Cracked Heel: పాదాలు పగిలి నొప్పి పెడుతున్నాయా? ఇలా చేస్తే చాలు..!
పాదాలు పగిలి నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? కేవలం హోమ్ రెమిడీలు ప్రయత్నించి మీ పాదాలను మళ్లీ మృదువుగా మార్చుకోవచ్చని మీకు తెలుసా?
పాదాలు పగిలి నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? కేవలం హోమ్ రెమిడీలు ప్రయత్నించి మీ పాదాలను మళ్లీ మృదువుగా మార్చుకోవచ్చని మీకు తెలుసా?
చలికాలంలో మాత్రమే కాదు.. ఎండాకాలంలోనూ చాలా మంది పాదాలు పగిలి ఇబ్బంది పడుతుంటారు. ఇవి పగులాయి అంటే చాలు విపరీతమైన నొప్పి కలిగిస్తాయి. కొందరికి అయితే.. కనీసం నడవడానికి కూడా వీలుకాదు. అంతలా ఇబ్బంది పెడతాయి. మీరు కూడా ఇలాంటి సమస్య తోనే బాధపడుతున్నారా? అయితే, కొన్ని రకాల హోం రెమిడీలతో మీరు ఈ పాదాల పగుళ్ల సమస్య నుంచి బయటపడొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
పాదాలు ఎందుకు పగులుతాయి..?
సాధారణంగా చర్మం తేమను కోల్పోయినప్పుడు లేదా నీటి కొరత ఏర్పడినప్పుడు పాదాలు పగులుతాయి. కొన్నిసార్లు చేతుల వేళ్లు కూడా పగులుతాయి. ముఖ్యంగా చలికాలంలో ఇది ఎక్కువగా జరుగుతుంది. ఎండాకాలంలోనూ ఈ సమస్యతో బాధపడేవారు కూడా ఉన్నారు.అయితే మొదటి నుండే క్రమం తప్పకుండా శ్రద్ధ తీసుకుంటే ఈ సమస్య నుండి పూర్తిగా ఉపశమనం పొందవచ్చు.
పాదాలు పగలకుండా ఉండటానికి ఇంటి చిట్కాలు:
1. ముందుగా పాదాలను శుభ్రం చేసుకోండి
పగిలిన పాదాలను నయం చేయడానికి ముందుగా పాదాల మధ్య ఉన్న మురికిని శుభ్రం చేసుకోవాలి. వారానికి కనీసం 2 నుండి 3 సార్లు పాదాలను శుభ్రం చేసుకోవాలి.
ముందుగా ఒక గిన్నెలో గోరువెచ్చని నీరు తీసుకోండి. దానిలో కొద్దిగా ఉప్పు, కొన్ని చుక్కల లిక్విడ్ సోప్ (లేదా షాంపూ) వేసి కలపండి. ఈ నీటిలో 15 నుండి 20 నిమిషాలు పాదాలను నానబెట్టండి. గట్టిపడిన చర్మం మెత్తబడుతుంది. ఇప్పుడు ప్యూమిస్ స్టోన్ లేదా మృదువైన బ్రష్‌తో పాదాలను రుద్ది శుభ్రం చేసుకోండి. మురికి, చనిపోయిన చర్మం తొలగిపోతుంది.
2. చర్మానికి తేమను అందించండి
పాదాలను శుభ్రం చేసుకున్న రోజుల్లోనే కాకుండా, ప్రతిరోజూ చేతులు, పాదాల చర్మానికి తేమను అందించాలి. పాదాలను శుభ్రం చేసుకుని ఆరబెట్టుకున్న తర్వాత కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ లేదా ఏదైనా బాడీ ఆయిల్‌తో పాదాలకు మసాజ్ చేయండి. నూనె చర్మంలోకి పూర్తిగా ఇంకిపోయే వరకు మసాజ్ చేయండి. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నూనె లేదా బోరోలిన్‌ను పాదాలకు రాసి, సాక్స్ వేసుకుని పడుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
3. పాదాల కోసం ప్యాక్ తయారు చేసుకోండి
చర్మం తేమను నిలుపుకోవడానికి సహజసిద్ధమైన పద్ధతులను ఉపయోగించాలి. ఒక చెంచా తేనెలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి పాదాలకు పట్టించండి. 15 నుండి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. నిమ్మరసం పాదాలను శుభ్రం చేస్తుంది, తేనె చర్మానికి తేమను అందిస్తుంది.
5వేసవిలో ఎక్కువ నీరు తాగండి
శరీరంలో తేమ నిలబెట్టుకోవడంలో నీరు కీలకం. రోజుకు కనీసం 8–10 గ్లాసులు నీరు తాగడం వల్ల చర్మం పొడిగా మారకుండా ఉంటుంది.
5. వాసెలిన్ లేదా మల్టీపర్పస్ ఆయింట్మెంట్
చాలా పొడిగా ఉండే పాదాలకు వాసెలిన్ లేదా పెట్రోలియం జెల్లీ రాత్రిళ్లు రాసి, సాక్స్ ధరించండి. ఇది పాదాలను తేమగా మార్చి.. పగలగుండా చేస్తుంది.
6. బేకింగ్ సోడా బాత్
బేకింగ్ సోడా ఒక సహజ ఎక్స్‌ఫోలియేటర్. ఇది కూడా మీ పాదాల పగుళ్లను తగ్గిస్తుంది. దాని కోసం మీరు ఒక గిన్నెలో గోరువెచ్చని నీటిలో 2 టేబుల్ స్పూన్లు బేకింగ్ సోడా వేసి, పాదాలను 15 నిమిషాలు నానబెట్టండి. ఇది డెడ్ స్కిన్ తొలగించడంలో ,మృదుత్వం అందించడంలో సహాయపడుతుంది.
ఈ చిట్కాలను పాటిస్తే, పాదాలు, చేతులు పగలకుండా ఉంటాయి. వారానికి కనీసం 2 నుండి 3 సార్లు, చాలా పని ఉంటే వారానికి ఒకసారి పాదాలను శుభ్రం చేసుకుని, తేమను అందించండి. పాదాలు మృదువుగా, అందంగా ఉంటాయి.