ఆరబెట్టడం ఎల్లప్పుడూ ఉత్తమం. హీటర్ లేదా స్టీమర్‌ను ఉపయోగించవద్దు. ప్రత్యక్ష సూర్యకాంతికి దూరంగా నీడ ఉన్న ప్రదేశంలో పట్టు చీరను వేలాడదీయండి. చీరను ఆరబెట్టే ముందు నీటిని పిండవద్దు. ఇది చీరను దెబ్బతీస్తుంది. చీర ఆరిన తర్వాత, చీర నుండి ముడతలను తొలగించడానికి మీరు దానిని తక్కువ వేడి మీద ఇస్త్రీ చేయవచ్చు.
మీ పట్టు చీరపై ఏదైనా నూనె మరక పడినట్లయితే.. తర్వాత శుభ్రం చేద్దాం అని పక్కన పెట్టేయకూడదు. వెంటనే నీటితో తడిపిన కాటన్ వస్త్రంతో నూనె మరకలు ఉన్న ప్రదేశంలో తుడవాలి. మీ వద్ద కాటన్ వస్త్రం లేకపోతే, ఆ ప్రాంతాన్ని టిష్యూ పేపర్‌తో తుడవండి. నొక్కి రుద్దడం వల్ల మరక ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా ఉంటుంది.
ఆ తర్వాత, ఆ ప్రదేశంలో టాల్కమ్ పౌడర్ చల్లి, మరక ఉన్న ప్రాంతాన్ని నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల చీరపై పేరుకుపోయిన నూనె, మురికి అంతా తొలగిపోతుంది. వేడి నీటితో కడగడం వల్ల మరక పోదు. చల్లటి నీటితోనే మాత్రమే శుభ్రం చేయాలి.
నూనె లేని మరకలను సబ్బు ద్రావణంతో తొలగించవచ్చు. దీని కోసం, కఠినమైన సబ్బుకు బదులుగా తేలికపాటి లిక్విడ్ సోప్ వాడితే సరిపోతుంది. ఈ లిక్విడ్ సోప్ ని చల్లటి నీటిలో కరిగించి...అందులో శుభ్రైన కాటన్ వస్త్రాన్ని ఉంచాలి. ఆ వస్త్రంతో మరకలు పడిన చోట సున్నితంగా రుద్దితే సరిపోతుంది. తర్వాత నీటితో శుభ్రం చేస్తే సోప్ వల్ల వచ్చే నురగ కూడా పోతుంది. అంతే.. చీర పాడవ్వకుండా మరకలన్నీతొలగిపోతాయి.