
Zakir Hussain : భారతదేశంలోనే అత్యున్నత పదవి రాష్ట్రపతి... రెండో అత్యున్నత పదవి ఉపరాష్ట్రపతి. ఈ రెండు పదవుల్లో ఏ ఒక్కటి దక్కినా రాజకీయంగానే కాదు సమాజంలోనూ ఎవ్వరికీ దక్కని గౌరవం లభిస్తుంది... అందుకే పెద్దగా పవర్స్ లేకున్నా వీటికి బాగా పోటీ ఉంటుంది. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది... ఎన్డిఏ నుండి సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి నుండి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలుగు వ్యక్తి కావడంతో ఈ ఎన్నికలు తెలుగురాష్ట్రాల్లోనూ ఉత్కంఠను రేపుతున్నాయి.
బి. సుదర్శన్ రెడ్డి రెడ్డి తెలంగాణకు చెందినవారు. అయితే ఇప్పటివరకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిగా చేసిన తెలుగువారిలో ఎక్కువమంది ఆంధ్ర ప్రదేశ్ కు చెందినవారే... కానీ ఒకేఒక్క తెలంగాణ నాయకుడు ఈ రెండు పదవులను అధిరోహించారు. ఆయనే జాకీర్ హుస్సెన్. ఈయన జీవన ప్రస్ధానమంతా ఉత్తర ప్రదేశ్ లో సాగినా పుట్టింది మాత్రం తెలంగాణలోనే... పక్కా హైదరబాదీ ముస్లిం కుటుంబానికి చెందినవారు.
జాకీర్ హుస్సెన్ ఆనాటి నిజాం పాలనలోని హైదరాబాద్ సంస్థానంలో 1897, ఫిబ్రవరి 8న జన్మించారు. ఈయన బాల్యం కొన్నాళ్లు హైదరాబాద్ లోనే సాగింది. అయితే వీరి కుటుంబం హైదరాబాద్ నుండి ఉత్తర ప్రదేశ్ లోని ఫరూఖాబాద్ జిల్లా ఖాయిమ్ గంజ్ కు వలసవెళ్లింది. దీంతో హైదరాబాద్ కు చెందిన జాకీర్ హుస్సెన్ యూపీ వ్యక్తిగా మారిపోయారు. ఆయన విద్యాభ్యాసం, కెరీర్ అంతా యూపీలోనే గడిచింది.
అతి చిన్న వయసులోని మంచి విద్యావేత్తగా గుర్తింపుపొందారు జాకీర్ హుస్సెన్. ఇతడు కేవలం 23 ఏళ్ళ వయసులోని డిల్లీ సమీపంలో జామియా మిలియా ఇస్లామియా ముస్లిం విశ్వవిద్యాలయం స్థాపించారు. అనంతరం జర్మనీలో పి.హెచ్.డి చేశారు... తర్వాత ఇండియాకు వచ్చి స్వాతంత్య్ర పోరాటంలో తనవంతు పాత్ర పోషించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అలీఘర్ ముస్లిం యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా నియమితులయ్యారు జాకీర్ హుస్సెన్.
ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకపోయినా ఉన్నత విద్యావంతుడైన జాకీర్ హుస్సెన్ పలు ఉన్నత పదవులు అదిరోహించారు. ఆయన రాజ్యసభ సభ్యునిగా, బిహార్ గవర్నర్ గా పనిచేశారు. అయితే 1962 లో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించారు... ఇలా దేశానికి రెండో ఉపరాష్ట్రపతి, మొదటి ముస్లిం ఉపరాష్ట్రపతిగా మారారు. 1967 లో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు… మొదటి ముస్లిం రాాష్ట్రపతి కూడా ఈయనే… అయితే ఈ పదవిలో ఉండగానే ఆయన మరణించారు. ఇలా అత్యల్ప కాలం రాష్ట్రపతిగా చేయడమే కాదు పదవిలో ఉండగా మరణించిన తొలి రాష్ట్రపతి జాకీర్ హుస్సెన్. ఈయనకు భారత రత్న అవార్డు లభించింది.
జాకీర్ హుస్సెన్ హైదరాబాద్ లోనే పుట్టినా ఆయన జీవనమంతా ఉత్తర ప్రదేశ్ లో సాగింది కాబట్టి అక్కడి వ్యక్తిగానే గుర్తిస్తారు. మరి తెలుగు రాష్ట్రాల నుండి రాష్ట్రపతిగా పనిచేసిన మొదటివ్యక్తి నీలం సంజీవరెడ్డి. తెలుగు రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈయన దేశంలోనే అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిని పొందారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు.
దేశానికి ఉపరాష్ట్రపతిగా పనిచేసిన నాయకుడు వెంకయ్య నాయుడు. బిజెపిలో కీలక నేతగా ఎదిగిన ఈయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. జగదీప్ దన్కర్ కు ముందు ఈయనే ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. 2017 ఆగస్ట్ 11 నుండి 2022 ఆగస్ట్ 11 వరకు భారత ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు ఉన్నారు.