రేవంత్ కాదు కేసీఆర్ కేబినెట్ లోనే మంత్రి..: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంపముంచేలా ఉన్నాడుగా

Published : Aug 06, 2025, 04:19 PM ISTUpdated : Aug 06, 2025, 04:28 PM IST

Komatireddy Rajagopalreddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సొంతపార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే…

PREV
15
రేవంత్ కు పక్కలో బళ్లెంలా మారిన రేవంత్ రెడ్డి

Komatireddy Rajagopal Reddy : స్వపక్షంలోనే విపక్షంగా మారిపోయారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి... ఈ తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు సొంత ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనే విమర్శలు చేస్తున్నారు. మొదట్నుంచి సీఎంను టార్గెట్ చేస్తున్న రాజగోపాల్ రెడ్డి ఇటీవల మంత్రిపదవి ఆశించి భంగపడ్డాక మరింత డోస్ పెంచారు. తాజాగా సీఎం ఏ మాట్లాడిన దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు... తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు రాజగోపాల్ రెడ్డి.

DID YOU KNOW ?
కోమటిరెడ్డి బ్రదర్స్
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఇద్దరూ సొంత అన్నదమ్ములు. నల్గొండ జిల్లాకు చెందిన పాపిరెడ్డి, సుశీలమ్మ దంపతులకు వీరిద్దరు సంతానం.
25
'రేవంత్.. భాష మార్చుకో'

ఇటీవల రేవంత్ రెడ్డి మరో పదేళ్ళు తానే తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటానని కామెంట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే రియాక్ట్ అయ్యారు రాజగోపాల్ రెడ్డి... తాజాగా మరోసారి దీనిపై స్పందించారు. మరో మూడున్నరేళ్లు మాత్రమే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని... ఆ తర్వాత ఎవరనేది ప్రజలు, కాంగ్రెస్ అదిష్టానం నిర్ణయిస్తుందని రాజగోపాల్ రెడ్డి అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇకనైనా ప్రతిపక్షాలను తిట్టడం మానేసి పాలనపై దృష్టి పెట్టాలని సూచించారు. ముఖ్యంగా సీఎం హుందాగా నడుచుకోవాలని... భాష మార్చుకుంటే మంచిదని సూచించారు. అసలు ప్రభుత్వం ప్రజలకు ఏం చేస్తుందో చెప్పాలని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు.

35
మంత్రిపదవి కేసీఆర్ ఇచ్చేవారు : రాజగోపాల్ రెడ్డి

ఇక తనకు మంత్రి పదవి దక్కకపోవడంపైనా మరోసారి స్పందించారు రాజగోపాల్ రెడ్డి. ఇప్పటికే గత ఎన్నికలకు ముందు తనను పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అదిష్టానం అధికారంలోకి వస్తే మంత్రిపదవి ఇస్తానని హామీ ఇచ్చారని గుర్తుచేసారు. మరోసారి ఈ విషయాన్ని రాజగోపాల్ రెడ్డి ప్రస్తావించారు. అయితే తనకు మంత్రిపదవి హామీ గురించి సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి తెలియదని... అందుకే ఆయన స్పందించడానికి ఇష్టపడటంలేదని అన్నారు. తనకు మంత్రిపదవి ముఖ్యంకాదు... అనుకుంటే గతంలో బిఆర్ఎస్ లోకి వెళితే కేసీఆర్ ఈజీగా ఇచ్చేవారని అన్నారు.

45
కాంగ్రెస్ హయాంలోనూ సీమాంధ్ర కాంట్రాక్టర్ల పెత్తనమేనా?

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంవెనక ఏ ఒక్కరో లేరు... ఇది అందరు నాయకుల సమిష్టి ఫలితమని అన్నారు. కానీ అధికారంలోకి రాగానే కొందరుమాత్రమే పెత్తనం చేస్తున్నారనేలా రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. ఇలాంటివారివల్లే కాంగ్రెస్ పార్టీ నాశనం అవుతోందని... కాబట్టి ప్రజలకు దూరం అవుతోందనేలా రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ ఏర్పాటుతర్వాత కూడా ప్రతి పనిలో సీమాంధ్ర కాంట్రాక్టర్ల పెత్తనమే కొనసాగుతోందని... కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ పరిస్థితి మారలేదని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణను సీమాంధ్ర కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా తెలంగాణవారికి ప్రభుత్వ పనులు అప్పగించాలని కోరారు.

55
కేసీఆర్ రాజీనామా చెయ్ : రాజగోపాల్ రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటుచేసిన జస్టిస్ పిసి ఘోష్ కమీషన్ నివేదికను ఇటీవల తెలంగాణ మంత్రిమండలి ఆమోదించింది... దీంతో ఆధారంగానే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్ఫష్టం చేసింది. కానీ ఇలా కమిషన్ల పేరుతో కాలయాపన చేయడం ఆపాలని... వెంటనే కాళేశ్వరం అవినీతిలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాజగోపాల్ రెడ్డి సూచించారు. ఈ దిశగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని సలహా ఇచ్చారు.

తెలంగాణ ఏర్పాటుతర్వాత వరుసగా పదేళ్లపాటు బిఆర్ఎస్ అధికారంలో ఉంది... కాబట్టి ఒక్కసారిగా అధికారం కోల్పోయేసరికి ఆ పార్టీ నాయకులు ఫ్రస్టేషన్‌లో ఉన్నారన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్‌ విఫలమయ్యాడు...కాబట్టి రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories