
దీపావళి పండుగకు ఇంకా కొన్ని రోజులే ఉంది. ఈ పండుగల వేళ ఆడవారు అందంగా కనిపించేందుకు రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడుతుంటారు. ఇందుకోసం వేలకు వేలు ఖర్చు చేసేవారు కూడా ఉన్నారు. కానీ మన ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో కూడా మీరు అందంగా మెరిసిపోవచ్చు. కొన్ని రకాల ఫేస్ ప్యాక్ ను వేసుకోవడం వల్ల మీ చర్మం నేచురల్ గా కాంతివంతంగా కనిపిస్తుంది.
శెనగపిండి, పసుపు రెండింటినీ ఎప్పటినుంచో చర్మ సంరక్షణకు ఉపయోగిస్తున్నారు.ఇవి మన ముఖ చర్మాన్ని కాంతివంతంగా, నీట్ గా చేయడానికి సహాయపడతాయి. ఈ ఫేస్ ప్యాక్ ను తయారుచేయడం చాలా సులువు. ఇందుకోసం ఒక గిన్నె తీసుకుని అందులో టీ స్పూన్ శెనగపిండి వేసి అందులో 1/2 స్పూన్ పసుపు వేసి బాగా కలపండి.
దీనిలో తగినంత రోజ్ వాటర్ ను పోసి పేస్ట్ లా చేయండి. దీన్ని ముఖానికి, మెడకు పట్టించి 15 నిమిషాలు వదిలేయండి. తర్వాత చల్ల నీళ్లతో ముఖాన్ని కడగండి. వారానికి రెండు సార్లు ఈ ఫేస్ ప్యాక్ ను వేసుకుంటే మీ ముఖం అందంగా మెరిసిపోతుంది.
నిమ్మరసం, తేనె రెండూ మన చర్మానికి మేలు చేస్తాయి. ఇవి చర్మ రంగును మెరుగుపర్చడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి.ఈ ఫేస్ ప్యాక్ ను తయారుచేయడానికి ఒక గిన్నె తీసుకుని అందులో ఒక టీస్పూన్ తేనె వేసి కొన్ని చుక్కల నిమ్మరసం వేసి బాగా కలపండి. దీన్ని ముఖానికి, మెడకు పట్టించండి. 15 నిమిషాల తర్వాత చల్ల నీళ్లతో ముఖాన్ని కడగండి. ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి రెండు సార్లు వేసుకుంటే మీ చర్మపు రంగు మెరుగుపడుతుంది.
గంధం, బియ్యం పిండి ఫేస్ ప్యాక్ కూడా ముఖానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫేస్ ప్యాక్ ను తయారుచేయడానికి ఒక గిన్నెలో టీ స్పూన్ బియ్యం పిండి, 1/2 స్పూన్ గంధం పొడి, 1 స్పూన్ రోజ్ వాటర్ వేసి బాగా కలపండి. ఈ పేస్ట్ ను ముఖానికి, మెడకు పట్టించండి. ఇది పూర్తిగా ఆరిన తర్వాత చల్ల నీళ్లతో కడిగేయండి. ఈ ప్యాక్ ను వారానికి ఒక సారి వేసుకుంటే మీ ముఖం ప్రకాశవంతంగా మెరుస్తుంది.
పచ్చిపాలు, తేనె మన చర్మానికి చేసే మేలు ఎంతో. ఈ ఫేస్ ప్యాక్ వల్ల ముఖం అందంగా కనిపిస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ ను తయారుచేయడానికి ఒక గిన్నె తీసుకుని అందులో రెండు టీ స్పూన్ల పచ్చి పాలు పోయండి. దీనిలోనే టీ స్పూన్ తేనెను వేసి బాగా మిక్స్ చేయండి. దీన్ని ముఖానికి, మెడకు రాయండి. 15 నిమిషాల తర్వాత చల్ల నీళ్లతో కడిగేస్తే సరిపోతుంది. ఈ ఫేస్ ప్యాక్ ను ఈ ఫేస్ ప్యాక్‌ను రోజూ వాడొచ్చు.దీని వల్ల మీ ముఖం ఎప్పుడూ తాజాగా, ప్రకాశవంతంగా ఉంటుంది.
గంధం చర్మం రంగును మెరుగుపర్చడానికి బాగా సహాయపడుతుంది. తేనె చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ కోసం ఒక గిన్నెలో టీ స్పూన్ బాదం నూనె పోసి అందులో టీ స్పూన్ తేనె, రెండుమూడు చుక్కల గంధం పొడిని వేసి పేస్ట్ చేయండి. ఈ పేస్ట్ ను ముఖానికి రాసి 20 నిమిషాలు వదిలేయండి. ఆ తర్వాత చల్ల నీళ్లతో ముఖాన్ని కడగండి. ఇలా మీరు వారానికి రెండు మూడు సార్లు ఈ ఫేస్ ప్యాక్ ను వేసుకుంటే మీ ముఖం అందంగా మెరుస్తుంది.