వర్షం పడితే చాలు.. పాములు, తేళ్ల వంటి విషపూరిత ప్రాణులు ఇంట్లోకి వచ్చేస్తుంటాయి. ముఖ్యంగా వంటగదిలోని కొన్ని వస్తువులు పాములను ఆకర్షిస్తాయట. మరి ఇంట్లోకి పాములు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ చూద్దాం.
వంటగదిలో ఉండే ఆహార పదార్థాలు, ధాన్యాలు, బియ్యం, పప్పులు, ఇతర ఆహార వ్యర్థాలు ఎలుకలు, కీటకాలను ఆకర్షిస్తాయి. సాధారణంగా పాములు.. ఎలుకలు, చిన్న చిన్న కీటకాల కోసం వెతుకుతూ ఉంటాయి. వాటికోసం వంటగదిలోకి వచ్చే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆహార పదార్థాలను చెల్లాచెదురుగా పడేయకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా ఆహార పదార్థాలను మూతలు కలిగిన పాత్రల్లో నిల్వ చేయడం, ప్రతిరోజూ వంటగదిని శుభ్రం చేయడం పాములు రాకుండా ఉండటానికి సహాయపడుతుంది. ముఖ్యంగా, ధాన్యాలు, బియ్యం నిల్వ చేసే ప్రదేశాల చుట్టూ ఆహారం వ్యర్థాలు లేకుండా చూసుకోవాలి.
26
నీరు నిల్వ ఉండకూడదు..
సాధారణంగా పాములు తేమగా, చల్లగా ఉండే ప్రదేశాలను ఇష్టపడతాయి. వంటగదిలో వాటర్ లీకేజీలు, కారుతున్న పైపులు, లేదా నీరు నిల్వ ఉన్న పాత్రలు ఉంటే… అవి పాములను ఆకర్షిస్తాయి. సింక్ కింద ఉన్న పైపుల్లో లీకేజీలు, లేదా పాత్రలు కడిగిన తర్వాత సింక్‌లో నీరు నిల్వ ఉంటే.. వాటిని వెంటనే సరిచేయాలి. వంట గదిలో ఉపయోగించే క్లాత్ లు తడిగా లేకుండా బాగా ఆరబెట్టాలి. వంటగదికి దగ్గరగా నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి.
36
ఎలుకలు, కీటకాలు లేకుండా..
ఎలుకలు, కీటకాలు పాములకు ప్రధాన ఆహారం. వంటగదిలో ఎలుకలు లేదా బొద్దింకలు వంటి కీటకాలు ఎక్కువగా ఉంటే.. అవి పాములను ఆకర్షిస్తాయి. కాబట్టి వంటగదిలో ఎలుకలు, కీటకాల బెడదను నియంత్రించడం చాలా అవసరం. దీనికోసం ఆహార పదార్థాలను సరిగ్గా నిల్వ చేయడం, చెత్తను మూత పెట్టి ఉంచడం, అవసరమైతే క్రిమిసంహారక మందులను వాడటం వంటివి చేయచ్చు. ఎలుకలు వచ్చే రంధ్రాలను మూయడం కూడా అవసరం.
వంటగదిలో అవసరం లేని పాత వస్తువులు, కార్డ్‌బోర్డ్ పెట్టెలు, లేదా చాలా కాలంగా వాడని పాత్రలు వంటివి పేరుకుపోయి ఉంటే.. అవి పాములకు దాక్కునే ప్రదేశాలుగా మారతాయి. పాములు చీకటి, సురక్షితమైన ప్రదేశాలను ఇష్టపడతాయి. కాబట్టి వంటగదిని చక్కగా, శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం. అనవసరమైన వస్తువులను తొలగించి.. వాడుకునే వస్తువులను చక్కగా అమర్చాలి. స్టవ్ కింద, అల్మారాల వెనుక, ఫ్రిజ్ వెనుక ఖాళీ ఉంటే వాటిని తరచుగా శుభ్రం చేయాలి.
56
గోడ పగుళ్లు, రంధ్రలను మూయాలి
పాత చెక్క సామాను, ముఖ్యంగా చెదలు పట్టిన చెక్క వస్తువులు, పాములకు ఆశ్రయం కల్పిస్తాయి. వాటిలోని చిన్న రంధ్రాలు లేదా పగుళ్ల ద్వారా పాములు సులభంగా లోపలికి ప్రవేశించగలవు. వంటగదిలో పాత చెక్క అల్మారాలు, లేదా టేబుళ్లు ఉంటే, వాటిని రిపేర్ చేయడం లేదా మార్చడం మంచిది. అలాగే గోడలలోని పగుళ్లు లేదా రంధ్రాల ద్వారా పాములు లోపలికి రాకుండా ఉండటానికి వాటిని మూయడం చాలా అవసరం.
66
వంటగది చుట్టూ ఉన్న ప్రదేశాన్ని..
వంటగదికి దగ్గరగా తోట లేదా ఖాళీ ప్రదేశం ఉంటే.. అక్కడ నుంచి పాములు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా వర్షాకాలంలో అవి నేరుగా వంటగదిలోకి ప్రవేశించవచ్చు. వంటగది తలుపులు, కిటికీలు సరిగ్గా మూసి ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి. తలుపుల కింద ఖాళీ ఉంటే, దాన్ని మూయడం మంచిది. వంటగదికి దగ్గరగా ఉన్న మొక్కలను చక్కగా ఉంచుకోవడం, పొదలను కత్తిరించడం, చెత్త పేరుకుపోకుండా చూసుకోవడం పాములు రాకుండా ఉండటానికి సహాయపడుతుంది. వంటగదిని గాలి వెలుతురుగా ఉంచుకోవడం, అనవసరమైన చీకటి మూలలను నివారించడం మంచిది.