
తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాల మూడో రోజు రాజకీయ వేడి పీక్స్‌కు చేరింది. సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారనే కారణంతో విపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు మొత్తం 22 మంది ఎమ్మెల్యేలను ఈ సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. శాసనమండలిలోనూ ఇద్దరు ఎమ్మెల్సీల సస్పెన్షన్‌పై రగడ జరగడంతో బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు.
సభ ప్రారంభమైన వెంటనే బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు చేపట్టిన ‘చావుడప్పు’ నిరసనలు, అలాగే మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుపై ప్రతిపక్షం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సభలో దీనిపై ఇచ్చిన వాయిదా తీర్మానంపై వెంటనే చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ‘వీ వాంట్ జస్టిస్’ అంటూ నినాదాలు చేశారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్లకార్డులతో నిరసన తెలిపారు.
ప్రతిపక్ష నేతల ఆందోళనతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. మంత్రులు శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బీఆర్ఎస్ సభ్యులను శాంతింపజేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. సభ సజావుగా సాగకుండా ప్రతిపక్షం ఉద్దేశపూర్వకంగా అడ్డుపడుతోందని ఆరోపిస్తూ, శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు సభ్యుల సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి సభ ఆమోదం తెలపడంతో, కేటీఆర్, హరీశ్‌రావు, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పాడి కౌశిక్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి సహా 22 మంది సభ్యులను ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
సస్పెన్షన్ అనంతరం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సభలో మాట్లాడారు. స్పీకర్ వ్యవస్థను, దళిత వర్గానికి చెందిన సభాపతిని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా అవమానించారని మండిపడ్డారు. ప్రతిపక్షాల ఆగడాలను ప్రభుత్వం సంయమనంతో భరిస్తోందని, రాష్ట్రంలో ఇక దొరతనం పోకడలను భరించడానికి ప్రజలు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. సభాపతికి పదే పదే అవమానాలు చేయడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు.
సస్పెన్షన్ ప్రకటన తర్వాత సభ కాసేపు వాయిదా పడగా, స్పీకర్‌ను కలిసేందుకు వెళ్లిన కేటీఆర్, హరీశ్‌రావులను మార్షల్స్ అడ్డుకోవడంతో అసెంబ్లీ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ పరిణామాలపై మాజీ మంత్రి హరీశ్ రావు సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందించారు. "ఇది బీఆర్ఎస్ సస్పెన్షన్ కాదు, ప్రజా సమస్యలపై కాంగ్రెస్ విధించిన సస్పెన్షన్. ప్రజలు సమస్యలపై మాట్లాడమంటే, రేవంత్ రెడ్డి బీఆర్ఎస్‌ను బయటకు పంపే కుట్ర చేస్తున్నారు. నియంతృత్వం పెరిగితే ప్రజా తిరుగుబాటు తప్పదని రేవంత్ గుర్తుంచుకోవాలి" అని హెచ్చరించారు.
అలాగే, అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. న్యాయం కోరితే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తారా? మహిళా ప్రజాప్రతినిధులపై చేసిన దాడిపై ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తార? అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై మాట్లాడినివ్వకుండా సస్పెండ్ చేస్తారా? అని ప్రశ్నించారు. స్వయంగా కేటీఆర్ కారు నడుపుతూ హరీశ్ రావుతో కలిసి లోక్ భవన్ కు వెళ్లారు.
మరోవైపు శాసనమండలిలోనూ తీవ్ర గందరగోళం నెలకొంది. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల నెపంతో సస్పెండ్ అయిన ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్‌ల వ్యవహారంపై ఓటింగ్ నిర్వహించాలని విపక్ష నేత మధుసూధనాచారి డిమాండ్ చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఓటింగ్‌కు నిరాకరించడంతో, ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ మండలి సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అయితే, ఇప్పటివరకు జరిగిన పరిణామాల మధ్య కాంగ్రెస్ విసిరిన పొలిటికల్ ట్రాప్‌లో పడి బీఆర్ఎస్ ప్రజా సమస్యలపై చర్చించే అవకాశాన్ని కోల్పోయిందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.