
అరటి పండ్లు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగకరంగా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అరటి కాయలు బరువు పెరగడానికి, గుండె ఆరోగ్యంగా ఉండటానికి ఇలా ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. అయితే అరటి పువ్వు గురించి మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు. అసలు అరటిపువ్వును కూడా తింటారన్న ముచ్చట కూడా కొంతమందికి మాత్రమే తెలుసు. కానీ అరటిపువ్వును తింటే మాత్రం మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతాం. అరటి పువ్వులో కాల్షియం, ఫైబర్, విటమిన్ బి, విటమిన్ ఎ, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అసలు అరటిపువ్వును తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
గర్భాశయ సమస్యలు..
అరటి పువ్వును అండాశయ తిత్తులు ఉన్నవారు తినొచ్చు. వీళ్లకు ఈ పువ్వు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదయాన్నే అరటి పువ్వు రసం తాగితే గర్భాశయ సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు. అరటి పువ్వులోని పీచు పదార్థాలను తొలగించి, పువ్వులను చిన్న చిన్న ముక్కలుగా కోసి మజ్జిగతో కలుపుకుని తాగాలి. టేస్ట్ కోసం మీరు కొద్దిగా ఉప్పును కూడా కలుపుకోవచ్చు.
రక్తాన్ని శుద్ధి చేస్తుంది
అరటి పువ్వు రక్తాన్ని శుద్ధి చేయడానికి కూడా బాగా సహాయపడుతుంది. అరటి పువ్వు రక్తంలోని అవాంఛిత కొవ్వులను కరిగించి తొలగిస్తుంది.దీంతో శరీరంలో రక్తం మెరుగ్గా ప్రసరణ జరుగుతుంది. ఇది రక్త నాళాలకు అంటుకునే కొవ్వులను కరిగించి రక్తాన్ని శుద్ధి చేయడానికి సహాయపడుతుంది. అరటి పువ్వులు రక్తహీనత సమస్యను తగ్గించడానికి కూడా సహాయపడతాయి. అలాగే రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచడానికి సహాయపడతాయి.
మలబద్ధకానికి సహాయపడుతుంది
అరటి పువ్వు మలబద్ధకం సమస్యతో బాధపడేవారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పువ్వులో ఉండే ఫైబర్ వల్ల ఇదొక భేదిమందుగా పనిచేస్తుంది. ఈ పువ్వులో కరిగే ఫైబర్, కరగని ఫైబర్ రెండూ పుష్కలంగా ుంటాయి. అరటి పువ్వును ఆహారంలో ఎక్కువగా తీసుకునేవారికి తరచూ మూత్రం వచ్చే సమస్య కూడా తగ్గుతుంది.
రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది
అరటి పువ్వులో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అందుకే ఇది రక్తానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ పిండి పదార్థాల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ ను మారుస్తుంది. ఇది షుగర్ లెవల్స్ వెంటనే పెరగకుండా కాపాడుతుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారు అరటి పువ్వును తినాలని డాక్టర్లు చెప్తారు.
నోటి దుర్వాసనను తగ్గిస్తుంది
అరటిపండును తరచుగా ఆహారంలో చేర్చుకోవడం వల్ల నోటి దుర్వాసన కూడా తగ్గుతుందంటున్నారు నిపుణులు. పోషకాహార లోపం వల్ల పంటినొప్పి, చిగుళ్ల నుంచి రక్తం కారడం, నోరు, కుహరాల్లోని క్రిములు వంటి సమస్యలు కూడా నయమవుతాయి.
ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది
అరటి పువ్వులో ఒత్తిడిని తగ్గించే పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. మీరు బాగా ఒత్తిడికి లోనవుతుంటే గనుక మీ రోజువారీ ఆహారంలో అరటిపువ్వును చేర్చుకుని శనగపప్పుతో సలాడ్ గా వండుకోవచ్చు.
గుండెను కాపాడుతుంది
అరటిపండ్లలో పొటాషియం మెండుగా ఉంటుంది. ఈ పొటాషియం మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయపడుతుంది. మీకు గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండాలంటే అరటి పువ్వును మీ డైట్ లో చేర్చుకోండి.