నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతూనే ఉన్నాయి. కానీ ఈ ధరల పెరుగుదల వల్ల సామాన్యుడికి బతకడమే కష్టంగా మారిపోయింది. పెరిగిపోతున్న ధరల వల్ల ఎంత పొదుపు చేసినా అది అస్సలు సరిపోదు.
ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ ధరలు ఎంతలా పెరిగిపోతున్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ముందే ఇది వర్షకాలం, రాబోయేది చలికాలం, ఈ రెండు సీజన్లలో గ్యాస్ సిలిండర్ చాలా తొందరగా అయిపోతుంటుంది. ఎందుకంటే ఈ రెండు సీజన్లలో చాలా మంది వేడివేడిగా అప్పుడే వండుకుని తింటుంటారు.
దీనివల్లే రెండు మూడు నెలలు రావాల్సిన గ్యాస్ కేవలం ఒక నెల మాత్రమే వస్తుంది. అయితే మీరు కొన్ని చిట్కాలను పాటిస్తే మాత్రం ఖచ్చితంగా గ్యాస్ రెండు నెలలు వస్తుంది. ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
సాధారణంగా ఆడవాళ్లు గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు రావడానికి ఎన్నో పద్దతలును ఉపయోగిస్తుంటారు. అంటే పప్పు, బియ్యాన్ని ముందుగానే నానబెట్టి వంట చేయడం వంటివి. అయితే ఇలా చేసినా ఒక నెల మాత్రమే గ్యాస్ వస్తుందని చెప్పేవారు చాలా మందే ఉన్నారు.
వర్షాకాలంలో గ్యాస్ ఎక్కువ రోజులు రావాలంటే ఏం చేయాలి?
నానబెట్టి ఉడికించాలి:
పప్పులు, ధాన్యాలు ఉడకడానికి చాలా సమయం పడుతుంది. అందుకే వీటికి గ్యాస్ ఎక్కువగా అయిపోతుంది. కాబట్టి మీరు బియ్యం, పప్పును వంటడానికి ఒక గంట ముందే కడిగి నానబెట్టండి. ఇది గ్యాస్ ను ఆదా చేస్తుంది.
గ్యాస్ బర్నర్ ను శుభ్రంగా ఉంచండి:
గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు రావాలంటే మీరు ఎప్పుడూ గ్యాస్ బర్నర్ ను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇందుకోసం మీరు గ్యాస్ బర్నర్ ను 3 నెలలకు ఒకసారైనా సర్వీసింగ్ చేయాలి.
మీ గ్యాస్ బర్నర్ శుభ్రంగా ఉందా? లేదా అని తెలుసుకోవాడానికి మంటల రంగును బట్టి కూడా తెలుసుకోవచ్చు. అంటే గ్యాస్ స్టవ్ మంట రంగు పసుపు, నారింజ లేదా ఎరుపు రంగులో ఉంటే మీ బర్నర్ శుభ్రంగా లేదని అర్థం. ఇలాంటప్పుడు వెంటనే సర్వీస్ చేయించండి. ఇది మీ గ్యాస్ ను ఆదా చేస్తుంది.
కుక్కర్ ఉపయోగించండి:
గ్యాస్ ఎక్కువ రోజులు రావాలంటే వంట గిన్నెలకు బదులుగా కుక్కర్ ను ఉపయోగించండి. దీంతో అన్నం, పప్పు, కూరగాయలు త్వరగా ఉడికిపోతాయి. దీనికి ఎక్కువ సమయం పట్టదు. వంట త్వరగా పూర్తవుతుంది.
వంట పాత్రలను తడిగా ఉంచకూడదు:
సాధారణంగా మనలో ప్రతి ఒక్కరూ కడిగిన పాత్రలను నేరుగా పొయ్యిమీద పెట్టేస్తుంటారు. కానీ తడి వల్ల గిన్నెలు తొందరగా వేడెక్కవు. ఇందుకోసం గ్యాస్ ఎక్కువ అవసరమవుతుంది. కాబట్టి కడిగిన పాత్రలను ఒక గుడ్డతో తుచిడి ఆరబెట్టిన తర్వాత గ్యాస్ పై పెట్టండి. ఇది చాలా చిన్న చిట్కానే అయినా గ్యాస్ ను ఎక్కువగా ఆదా చేస్తుంది.
ఈ తప్పు చేయకండి!
చాలా మంది ఫ్రిజ్ లోంచి తెచ్చిన ఆహారాలను నేరుగా గ్యాస్ పై పెట్టేస్తుంటారు. కానీ ఫ్రిజ్ లో ఉన్నవి చాలా చల్లగా అయిపోతాయి. దీన్ని వేడి చేయడానికి గ్యాస్ ఎక్కువగా అవసరమవుతుంది. కాబట్టి మీరు ఏదైనా ఫ్రిజ్ లోంచి తీసింది పొయ్యిపై పెట్టాలనుకుంటే దానికి గది ఉష్ణోగ్రత వల్ల ఒక గంట పాటు పెట్టండి. .
అలాగే కొంతమంది ప్రతిదీ తక్కువ మంటపై వండుతుంటారు., కానీ వర్షాకాలంలో, చలికాలంలో ఇలా వంట చేయకూడదు. ఎందుకంటే ఈ సీజన్ లో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. కాబట్టి వంట చేయడానికి చాలా టైం పడుతుంది. దీంతో గ్యాస్ వృథా అవుతుంది.