రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. ఇక‌పై ఇంట‌ర్మీడియ‌ట్ ఉండ‌దా.?

Published : Aug 21, 2025, 03:22 PM IST

తెలంగాణ ప్ర‌భుత్వం విద్యా వ్య‌వ‌స్థ‌లో కీల‌క నిర్ణ‌యం దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇంట‌ర్ బోర్డును ర‌ద్దు చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం. పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి. 

PREV
15
ఇంటర్‌ బోర్డుకు శుభం ప‌డ‌నుందా.?

తెలంగాణలో ఇంటర్‌ బోర్డు రద్దుకు దారితీసే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. త్వరలోనే ఇవి పాఠశాల విద్యాశాఖలో విలీనం కానున్నట్లు సమాచారం. నర్సరీ నుంచి ఇంటర్‌ వరకు ఒకే విధమైన విద్యా వ్యవస్థను పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నడపాలనే ప్రతిపాదనపై తెలంగాణ విద్యా కమిషన్‌ నివేదిక సిద్ధం చేసింది. ఈ నివేదికను వచ్చే వారంలో ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది.

25
చారిత్రక పునర్వ్యవస్థీకరణ

తెలంగాణలో ఇంటర్‌ బోర్డు 1968లో అప్పటి మంత్రి పీవీ నరసింహారావు ఆధ్వర్యంలో ప్రారంభమైంది. 1969-70 విద్యాసంవత్సరంలోనే ఇంటర్‌ తరగతులు మొదలయ్యాయి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దాదాపు తొమ్మిది లక్షల విద్యార్థులు ఇంట‌ర్మీడియ‌ట్‌ను అభ్య‌సిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 430 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో లక్షా అరవై వేల మందికిపైగా చదువుతున్నారు. ఇప్పుడు వీటిని పాఠశాల విద్యలో విలీనం చేయడం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

35
కేంద్ర విద్యాలయ తరహా మోడల్

కమిషన్‌ సిఫారసుల ప్రకారం, ఇంటర్‌ విద్యను పాఠశాల విద్యలో కలిపితే విద్యార్థుల డ్రాపౌట్స్‌ తగ్గుతాయని భావిస్తున్నారు. కేంద్రీయ విద్యాలయాల తరహాలో కొత్తగా ఏర్పాటయ్యే తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లలో ఇంటర్‌ వరకు బోధన ఉండేలా ప్రతిపాదన సిద్ధమైంది. ఒక మండలంలో జూనియర్‌ కాలేజీ ఉంటే దానిని పబ్లిక్‌ స్కూల్‌కు అనుబంధంగా మార్చాలని సూచించారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా అభిప్రాయ సేకరణ కూడా నిర్వహించారు.

45
సీఎం రేవంత్‌ సమీక్షలో చర్చ

ఇంటర్‌ బోర్డు విలీనం అంశం గత నెలలో జరిగిన విద్యాశాఖ సమీక్షలో ముఖ్యంగా చర్చకు వచ్చింది. 1–8 తరగతులను సెకండరీగా, 9–12 తరగతులను సీనియర్‌ సెకండరీగా ఒకే చోట నడిపే విధానంపై ముఖ్యమంత్రి రేవంత్‌ అధికారులను సమగ్ర అధ్యయనం చేయమని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల విద్యా విధానాలు, అడ్మిషన్లు, డ్రాపౌట్స్‌, ఫలితాలను పరిశీలించాలని సూచించారు. ఇదే సమయంలో కేంద్ర విద్యాశాఖ కూడా ఒకే రాష్ట్రంలో రెండు వేర్వేరు బోర్డులు ఎందుకు అవసరమని ప్రశ్నించింది. దీంతో ఈ మార్పుల దిశగా చర్యలు వేగంగా సాగుతున్నాయి.

55
జేఏసీ తీవ్ర వ్యతిరేకత

ఇంటర్‌ విద్యను పాఠశాల విద్యలో కలిపేయాలనే ప్రతిపాదనను ఇంటర్‌ విద్యా జేఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. జేఏసీ చైర్మన్‌ మధుసూదన్‌ రెడ్డి మాట్లాడుతూ, ఇది విద్యా రంగాన్ని 50 ఏళ్ల వెనుకకు నెట్టే చర్య అవుతుందని పేర్కొన్నారు. దీన్ని తిరోగమన నిర్ణయంగా అభివర్ణిస్తూ, ప్రభుత్వం ఈ ఆలోచనను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories