
ఈ రోజుల్లో చాలా మంది హెయిర్ ఫాల్, చుండ్రు, డ్రై హెయిర్ వంటి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటిని తగ్గించుకునేందుకు రకరకాల హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ను కూడా పెడుతుంటారు. కానీ మనం రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలతో కూడా జుట్టు సమస్యలను పరిష్కరించుకోవచ్చు.
ముఖ్యంగా మెంతులు, మందార పువ్వు, ఉసిరి కాయను చేసిన నూనెతో జుట్టు సమస్యలు తగ్గిపోతాయి. ఈ నూనె మన జుట్టును స్ట్రాంగ్ గా ఉంచుతుంది. అలాగే జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అలాగే జుట్టు పొడుగ్గా పెరగడానికి సహాయపడుతుంది.
మెంతులు జుట్టుకు చేసే మేలు
మెంతులు హెయిర్ ఫాల్, చుండ్రును తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. మెంతుల్లో లెసిథిన్, ప్రోటీన్, నికోటినిక్ ఆమ్లాలు మెండుగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలంగా చేయడానికి సహాయపడతాయి. అలాగే నెత్తిమీద కొత్త జుట్టు రావడానికి సహాయపడుతుంది. అంతేకాదు నెత్తిమీద బ్లడ్ సర్కులేషన్ ను పెంచి చుండ్రును తగ్గిస్తుంది. అలాగే జుట్టు మూలాలను బలంగా, హెల్తీగా ఉంచడానికి సహాయపడుతుంది.
ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.ఈ ఉసిరికాయ మన జుట్టుకు మంచి కండీషనర్ గా కూడా పనిచేస్తుంది. ఉసిరిని వాడటం వల్ల తెల్ల జుట్టు రావడం చాలా వరకు తగ్గుతుంది. అలాగే వెంట్రుకలు నల్లగా,స్ట్రాంగ్ గా అవుతాయి. అంతేకాదు ఉసిరి మన జుట్టుకు నేచురల్ గ్లోను కూడా ఇస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కాలుష్యానికి మన జుట్టును దెబ్బతినకుండా రక్షిస్తుంది. అంతేకాదు ఉసిరి వాడకం వల్ల జుట్టు రాలడం చాలా వరకు తగ్గుతుంది.
మందార పువ్వులు మన జుట్టుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఒక్క పువ్వులే కాదు దీని ఆకులను ఉపయోగించి కూడా మన జుట్టు పొడుగ్గా పెరిగేలా చేయొచ్చు. వీటిలో విటమిన్ సి, అమైనో ఆమ్లాలు, ఆంథోసైనిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొత్త జుట్టు రావడానికి సహాయపడతాయి.
అలాగే కుదుళ్లకు మంచి పోషణను అందిస్తాయి. మందార పువ్వును మన జుట్టుకు మంచి మాయిశ్చరైజర్ లా కూడా పనిచేస్తుంది. అలాగే నెత్తిమీద చుండ్రును తొలగించడానికి సహాయపడుతుంది. దీనితో తయారుచేసిన నూనెను పెడితే జుట్టు ఒత్తుగా, మందంగా, పొడుగ్గా పెరుగుతుంది.
కావాల్సిన పదార్థాలు
రెండు టేబుల్ స్పూన్ల ఉసిరి పొడి కావాలనుకుంటే మీరు ఫ్రెష్ ఉసిరి పేస్ట్ ను కూడా తీసుకోవచ్చు. అలాగే రెండు టేబుల్ స్పూన్ల మెంతులు, కొన్ని మందార ఆకులు, పది నుంచి పదిహేను మందార పువ్వులు కప్పు నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె అవసరమవుతాయి.
నూనెను ఎలా తయారుచేయాలి?
ముందుగా ఒక బాణలీ తీసుకుని అందులో నూనె వేడిచేయండి. దీంట్లో మందార పువ్వులు, ఆకులు, మెంతులు, ఉసిరికాయ పొడిని వేసి మరిగించండి. ఈ పదార్థాలన్నీ ముదురు రంగులోకి మారి వాసన వస్తుంటే మంటను ఆపేయండి. అయితే దీన్ని తక్కువ మంటమీదే వేడిచేయాలి. ఈనూనె చల్లారిన తర్వాత వడకట్టి గాలి వెళ్లని సీసాలో నిల్వ చేయండి.
ఈనూనెను ఇలా ఉపయోగించండి
మెంతులు, ఉసిరి, మందార పువ్వులు, ఆకులతో తయారుచేసిన ఈ నూనెను వారానికి రెండుమూడు సార్లు ఉపయోగించొచ్చు. అయితే దీన్ని వాడే ముందు ఖచ్చితంగా గోరువెచ్చగా వేడి చేయాలి. దీన్ని జుట్టుకు బాగా పట్టించి ఐదు పది నిమిషాలు మసాజ్ చేయాలి. గంట లేదా రెండు గంటల తర్వాత లేదా రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే తలస్నానం చేయాలి. అయితే మైల్డ్ షాంపూనే ఉపయోగించాలి.