బస్సులు, ఇతర వాహనాల్లో ఎక్కువ లగేజీ తీసుకెళ్లనివ్వరు. బరువు ఎక్కువగా ఉంటే ఛార్జ్ తీసుకుంటారు. డబ్బులు కట్టినా లగేజీ పెట్టుకోవడానికి పెద్దగా స్పేస్ ఉండదు. కాని ట్రైన్స్ లో అయితే ఎక్కువ లగేజీ ఉన్నా ఫ్రీగా తీసుకెళ్లడానికి అనుమతిస్తారు. అయితే మరీ ఎక్కువ బరువుంటే రైళ్లలో కూడా ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. కాని లగేజీ పెట్టడానికి ప్రత్యేక క్యాబిన్లు ఉంటాయి. అందువల్ల వస్తువులు దెబ్బతినకుండా ఉంటాయి. అయితే రైల్వే శాఖ ఇప్పుడు ఉచిత లగేజీ లిమిటేషన్స్ మార్చింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు ఏసీ ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణిస్తుంటే ఎలాంటి అదనపు ఛార్జీ లేకుండా 70 కిలోల వరకు సామాను తీసుకెళ్లొచ్చు. ఎక్కువ బరువుంటే ఛార్జీ పడుతుంది.
ఏసీ 2-టైర్ కోచ్‌లో 50 కిలోల వరకు సామాను ఫ్రీగా తీసుకెళ్లొచ్చు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఇది సరిపోతుంది. ఎక్కువ బరువుంటే ఛార్జ్ కట్టాల్సి ఉంటుంది.
ఏసీ 3-టైర్, స్లీపర్ క్లాస్, ఏసీ చైర్ కార్ టికెట్లను ఎక్కువ మంది మిడిల్ క్లాస్ వాళ్లు బుక్ చేసుకుంటారు. ఈ కేటగిరీల్లో 40 కిలోల బరువున్న సామాన్లను ఉచితంగా తీసుకెళ్లొచ్చు.
జనరల్ లేదా సెకండ్ సిట్టింగ్ కోచ్‌లో 35 కిలోల వరకు సామాను తీసుకెళ్లొచ్చు. అంతకు మించి ఉంటే ఛార్జ్ కట్టాల్సి ఉంటుంది. ఈ కోచ్ లు ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. అందుకే తక్కువ బరువు లిమిట్ పెట్టారు.
రైళ్లలో ఏ వస్తువులు తీసుకెళ్లకూడదు?
కొన్ని వస్తువులను రైళ్లలో తీసుకెళ్లడానికి రైల్వే శాఖ అనుమతించదు. వాటిల్లో ముఖ్యమైనవి పేలుడు పదార్థాలు, మండే వస్తువులు, రసాయన, హానికర పదార్థాలు. వీటిని తీసుకెళ్లే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. అవి చట్టపరంగానే విధిస్తారు. ఈ వస్తువులతో పట్టుబడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.