మనలో చాలా మందికి పెంపుడు జంతువులు ఉంటాయి కదా. వాటిని ఎంతో ప్రేమగా పెంచుతుంటాం. కాని ఎక్కడికైనా లాంగ్ టూర్ వెళ్లాలంటే వాటిని ఇంట్లో వదిలి వెళ్లలేం. చుట్టుపక్కల వారి ఇళ్లలో పెట్టి వెళ్లాలంటే అవి బెంగ పెట్టుకొని తిండి తినక, నీరసించి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.
అందుకే రైల్వే శాఖ ప్రయాణికుల కోసం ఓ ప్రత్యేక సౌకర్యాన్ని అందిస్తోంది. దీని ప్రకారం రైళ్లలో ఓ ప్రత్యేక బోగీలో పెంపుడు జంతువులను తీసుకెళ్లొచ్చు. అయితే ఈ ట్రాన్స్ పోర్ట్ కోసం కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి.
రైళ్లలో జంతువులను తీసుకెళ్లే నిబంధనలు
రైళ్లలో పిల్లి, కుక్క వంటి పెంపుడు జంతువులను తీసుకెళ్లొచ్చు. అయితే కేవలం ఫస్ట్ క్లాస్ ఏసీ (1A) లేదా ఫస్ట్ క్లాస్ కంపార్ట్ మెంట్ లో మాత్రమే తీసుకెళ్లడానికి పర్మీషన్ ఇస్తారు.
పెంపుడు జంతువుల కోసం టికెట్ తప్పనిసరిగా తీసుకోవాలి.
జంతువుల టికెట్లు రైల్వే స్టేషన్ లో పార్సిల్ ఆఫీస్ దగ్గర ఇస్తారు.
టికెట్ ధర జంతువు బరువు ఆధారంగా ఉంటుంది.
పెద్ద జంతువులైన పశువులు, గేదెలు, మేకలు మొదలైనవి తీసుకెళ్లాలంటే పార్సిల్ వ్యాన్ లేదా బ్రేక్ వ్యాన్ (SLR Coach)లో మాత్రమే తరలించాలి.
ఈ బోగీల్లో జంతువులను తీసుకెళ్లకూడదు
సెకండ్ క్లాస్ స్లీపర్, ఏసీ 3-టైర్, ఏసీ చైర్ కార్ వంటి కోచ్‌లలో జంతువులను తీసుకెళ్లడానికి రైల్వే శాఖ అనుమతించదు. దీనివల్ల ప్రయాణికులు ఇబ్బంది పడతారని అనుమతించరు. అయినా ఎవరైనా ఇలా చేస్తే రైల్వే నిబంధనల ప్రకారం ఫైన్ వేస్తారు.