హైదరాబాద్‌లో ఇంట‌ర్నెట్ వైర్ల‌ను ఎందుకు తెంపేస్తున్నారు? అస‌లేం జ‌రుగుతోంది?

Published : Aug 21, 2025, 05:34 PM IST

ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో ప‌లు చోట్ల ఇంట‌ర్నెట్ అంత‌రాయం ఏర్ప‌డింది. దీంతో వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేస్తున్న ఉద్యోగులు, ఇంట‌ర్నెట్ ఆధారంగా ప‌నిచేస్తున్న వ్యాపారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ స‌మ‌స్య‌కు అస‌లు కార‌ణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
ఇంటర్నెట్ అవుటేజ్‌కు కారణం ఏంటి?

హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సర్వీసులు నిలిచిపోయాయి. ఆమీర్‌పేట్, బాలానగర్, కొంపల్లి, షేక్‌పేట్, బంజారా హిల్స్, కోకాపేట్, తెల్లాపూర్ వంటి ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఆగస్టు 19న ఉప ముఖ్యమంత్రి మల్లూ భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు TGSPDCL అధికారులు విద్యుత్ కంబాలపై వేలాడుతున్న వైర్లను తొలగించడం మొదలుపెట్టారు. ఈ చర్య వల్ల‌ లక్షకు పైగా ఇంటర్నెట్ కనెక్షన్లు దెబ్బతిన్నాయి.

25
ప్రధాన కారణం ఏంటంటే.?

ఇటీవల నగరంలో జరిగిన విద్యుత్ ప్రమాదాల తర్వాత ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. ఆగస్టు 18న రామాంతాపూర్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి రథయాత్ర సందర్భంగా ఆరుగురు విద్యుత్ షాక్‌తో మృతి చెందారు. ఆగస్టు 19న బండ్లగూడలో గణేశ్ విగ్రహ శోభాయాత్రలో ఇద్దరు విద్యుత్ తీగల ప్రమాదంలో మరణించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని వేలాడే కేబుళ్లను తొలగించాలని ఆదేశించింది.

35
తీవ్ర ఇబ్బందులు

ఉన్న‌ప‌లంగా ఇంటర్నెట్ నిలిచిపోవడంతో ఐటీ ప్రొఫెషనల్స్, వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరు తమ ఉద్యోగాలను కోల్పోయామని సోషల్ మీడియాలో వాపోయారు. “ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇంటర్నెట్ కట్ చేయడం తప్పు” అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

45
కోర్టు తీర్పుతో తాత్కాలిక ఉప‌శ‌మ‌నం

సెల్యూల‌ర్ ఆప‌రేట‌ర్స్ అసోసియేష‌న్ ఆఫ్ ఇండియా (COAI), తెలంగాణ ఇంట‌ర్నెట్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్స్ అసోసియేష‌న్ (TISPA) ఈ చర్యను తప్పుబట్టాయి. ISPలు TGSPDCL కార్యాలయం ఎదుట నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. ముందస్తు సమాచారం లేకుండా ఇలా కేబుళ్లు కత్తిరించడం తగదని అన్నారు. భారతి ఎయిర్‌టెల్ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై కోర్టు తాత్కాలిక ఉపశమనం ఇచ్చి, తదుపరి విచారణ వరకు మరిన్ని కేబుళ్లు తొలగించవద్దని ఆదేశించింది.

55
రాజకీయ విమర్శలు

బీఆర్‌ఎస్ నాయకుడు కేటీఆర్ కాంగ్రెసు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. “ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముందస్తు ప్రణాళిక లేకుండా కేబుళ్లు కత్తిరించడం అవివేకం” అని ఎక్స్ వేదిక‌గా పోస్ట్ చేశారు. అయితే TGSPDCL మాత్రం ఈ చర్య ప్రజల భద్రత కోసం తప్పనిసరి అని చెబుతోంది. కానీ ముందస్తు సమన్వయం లేకపోవడం, ఇంటర్నెట్ వినియోగదారులకు సమాచారం ఇవ్వకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది.

Read more Photos on
click me!

Recommended Stories