Smartphone: స్మార్ట్‌ఫోన్ వాడకం పెరిగిన కొద్దీ బ్యాటరీ సమస్యలు కూడా ఎదురవుతుంటాయి. వాటిలో ఒకటి బ్యాటరీ ఉబ్బడం. చాలాసార్లు ఫోన్ సరిగ్గా పనిచేస్తున్నట్టే కనిపించినా, వెనుక భాగంలో బంప్ ఏర్పడుతుంది. ఇంతకీ ఫోన్ బ్యాటరీ ఎందుకు ఉబ్బుతుందో ఆలోచించారా?
నేటి ఫోన్లలో లిథియం-అయాన్ పాలిమర్ బ్యాటరీలు ఉపయోగిస్తారు. ఇవి లోపల రసాయన పూతతో నిండి ఉండే పలుచని లోహం, ప్లాస్టిక్ పొరలతో తయారవుతాయి. ఈ పొరలు ప్రత్యేకమైన ఎలక్ట్రోలైట్ జెల్‌లో ఉంటాయి. కాలక్రమంలో ఈ జెల్ క్షీణించి వాయువుగా మారుతుంది. ఆ వాయువు లోపల ఒత్తిడి పెంచి, బ్యాటరీ ప్యాక్ ఉబ్బేలా చేస్తుంది. దీనివల్లే ఫోన్ వెనుక భాగంలో వాపు కనిపిస్తుంది.
25
ప్రమాదాలను నిర్లక్ష్యం చేయకండి
బ్యాటరీ వాపు చిన్న సమస్యలా అనిపించినా, ఇది పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. ఉబ్బిన బ్యాటరీ ఎక్కువ ఛార్జ్ అయితే, పేలిపోవడం లేదా మంటలు చెలరేగే అవకాశం ఉంటుంది. అందుకే ఇలా బ్యాటరీ ఉబ్బిన ఫోన్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు.
35
వీటికి దూరంగా ఉండాలి.
* ఉబ్బిన బ్యాటరీని ఛార్జ్ చేయకండి.
* ఇంట్లో మీరే రిపేర్ చేయాలని ప్రయత్నించకండి.
* గ్యాస్ బయటకు వస్తుందన్న ఉద్దేశంతో బ్యాటరీకి రంధ్రం చేయడం లాంటివి చేయకండి. ఇలా చేస్తే బ్యాటరీ పేలే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది.