
క్లౌడ్‌బర్స్ అనేది ఒక ప్రదేశంలో అత్యంత తక్కువ వ్యవధిలో భారీ వర్షం పడే ప్రకృతిలో జరిగే ఒక ఘటన. ఒక రకంగా ఇది నివాస ప్రాంతాలకు సంభవించే ప్రకృతి విపత్తు. మానవులతో పాటు జీవజాతులపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
సాధారణంగా గంట వ్యవధిలో 100 మిల్లీమీటర్ల (10 సెంటీమీటర్ల) కంటే ఎక్కువ వర్షపాతం ఒక చిన్న భౌగోళిక ప్రాంతంలో ( 10–30 చ.కిమీ) సంభవిస్తే దానిని క్లౌడ్ బరస్ట్ గా పరిగణిస్తారు. ఇవి సాధారణంగా తుఫాను మేఘాల మధ్య ఏర్పడతాయి. ఈ ఘటనలు భారీ వర్షాలతో వచ్చే వరదలు, కొండచరియలు విరిగిపడటం, భూస్లైడ్‌లు వంటి విపత్తులకు దారితీసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
క్లౌడ్ బరస్ట్ పై చాలా కాలం నుంచి అధ్యయనాలు కొనసాగుతున్నాయి. వాతావరణ శాస్త్రవేత్తలు క్లౌడ్ బరస్ట్ ఏర్పడే ప్రధాన కారణాలను ఈ విధంగా వివరించారు:
1. ఒరోగ్రాఫిక్ లిఫ్ట్ (Orographic Lift): బంగాళాఖాతం లేదా అరేబియా సముద్రం నుండి వచ్చే తేమతో కూడిన గాలులు కొండలపైకి ఎక్కే సమయంలో వేగంగా పైకి లేచి భారీ మేఘాలను సృష్టిస్తాయి. ఇవి అధికంగా నీరు కలిగి ఉండి, ఒక్కసారిగా భారీ వర్షాన్ని కురిపిస్తాయి. అది కూడా తక్కువ ప్రాంతంలో ఉంటుంది.
2. స్థానిక గాలుల ప్రభావం (Localized Updrafts): నిలువుగా పైకి ఎగసే గాలులు లేదా చక్రాకార గాలుల ప్రభావంతో వర్షపు నీటిని పైభాగంలో నిలిపి ఉంచుతాయి. ఆ గాలులు బలహీనపడినప్పుడు భారీ వర్షంగా కురుస్తుంది.
3. వాతావరణ మార్పులు (Climate Change): ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ గాలి తేమను ఎక్కువగా నిల్వ చేసేందుకు సామర్థ్యం పొందుతుంది. ఇది ఎక్కువ వర్షపాతం సంభవించే అవకాశాన్ని పెంచుతుంది.
కొండ ప్రాంతాలు (Mountainous Regions): హిమాలయాలు, పశ్చిమ కనుమలు వంటి ఎత్తైన భౌగోళిక ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్‌లు ఎక్కువగా సంభవిస్తాయి.
ఉదాహరణ: ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లడ్డాక్, నేపాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ మొదలైన హిమాలయాన ప్రాంతాలు.
మేఘాలు పైకి ఎక్కే అవకాశం ఉన్న ఎత్తైన ప్రాంతాలు (Orographic regions): అరేబియా సముద్రం, బంగాళాఖాతం నుండి వచ్చే తేమతో కూడిన గాలులు కొండలపైకి లేచి, పైభాగంలో భారీ మేఘాలను సృష్టిస్తాయి. వీటిని "ఒరోగ్రాఫిక్ లిఫ్ట్" (orographic lift) అంటారు.
అత్యధిక తేమ ఉన్న ప్రాంతాలు (Regions with High Moisture Content): మాన్సూన్ సీజన్‌లో తేమ అధికంగా ఉండే ప్రాంతాల్లో, ఆ గాలులు పైకి లేచేలా కొండలు ఉంటే క్లౌడ్ బరస్ట్ ను ప్రేరేపించవచ్చు.
తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లు తక్కువ ఎత్తు, పల్లంగా విస్తరించిన మైదాన ప్రాంతాలుగా ఉండటంతో ఇక్కడ క్లౌడ్‌బర్స్ చాలా అరుదు. ఉదాహరణకు 2000 ఆగస్టు 24న హైదరాబాదులో కొన్ని గంటల వ్యవధిలో 242 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అయితే ఇది క్లౌడ్‌బర్స్‌గా పరిగణించరు. ఎందుకంటే అది గంట వ్యవధిలో కురిసిన వర్షం కాదు.
అలాగే, 2022 జూలైలో గోదావరి నదిలో సంభవించిన వరదలకు క్లౌడ్ బరస్ట్ కారణం కాదనీ, దీర్ఘకాలికంగా కురిసిన భారీ వర్షాలే కారణమని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటివరకు భారత వాతావరణ శాఖ (IMD) గోదావరి-కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో క్లౌడ్‌బరస్ట్ వచ్చాయని ధృవీకరించలేదు.
మొత్తంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి సమతల ప్రాంతాల్లో క్లౌడ్‌బర్స్ అనేది చాలా అరుదుగా సంభవించే ప్రకృతి వైపరీత్యంగా నిపుణులు పేర్కొంటున్నారు.
1969 నుంచి 2015 వరకూ 126 వాతావరణ కేంద్రాల్లో సేకరించిన గడిచిన 46 సంవత్సరాల డేటా ఆధారంగా, భారత్‌లో కేవలం 28 క్లౌడ్ బరస్ట్ ఘటనలు మాత్రమే నమోదు అయ్యాయి. కాగా , 130 చిన్న క్లౌడ్‌బర్స్ (2 గంటల్లో 50 మిల్లీమీటర్ల వర్షం) నమోదయ్యాయి. అంటే, ఏడాదికి సగటున ఒక క్లౌడ్‌బర్స్ మాత్రమే జరిగింది. అయితే, 2015 తర్వాత ఈ సంఖ్య కాస్త పెరిగిందని వాతవారణ నివేదికలు పేర్కొంటున్నాయి.
భారతదేశంలోని హిమాలయ ప్రాంతాలు, పడమటి తీర ప్రాంతాలు వంటి కొండప్రాంతాల్లో ఈ ఘటనలు ఎక్కువగా సంభవిస్తున్నాయని తేలింది. కానీ, తెలంగాణ, ఏపీ వంటి సమతల ప్రాంతాల్లో క్లౌడ్‌బర్స్ దాదాపు వచ్చే అవకాశాలు లేవని నిపుణులు పేర్కొంటున్నారు.
భారీ వర్షానికి సంబంధించి భారత వాతావరణ శాఖ (IMD) జిల్లా స్థాయిలో హెచ్చరికలు ఇస్తుంది. అయితే క్లౌడ్ బరస్ట్ కు ప్రత్యేక హెచ్చరికలు ఇవ్వడం సాధ్యం కాదు, ఎందుకంటే ఇవి అత్యంత తక్కువ సమయంలో హఠాత్ గా సంభవిస్తాయి.
కొన్ని ప్రాంతాల్లో డాప్లర్ రాడార్ ఆధారంగా తక్షణపు వాతావరణ సూచనలు ఇవ్వగలుగుతున్నా, ఇవి ఎక్కువగా కొండప్రాంతాల్లో లేకపోవడం వల్ల స్పష్టమైన హెచ్చరికలు రావడం కష్టమే.
ప్రభుత్వాలు, ప్రజలు ప్రాథమికంగా హెచ్చరికలు, సురక్షిత ప్రదేశాలకు త్వరగా తరలింపు, నీటి పారుదల మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
అలాగే, నదీ ప్రవాహాలపై AI ఆధారిత వరద అంచనాల వ్యవస్థలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. ఇవి కొన్ని రోజులు ముందే హెచ్చరికలు ఇవ్వగలవు. ఈ దిశగా కూడా పరిశోధనలు, టెక్నాలజీ మార్పులు జరుగుతున్నాయి.